iDreamPost

లాక్ డౌన్ రివ్యూ 9 – ఉత్కంఠ రేపే క్రైమ్

లాక్ డౌన్ రివ్యూ 9 – ఉత్కంఠ రేపే క్రైమ్

లాక్ డౌన్ వేళ టీవీ లేదా వీడియో స్ట్రీమింగ్ యాప్స్ తప్ప ఇంకో ఆప్షన్ లేకుండా పోయిన ప్రేక్షకులు డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ తోనే కాలం గడుపుతున్నారు. అందులోనూ తెలుగు మాత్రమే కాకుండా ఇతర బాషలలో హిట్టయ్యి సబ్ టైటిల్స్ అందుబాటులో ఉండే సినిమాలను సైతం వదలడం లేదు. అలా ఇటీవలి కాలంలో మలయాళంలో 2020లో భారీ విజయాన్ని అందుకున్న అంజాం పతిరా ఇటీవలే ఆన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చింది. 50 కోట్ల వసూళ్ళతో పాటు సన్ ఛానల్ లో టెలికాస్ట్ అయిన వరల్డ్ ప్రీమియర్ ద్వారా హయ్యెస్ట్ టిఆర్పి రేటింగ్ సాధించిన అంజాం పతిరా రివ్యూ ప్రత్యేకంగా మీ కోసం

కథ

కోచి నగరంలో కన్సల్టింగ్ సైకాలజిస్ట్ గా పోలీస్ డిపార్ట్ మెంట్ కు తన సేవలు అందిస్తుంటాడు అన్వర్ హుసేన్(కుంచకో బొబన్). ఏదైనా హత్య జరిగినప్పుడు వాటికి పాల్పడ్డ నేరస్తుల మనస్తత్వం మీద పరిశోధనలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అనూహ్యమైన పరిస్థితిలో ఓ డిఎస్పి మర్డర్ సవాల్ గా మారుతుంది. డిసిపి క్యాథరిన్ మరియా(ఉన్నిమయా ప్రసాద్) ఇన్వెస్టిగేషన్ టీంలో అన్వర్ సహాయం తీసుకుంటుంది.

అయితే హంతకుడు అంతు చిక్కని రీతిలో ఎలాంటి ఆధారాలు లేకుండా వరసగా పోలీస్ ఆఫీసర్లను అత్యంత దారుణంగా బలి చేయడం మొదలుపెడతాడు. దాంతో చిక్కుముడులు పెరిగిపోతాయి. సైకో కిల్లర్ కేవలం పోలీసులనే ఎందుకు చంపుతాడో అర్థం కాని పరిస్థితికి రకరకాల పద్దతుల్లో విచారణ మొదలుపెడతారు. షాక్ కలిగించే రీతిలో దీని వెనుక ఎవరున్నారో తెలుస్తుంది. అదే అంజాం పతిరాలో కీలకం.

నటీనటులు

ఎలాంటి హీరోయిజం లక్షణాలు లేని హీరోగా కుంచకో బోబన్ చక్కగా ఒదిగిపోయాడు. ఒకరకమైన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. కథ పరంగా డిమాండ్ చేసింది కావడంతో ఇందులో చాలా పాత్రలున్నాయి. అన్వర్ కు భార్య ఉంటుంది కానీ తనతో ప్రత్యేకంగా డ్యూయెట్లు కానీ పాటలు కానీ ఏవీ ఉండవు. సినిమా ఆసాంతం కనిపించే రోల్ లో డిసిపిగా ఉన్నిమయా ప్రసాద్ సహజమైన నటనతో ఆకట్టుకుంటారు. సైకో కిల్లర్ గా చూపించిన నటుడు మరీ దానికి తగ్గ డెప్త్ గా అనిపించలేదు కానీ ఎవరూ ఊహించని విధంగా చూపించాలన్న దర్శకుడి ఉద్దేశం కాబోలు డిఫరెంట్ గా ఉన్నాడు. కథలో ఎక్కువ భాగం పోలీస్ శాఖలోనే సాగడంతో అందరూ యునిఫార్మ్ లో ఉన్నట్టే అనిపిస్తుంది.

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు మిథున్ మాన్యువల్ థామస్ ఎంచుకున్న ప్లాట్ లో కొత్తదనం కన్నా కథనం చెప్పే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో అంజాం పతిరా డీసెంట్ థ్రిల్లర్ గా నిలుస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఒక్కో మర్డర్ కు ముందు ఎస్టాబ్లిష్ చేసిన బిల్డప్ సినిమా టోన్ ని సెట్ చేయడంలా చాలా దోహదపడింది. సైకో కిల్లర్ కథలు ఈ మధ్యకాలంలో విస్తృతంగా వస్తున్న తరుణంలో తనది డిఫరెంట్ గా అనిపించడం కోసం మిథున్ చేసిన హోమ్ వర్క్ బాగానే ఉంది.

అయితే ప్రతిదీ డిటైల్డ్ గా చూపించాలన్న ఉద్దేశంతో సెకండ్ హాఫ్ మొదలయ్యాక సాగదీయడంతో రెండు గంటల్లోపు క్రిస్పీగా ఉండాల్సిన స్టోరీ ఏకంగా అరగంట ఎక్కువ తీసుకుంది. ఇక్కడ కొంచెం శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు అంత నిడివి అవసరం లేదనిపిస్తుంది. ఇది మినహాయిస్తే ఇలాంటి జానర్ మూవీస్ ని ఇష్టపడేవాళ్ళను నిరాశపరచలేదు మిథున్. సుషిన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మూడ్ కి తగ్గట్టు చక్కని అవుట్ ఫుట్ ఇచ్చాడు. శైజు ఖాలిద్ ఛాయాగ్రహణం కూడా ప్రశంసలకు అర్హత పొందిందే. నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు

చివరి మాట

సౌత్ లో ఇటీవలి కాలంలో సైకో కిల్లర్స్ కథలు విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో వచ్చిన అంజాం పతిరా కూడా అదే కోవకే చెందుతుంది. అయితే రెగ్యులర్ థ్రిల్లర్స్ ఉండే తరహాలో అమ్మాయిల కిడ్నాప్, హత్యలు కాకుండా ఈసారి కాస్త డిఫరెంట్ గా పోలీసుల హత్య అనే కాన్సెప్ట్ ని ఎంచుకోవడం అంజాం పతిరాను విభిన్నంగా ఉంచింది. అయితే అంచనాలు తక్కువ పెట్టుకుని నిడివిని ఓపిగ్గా భరించగలిగితే అంజాం పతిరా వన్ టైం వాచ్ క్యాటగిరీలో
వేయొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి