iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 30 – ఆఖరి నివాళి

లాక్ డౌన్ రివ్యూ 30 – ఆఖరి నివాళి

ఎంతో భవిష్యత్తు పెట్టుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆఖరి సినిమాగా అభిమానుల్లో అంచనాలు రేకెత్తించిన దిల్ బేచారా ఇవాళ డిస్నీ హాట్ స్టార్ ద్వారా నేరుగా డిజిటల్ రూపంలో విడుదలైంది. ట్రైలర్ వచ్చినప్పుడు తమ సానుభూతిని లైకుల రూపంలో ప్రకటించి అవెంజర్స్ రికార్డును క్రాస్ చేయించిన ఫ్యాన్స్ దీని మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఊహించని విధంగా తన చివరి చిత్రంలో వ్యాధిగ్రస్తుడిగా నటించడం కాకతాళీయమే అయినప్పటికీ విధి రాత ఎంత బలీయంగా ఉంటుందో చెప్పడానికి దిల్ బేచారా ఉదాహరణగా నిలుస్తోంది. మరి తన మీద ఉన్న హైప్ ని నిలబెట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

జంషెడ్పూర్ లో నివసించే కిజీ బసు(సంజనా సంఘీ) దీర్ఘకాలిక లంగ్స్ కు సంబంధించిన క్యాన్సర్ తో బాధ పడుతూ రోజులు లెక్కబెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు పరిచయమవుతాడు ఇమ్మనియేల్ రాజ్ కుమార్ జూనియర్/ మ్యానీ(సుశాంత్ సింగ్ రాజ్ పూత్). అతనికీ జబ్బు ఉంటుంది. రజినీకాంత్ స్ఫూర్తి తో ఓ సినిమా తీసే ప్రయత్నంలో ఉంటూ కిజీతో స్నేహం మొదలుపెడతాడు. చలాకిగా ఉండే మ్యానీ ఫ్రెండ్ షిప్ లో ఎప్పుడూ నిరాశగా ఉండే కీజిలో కొత్త ఉత్సాహం వస్తుంది. తనకు ఇష్టమైన సంగీత దర్శకుడు అభిమన్యు వీర్ సింగ్(సైఫ్ అలీ ఖాన్) ను కలవడం కోసం కిజీని పారిస్ తీసుకెళ్తాడు మ్యానీ. అక్కడికి వెళ్ళాక అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. ఆ తర్వాత ఇద్దరి ప్రయాణం ఏ మలుపులు తీసుకుంది, దీనికి ముగింపు ఎక్కడ దక్కింది అనేది సినిమాలో చూడాలి

నటీనటులు

ఇది విధి లిఖితమో లేక మరో కారణమో ఎవరూ చెప్పలేరు కాని సుశాంత్ సింగ్ ని ఇకపై చూసేందుకు అవకాశమే లేని ఆఖరి సినిమా కావడం నిజంగా దురదృష్టకరం. ఇంత మంచి టాలెంట్, గొప్ప ఫ్యూచర్ ఉన్న నటుడు కన్నుమూశారన్న వాస్తవం పదే పదే కళ్ళముందు మెదులుతూ ఉండగా మ్యానీతో కనెక్ట్ అవుతూ సినిమా చూడటం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇతనా మనల్ని వదిలి వెళ్లిపోయిందనే ప్రశ్న చాలా సార్లు వెంటాడుతూనే ఉంది. ముందు చలాకీగా ఉంటూ నిరాశ తప్ప ఇంకేమి తెలియని అమ్మాయి జీవితంలో ఆశలు నింపి సరికొత్త ములుపులు చూపించిన మ్యానీగా అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేశాడు సుశాంత్. తన జీవితంలో ఎంత క్షోభ అనుభవించాడో కానీ దిల్ బేచారా చూస్తున్నంత సేపూ మన హృదయాలు అంతకన్నా ఎక్కువగా ద్రవించడం ఖాయం. నిజానికి తన గురించి చాలా చెప్పాలని ఉన్నా భారమైన మనసులో నుంచి ఇది చెప్పడమే చాలా కష్టమనిపించింది.

హీరొయిన్ సంజనా సంఘీ పాత్రకు తగ్గట్టు కిజీ పాత్రలో ఒదిగిపోయింది. వ్యాధి వల్ల లైఫ్ లో ఇంకేది మిగల్లేదన్న మైండ్ సెట్ నుంచి మ్యానీ వల్ల ఆశావహంగా మారిపోయే వేరియేషన్ ని బాగా చూపించింది. గ్లామర్ పరంగా ఎలాంటి స్కోప్ లేని రోల్ కావడంతో ఉన్నంతలో ఎమోషన్స్ ని చక్కగా పలికించింది. కిజి తల్లిగా నటించిన స్వస్తికా ముఖర్జీ, తండ్రిగా చేసిన శాశ్వత ఛటర్జీ తమకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. చిన్న క్యామియోలో మెరిసిన సైఫ్ అలీ ఖాన్ ఆ కాసేపూ తన సీనియారిటీతో ఆడేసుకున్నాడు. సుశాంత్ స్నేహితుడిగా కనిపించిన సాహిల్ వాహిద్ డీసెంట్ గా చేశాడు. వీళ్ళు తప్ప ఇంకే క్యాస్టింగ్ సినిమాలో పెద్దగా లేదు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు ముఖేష్ ఛాబ్రా సుప్రసిద్ధ నవల ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ ని కథాంశంగా తీసుకున్నప్పటికీ ఫైనల్ గా చూస్తే ఇందులో ఎలాంటి కొత్తదనం కనిపించదు. తెలుగులోనూ గీతాంజలి, ఓయ్ లాంటివి చాలా వచ్చాయి. కాకపోతే దిల్ బేచారాలో చిన్న ట్విస్టులు కొంచెం వేరుగా అనిపిస్తాయి కానీ మిగిలినదంతా వాటినే గుర్తుకు తెస్తుంది. మణిరత్నం సినిమాలో నాగార్జున పాత్ర గిరిజ వల్ల స్ఫూర్తి చెందితే ఇందులో రివర్స్ లో ఉంటుంది. అంతే. అయినప్పటికీ ముఖేష్ సాధ్యమైనంత ఎమోషనల్ గా ఈ సినిమాలు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశాడు.

కాకపోతే లైన్ పరంగా ఉన్న పరిమితుల వల్ల బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేయలేకపోయారు. కేవలం సుశాంత్ మీద సానుభూతి, అతని పెర్ఫార్మన్స్ చూసేలా ప్రేరేపిస్తుంది తప్ప విడిగా చూస్తే అంత సంతృప్తిగా అనిపించదు. నిజానికి సుశాంత్ లాస్ట్ మూవీగా ఒక నివాళిగా ఇది అందరూ చూడాలి తప్పించి ఎంటర్ టైన్మెంట్ యాంగిల్ లో ఏదీ ఆశించకపోవడం మంచిది. అసలు ఈ స్టోరీనే ఎంచుకోవడానికి ముఖేష్ ని ఏం ప్రేరేపించిందో తెలియదు కానీ ఇదో నిజ జీవిత విషాదానికి చివరి మజిలీ కావడం దురదృష్టం.

ఏఆర్ రెహమాన్ సంగీతం దిల్ బేచారాకు ప్రాణం పోసింది. చాలా కాలం తర్వాత ఆకట్టుకునే మెలోడీస్ తో బెస్ట్ ఇచ్చారు. నేపధ్య సంగీతం కన్నా సాంగ్స్ బాగున్నాయి. మంచి పిక్చరైజేషన్ తోడవ్వడంతో ఇంకా బ్యూటీ ఫుల్ గా వచ్చాయి. ఏదీ బాలేదు అనే ఛాన్స్ రెహమాన్ ఈసారి ఇవ్వలేదు. సేతు ఛాయాగ్రహణం కథలోని డెప్త్ ని బాగా ప్రెజెంట్ చేసింది. జంషెడ్ పూర్, ప్యారిస్ అందాలను సహజంగా చూపించింది. ఆరిఫ్ షేఖ్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. కేవలం 1 గంటా 40 నిమిషాలే నిడివి కావడంతో మరీ బోర్ కొట్టే అవకాశాలు తగ్గాయి.

ప్లస్ గా నిలిచినవి

సుశాంత్ సింగ్ రాజపూత్
సంజనా సంఘ్వీ నటన
ఏఆర్ రెహమాన్ సంగీతం
తక్కువ నిడివి

మైనస్ గా తోచేవి

స్టోరీ లైన్ చిన్నది కావడం
లవ్ ట్రాక్ లైట్ గా ఉండటం

కంక్లూజన్

కొన్ని సినిమాలు బాగున్నాయా బాలేదా అనే అభిప్రాయాలకు అతీతంగా నిలుస్తాయి. మనం ఎంతో అభిమానించే ఒక యువ నటుడు మన మధ్య లేడన్న చేదు వాస్తవాన్ని అంగీకరిస్తూ అతనికి ఆఖరి నివాళిగా నిలిచిన దిల్ బేచారా ప్రతి మూవీ లవర్ తప్పకుండా చూడాలి. నచ్చుతుందా లేదా అనేది అప్రస్తుతం. కానీ మూవీ పూర్తయ్యేలోపు తన నిజ జీవిత విషాదాన్నే తెరమీద చూపిస్తున్న సుశాంత్ ని చూస్తూ కన్నీళ్లు రాకుండా ఆపుకోవడం కష్టమే. అంతగా మన హృదయాలను తడుముతాడు. దిల్ బేచారా చూడటానికి పది కారణాలు చెప్పమంటే ఒకటి నుంచి చివరి అంకె దాకా రాజ్ పూత్ పేరే చెప్పాలి. అంతకు మించి చెప్పడానికి పంచుకోవడానికి ఏమి లేదు.

ఒక్క మాటలో

దిల్ బేచారా – విధి వంచితుడికి ఆఖరి నివాళి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి