iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 44 – చీకటి వ్యాపారం

లాక్ డౌన్ రివ్యూ 44 –  చీకటి వ్యాపారం

మనదగ్గర వెబ్ సిరీస్ ల ప్రభంజనం తక్కువగానే ఉంది కానీ హిందీలో మాత్రం గత ఏడాది నుంచి వీటి దూకుడు హండ్రెడ్ స్పీడ్ లో సాగుతోంది. కంటెంట్ కి పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని పలు సంస్థలు ఒకదాన్ని మించి మరొకటి కొత్త తరహా రియలిస్టిక్ కాన్సెప్ట్స్ తో వస్తున్నాయి. పైకి పోటీ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ల మధ్యే కనిపిస్తోంది కానీ కొత్తగా ఈరోస్ లాంటి దశాబ్దాల చరిత్ర ఉన్న సంస్థలు కూడా ఓటిటిలో అడుగు పెడుతున్నాయి. ప్రేక్షకులకు ఆకట్టుకోవడానికి డిఫరెంట్ థ్రిల్లర్ ను ప్లాన్ చేసుకుంటున్నాయి. అందులో భాగంగా వచ్చిందే ఫ్లెష్. ఎంతసేపు సైకో కిల్లర్ కథలతో మొహం మొత్తేలా నడుస్తున్న ట్రెండ్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ మీద వచ్చిన ఈ సిరీస్ మీద అంచనాలు బాగానే సాగాయి. మరి ఇది మెప్పించేలా సాగిందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

ధనవంతుల కుటుంబానికి చెందిన 16 ఏళ్ళ ఎన్ఆర్ఐ టీనేజర్ జోయా(మహిమా మక్వానా)ను ఓ స్నేహితుడు ప్రేమ పేరుతో మోసం చేసి అమ్మాయిలను విదేశాలకు ఎగుమతి చేసే ముఠాకు అమ్మేస్తాడు. మాయమైన తమ కూతురి కోసం జోయా తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ తన జాడ అంత సులభంగా దొరకదు. ఇదే తరహా కేసును డీల్ చేస్తున్న ఏసిపి రాధ(స్వర భాస్కర్)అనుకోకుండా సస్పెండ్ అవుతుంది. దీంతో జోయా తండ్రి డబ్బుని ఎరగా చూపి తన కూతురి జాడని ప్రైవేట్ గా కనుక్కోమని వేడుకుంటాడు. దీనికి ఒప్పుకున్న జోయా విచారణ మొదలుపెడుతుంది. ఈలోగా జోయాను తీసుకెళ్తున్న ట్రక్కుకు ఓ సిక్కు లారీ డ్రైవర్ మర్డర్ కు లింక్ తెలుస్తుంది. అసలు ఈ దందా ఎవరు చేస్తున్నారు, జోయా చివరికి క్షేమంగా బయట పడిందా లేదా అనేదే అసలు స్టోరీ. ఇందులో చాలా ఉపకథలు ఉన్నాయి. ఒకదానికి మరొకటి అవి లింక్ అయిన తీరు ఇక్కడ చెప్పడం కన్నా తెరమీద చూస్తేనే బాగుంటుంది

నటీనటులు

చేసింది తక్కువ సినిమాలే అయినా ఒకరకమైన బోల్డ్ అప్పీల్ తో గుర్తింపు తెచ్చుకున్న స్వరభాస్కర్ ఇందులో ఏసిపి రాధగా పర్ఫెక్ట్ గా సరిపోయింది. పరిచయ సన్నివేశంలో అతకని ఎక్స్ ప్రెషన్స్ తో ఏదోలా అనిపించినా ఆ తర్వాత సిరీస్ మొత్తం మంచి ఈజ్ తో నడిపించేసింది. బొద్దుగా మారిన దేహంతో రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ గా కరుకుదనాన్ని, దూకుడుని రెండూ ప్రదర్శించింది. కథలో సెంటర్ పాయింట్ అయిన మహిమాకు స్కోప్ ఎక్కువ దొరికినప్పటికీ అంతగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. విలన్లలో ఒకడిగా చేసిన అక్షయ్ ఒబెరాయ్ మాత్రం భయపెట్టేశాడు. నిజంగా సైకోలు ఇలానే ఉంటారా అనిపించేలా చాలా రియలిస్టిక్ గా చేశాడు. కవిన్ దవే, విద్య మాల్వదే, యుద్ధిష్టిర్, సిద్ధాంత భేల్ తదితరులు ఆయా పాత్రలకు తగ్గట్టు న్యాచురల్ గా చేశారు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఇందులో చాలా పాత్రలు ఉన్నాయి. అధిక శాతం పరిచయం లేని తారాగణమే వీటిని చేశారు. అయినప్పటికీ ఎవరిలోనూ అనుభవలేమి కనిపించదు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు ధనిష్ అస్లామ్ తీసుకున్న పాయింట్ ఖచ్చితంగా ఆలోచించాల్సిన సీరియస్ విషయమే. రోజురోజుకి మితిమీరిపోతున్న అమ్మాయిల అపహరణ, అడ్డుఅదుపు లేకుండా స్థానిక పోలీసులు రాజకీయ నాయకుల మద్దతుతో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఇతను చేసిన హోం వర్క్ ఆకట్టుకుంటుంది. అయితే సహజంగా చూపించాలన్న ఉద్దేశంతో చీకటి మాటున జరిగే దారుణాలు ఉన్నది ఉన్నట్టు పిక్చరైజ్ చేయడం కాస్త శృతి మించింది. ఇలాంటివి కుటుంబ ప్రేక్షకులు చూసేందుకు తీసినవి కాకపోయినా కనీసం ఇంత అతి అవసరమా అనిపించేలా కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేది. అందులో ఆడపిల్లలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మరీ అంత భీతి గొలిపేలా కొన్ని ఎపిసోడ్స్ తీయడం ఎంత లేదన్నా మైనస్ అయ్యింది.

అయితే ధనిష్ లో టాలెంట్ వీటిని మినహాయించి మిగిలిన టేకింగ్ లో చూడొచ్చు. పూజా లాద్ శృతి ఇచ్చిన కథను పూర్తిగా ఆకళింపు చేసుకుని పాత్రలను, సంఘటనలను ఎక్కడా టెంపో తగ్గకుండా తీర్చిద్దిద్దిన తీరు మెచ్చదగిందే. వెబ్ సిరీస్ కాబట్టి ఎపిసోడ్లకు తగ్గ నిడివి ఉండాలన్న ఉద్దేశంతో మధ్య కాస్త ఎక్కువ ల్యాగ్ కు దారి తీసింది. అయినప్పటికీ మరీ బోర్ కొట్టే ఛాన్స్ అయితే ఇవ్వలేదు ధనిష్. ఇది రొటీన్ రామ్ కామ్ జనార్ లోనో లేదా క్రైమ్ కిల్లింగ్ క్యాటగిరిలోనో వెయ్యలేం. ఇది పూర్తిగా వేరు ప్రపంచం. ఇంత సీరియస్ ఇష్యూ ని తీసుకున్న ధనిష్ కొన్నిచోట్ల సగటు మసాలా దర్శకుడిగా మారిపోయి ఒక స్టాండర్డ్ కంటే తక్కువ స్థాయిలో కొంత భాగం తీయడం నెగటివ్ గానే చెప్పొచ్చు. అయితే ఎనిమిది ఎపిసోడ్లు కలిపి మొత్తం 5 గంటల 40 నిమిషాల నిడివిలో మరీ ఎక్కువ విసుగు తెప్పించిన అంశాలు లేవంటే అది దర్శకుడి విజయమే

మానస్ చతుర్వేది – శిఖర్ చతుర్వేదిల జంట సంగీతం బాగానే ఉంది. మూడ్ కి తగ్గట్టు డీసెంట్ గా ఇచ్చారు. అక్కడక్కడా కాస్త శృతి తప్పినట్టు అనిపించినా కథనంలో లీనమవ్వడం వల్ల ఆ చిన్నపాటి మైనస్సులు కలిసిపోయాయి. అంశుమాన్ మహాలే ఛాయాగ్రహణం సినిమా స్థాయిలో ఉంది. కథలో ఉన్న డిఫరెంట్ మూడ్స్ ని లొకేషన్స్ కి తగ్గట్టు కలర్ స్కీంని మార్చుకోవడం బాగుంది. ఎడిటింగ్ ఉన్నంతలో పర్వాలేదు. వెబ్ సిరీస్ లలో లెన్త్ గురించి కంప్లయింట్ చేసి లాభం లేదు. ప్రొడక్షన్ మాత్రం రిచ్ గా ఉంది. లాక్ డౌన్ కు ముందు తీయడం వల్ల ఎక్కడా రాజీ పడకుండా నిజమైన ప్రదేశాల్లోనే షూట్ చేశారు.

కంక్లూజన్

సీరియస్ సోషల్ ఇష్యూస్ మీద వెబ్ సిరీస్ లు రావడం చాలా అరుదు. అందులోనూ సున్నితంగా అనిపించే హ్యూమన్ ట్రాఫికింగ్ ఇష్యూని ఎంగేజ్ చేసేలా డీల్ చేయడంతో ‘ఫ్లెష్’ ఓవరాల్ గా మంచి ఛాయస్ గానే నిలుస్తుంది. అయితే కేవలం సమస్యను మాత్రమే హైలైట్ చేయకుండా దానికి పరిష్కారం కూడా ఏదైనా సినిమాటిక్ గా జోడిస్తే బాగుండేది అనిపిస్తుంది. కానీ దర్శకుడి ఉద్దేశం ఈ థీమ్ ని ఒక క్రైమ్ థ్రిల్లర్ లా ప్రెజెంట్ చేయడమే కాబట్టి అంతకన్నా ఎక్కువ ఆశించలేం. ఏది ఎలా ఉన్నా ఫ్లెష్ మాత్రం కాస్త ఓపిగ్గా చూడాల్సిన సిరీస్. లెన్త్ ఎక్కువగానే ఉన్నప్పటికీ మరీ ల్యాగ్ లేకూండా రేసీ స్క్రీన్ ప్లేతో ధనిష్ అస్లం తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది. బట్ ఇది అడల్ట్ కంటెంట్ అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. దీని విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే అందరికీ రీచ్ అయ్యే విషయం ఇందులో ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి