iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 17 – గులాబో సితాబో

లాక్ డౌన్ రివ్యూ 17 – గులాబో సితాబో

థియేటర్లు సుదీర్ఘ కాలంగా మూతబడి ఓటిటి విప్లవానికి కొత్త దారులు చూపిస్తున్న లాక్ డౌన్ వేళ స్టార్లు నటించిన సినిమాలు సైతం డిజిటల్ దారిన పడుతున్నాయి. ఇంట్లోనే కూర్చుని తాపీగా ఎలాంటి జంజాటం లేకుండా చూసే సౌలభ్యం రావడంతో ప్రేక్షకులకు డైరెక్టర్ ప్రీమియర్ షోలు చూసే అవకాశం దక్కుతోంది. అందుకే బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన గులాబో సితాబో మీద ముందు నుంచే అంచనాలు ఉన్నాయి, అందులోనూ గత రెండేళ్ళుగా విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేకమైన ఫాలోయింగ్ దక్కించుకున్న ఆయుష్మాన్ ఖురానా కూడా ఇందులో ఉండటంతో హైప్ ఇంకాస్త పెరిగింది. మరి నిన్న అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ లోకి వచ్చేసిన ఈ లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం

కథ

లక్నో నగరంలో వందేళ్ళ చరిత్ర గల పురాతన మ్యాన్షన్ హౌస్ ఫాతిమా ప్యాలెస్. దాని యజమాని బేగం(ఫరుఖ్ జఫార్). ఆవిడ భర్త మిర్జా(అమితాబ్ బచ్చన్)ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళ నుంచి అద్దెలు వసూలు చేసుకుంటూ హక్కుదారు కావడం కోసం ఆమె ఎప్పుడు చనిపోతుందాని ఎదురు చూస్తుంటాడు. అందులోనే కిరాయికి ఉండే పిండి గిర్నీ ఓనర్ బాంకే(ఆయుష్మాన్ ఖురానా)కు మిర్జాకు అస్సలు పడదు. ఈ ప్యాలెస్ పురాతన కట్టడం కిందకు వస్తుందంటూ పురావస్తు శాఖ అధికారి గ్యానేష్ శుక్లా(విజయ్ రాజ్)ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాడు. ఈలోగా లాయర్ క్రిస్టోఫర్(బ్రిజేంద్ర కాలా)సహాయంతో బిల్డింగ్ అమ్మే పనిలో పడతాడు మిర్జా. దాన్ని అడ్డుకునేందుకు బాంకే మిగిలిన టెనెంట్స్ తో కలిసి ఎత్తుగడలు వేస్తుంటాడు. ఇలా ఆట మొదలై చివరికి ఎవరూ ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. అవేంటనేది తెరమీదే చూడాలి

నటీనటులు

ఇండియన్ సినిమా అనే డిక్షనరీలో తనకంటూ కొన్ని పేజీలు ప్రత్యేకంగా రాసుకున్న అమితాబ్ బచ్చన్ ఈ గులాబో సితాబోకున్న ప్రధాన బలం. అసలు అంత సులువుగా గుర్తుపట్టలేని రీతిలో మేకప్ తో కనిపించడం ఒక ఎత్తైతే చూస్తున్నంత సేపు మనకు బిగ్ బి కాకుండా మీర్జానే కనిపించేలా అందులో పరకాయ ప్రవేశం చేయడం మరో ఎత్తు. ఇంచుమించు తన వయసుకు ఓ పదేళ్ళు పెద్ద అయిన పాత్రలో ఆయన ఒదిగిన తీరు చూస్తుంటే నోట మాట రాదు. గూనితో కూడిన ఒక విధమైన నడకతో ప్రత్యేకంగా అలవరుచుకున్న బాడీ లాంగ్వేజ్ తో ఎగుడుదిగుడుగా ఉన్న గులాబో సితాబో గ్రాఫ్ ని మరీ దారుణంగా పడిపోకుండా అడ్డుకట్ట వేశారు.

ఈ పాత్ర అమితాబ్ కాకుండా ఇంకే సీనియర్ నటుడు వేసినా అరగంటకే ఆపేయాలనిపించడం ఖాయం. ఆయుష్మాన్ ఖురానాకు ఇది మరీ ఛాలెంజింగ్ రోల్ కాదు. అలా చేసుకుంటూ పోయాడు. కొన్ని సీన్స్ లో మాత్రం బిగ్ బితో పోటీ పడేలా పెర్ఫార్మన్స్ ఇవ్వడం మెచ్చుకోవచ్చు. నలుగురు చెల్లెళ్ళు తప్ప హీరొయిన్ లేని క్యారెక్టర్ ఇది. మిగిలిన వాళ్ళలో ఎక్కువ గుర్తుండేది లాయర్ గా నటించిన బ్రిజేంద్ర కాలా, ఆర్కియాలజి ఆఫీసర్ గా చేసిన విజయ్ రాజ్. ఈ ఇద్దరూ సహజంగా అల్లుకుపోయారు. వీళ్ళు కాకుండా చోటా మోటా క్యాస్టింగ్ ఇంకో ఇరవై దాకా ఉన్నారు. అందరివి కాసిన్ని సీన్లే కాబట్టి అదే పనిగా మాత్రం ఎవరూ గుర్తుండరు.

డైరెక్టర్ అండ్ టీం

దర్శకుడు సుజిత్ సిర్కార్ ది ముందు నుంచి చాలా విలక్షణమైన శైలి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా జోలికి పోకుండా విభిన్నమైన కథలతో అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమాలనే ఇప్పటిదాకా తీస్తూ వచ్చాడు. గులాబో సితాబోలో కూడా అదే ప్రయత్నం చేశాడు కాని ఇది ఖచ్చితంగా అతన్నుంచి ఆశించింది మాత్రం కాదు. మనిషిలో అత్యాశను, అవసరాలకు తగ్గట్టు మారిపోయే మనస్తత్వాలను ఫాతిమా ప్యాలెస్ ను వేదికగా మార్చుకుని కొత్త తరహాలో చూపించే ఎత్తుగడ ఈసారి పారలేదు. రెండు గంటల పది నిమిషాల పాటు సాగే డ్రామాలో హక్కుదారు-కిరాయిదారు మధ్య ఎమోషన్ ని రిజిస్టర్ చేయడంతో సుజిత్ సిర్కార్ తడబడటంతో జరిగేదంతా ఒక ప్రహసనంగా అనిపిస్తుంది.

మీర్జా క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన తీరు బాగానే అనిపిస్తుంది కాని చుట్టూ అల్లుకున్న పాత్రలకు సరైన హోం వర్క్ జరగకపోవడంతో ఏ దశలోనూ అవి కనెక్ట్ కాలేకపోయాయి. పైపెచ్చు ఆ బంగాళాతో సంబంధం లేని లాయర్, ఆఫీసర్లే ఎక్కువ సీన్లలో కనిపించడం గులాబో సితాబోలోని అసలు ఉద్దేశాన్ని దెబ్బ తీసింది. మీర్జా నిస్సహాయుడిగా మారినప్పుడు అద్దెకుండేవాళ్ళంతా ఏకమై అతనికి అండగా నిలబడి ఉన్నా కథనం ఇంకోలా సాగి మెప్పించేదేమో. కాని సుజిత్ ఆలోచన వేరుగా ఉన్నా అది తెరపై మాత్రం ప్రతిభావంతంగా కనిపించలేదు. అలా అని గులాబో సితాబోని రాంగ్ మూవీగా ప్రొజెక్ట్ చేయడం లేదు. ఓ పాత పాడుబడిన పెద్ద కొంపలో ఓ అయిదారు కుటుంబాలు ఇరుకిరుకు జీవనం కొనసాగిస్తూ తక్కువ అద్దె చెల్లిస్తూ తిరిగి యజమాని మీదే ఎత్తులు వేయడం అనే పాయింట్ లో చాలా ఆసక్తి నెలకొని ఉంది. దానికి మీర్జా మితిమీరిన ఆశని కాన్సెప్ట్ గా తీసుకుని లిక్ చేయడమూ బాగుంది. న్యాచురల్ గా అనిపించేలా నిజంగానే అలాంటి బిల్డింగ్ ని వెతికి మరీ సెట్ చేసుకుని లక్నో నగరంలో దిగువ మధ్య తరగతి సగటు జీవన శైలిని ఆవిష్కరించే విధానమూ బాగుంది. కాని గులాబో సితాబోని నిలబెట్టడానికి ఇవి మాత్రమే సరిపోలేదు.

కథ చాలాసేపు ముందుకు సాగదు. మొదటి గంట ఒకే చోట నిరాసక్తంగా ఉంటుంది. పోనీ మీర్జా-బాంకేల మధ్య థ్రెడ్ ని బలంగా చూపించేలా ఏదైనా మేజిక్ చేశారా అంటే అదీ లేదు. అందుకే ఒక దశ దాటాక గులాబో సితాబో బోర్ కొట్టేస్తుంది. ఎంతసేపటికీ కథ ముందుకు కదలక నత్తనడక సాగించడంతో అమితాబ్ కూడా ఏమి చేయలేని నిస్సహాయుడిగా కనిపిస్తాడు. బాంకే పెద్ద చెల్లెలు ఉద్యోగం కోసం గ్యానేష్ శుక్లాకు వల వేయడం ఏ మాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు. ఎందుకంటే ముందు నుంచి ఆ పాత్ర పట్ల అలాంటి అభిప్రాయం కలిగేలా సుజిత్ తను చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాడు. ఇలాంటి ఉదాహరణలు ఇందులో చాలానే ఉన్నాయి. కాని మరీ ఇంత సింపుల్ స్టొరీ లైన్ తో కాకుండా కొంచెం డెప్త్ ఉండేలా రాసుకున్నా ఖచ్చితంగా గులాబో సితాబో ఇంకో స్థాయిలో ఉండేది. ఆ ఛాన్స్ మిస్ అయ్యింది

టీం వరకు బాగానే కష్టపడింది. శంతను మొయిత్రా నేపధ్య సంగీతం పర్వాలేదు. మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదనిపిస్తుంది. సింక్ సౌండ్ తరహాలో రికార్డింగ్ చేసిన ఫీలింగ్ వచ్చేలా డిఫరెంట్ టోన్ లో బిజిఎం ఇచ్చారు. ఇతనితో పాటు అభిషేక్-అనుజ్ లు ఇచ్చిన పాటలు సోసోనే. అవిక్ ముఖోపాధ్యాయ ఛాయాగ్రహణం మాత్రం బాగుంది. ఫాతిమా ప్యాలెస్ లో తిరుగుతున్నట్టే అక్కడి వాతావరణాన్ని ఫీలయ్యేలా కలర్ స్కీం ని సెట్ చేసుకుని దర్శకుడు కోరుకున్న ఫీల్ ని తెరమీద తీసుకురాగలిగాడు. ఇందులో ఆర్ట్ డైరెక్టర్ చేసిన కృషిని కూడా మెచ్చుకోవాలి. చంద్రశేఖర్ ప్రజాపతి ఎడిటింగ్ ఇంకో పావు గంట కోత వేసినా సాగతీత తగ్గేది. రోనీ లాహిరి-శీల్ కుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సింపుల్ బడ్జెట్ లో క్వాలిటీగా ఖర్చు పెట్టారు.

ప్లస్ గా నిలిచినవి

అమితాబ్ బచ్చన్ నటన
సహజమైన లక్నో నేటివిటీ
ఆర్ట్ వర్క్
క్యాస్టింగ్

మైనస్ గా తోచేవి

ఫస్ట్ హాఫ్
కథలో లోతు లేకపోవడం
మిస్ అయిన ఎమోషన్
మ్యూజిక్
నిడివి

చివరి మాట

ఒక నట శిఖరం, ఒక టాలెంటెడ్ దర్శకుడు కలిస్తే ఆ కాంబినేషన్ నుంచి గొప్ప సినిమా ఆశించడం తప్పేమీ కాదు. అందుకే గులాబో సితాబో ప్రకటన వచ్చిన నాటి నుంచే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. కాని అదే దీనికి ప్రతిబంధకంగా మారింది. మెయిన్ లీడ్ గెటప్ విభిన్నంగా ఉండి ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ఎంత గొప్పగా ఉన్నా అసలైన కథా కథనాల్లో విషయం తక్కువగా ఉంటే ప్రేక్షకులను మెప్పించడం కష్టం. ఇందులో జరిగింది అదే. మంచి ఆర్ట్ వర్క్, సహజమైన లొకేషన్లు, డిఫరెంట్ స్టొరీ లైన్ ఇవేవి గులాబో సితాబోని కాపాడలేకపోయాయి. అన్నింటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఆద్యంతం ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే. అది లేకపోతే ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. గులాబో సితాబోలో దురదృష్టవశాత్తు అదే జరిగింది. కేవలం అమితాబ్ కోసమే చూడాలి అనే కారణమైతే నిరాశపరిచే అవకాశాలు తగ్గుతాయి కాని లేదంటే థియేటర్ కు వెళ్ళకుండా ఇంట్లోనే ఎక్కువ ఖర్చు లేకుండా చూసినందుకు సంతోషించడమైతే ఖాయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి