iDreamPost

స్థానిక ఎన్నికలపై ముందుకే – సానుకూలంగా హైకోర్టు

స్థానిక ఎన్నికలపై ముందుకే – సానుకూలంగా హైకోర్టు

స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ మంథాట సీతారామమూర్తిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్‌ల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన పంచాయతీరాజ్‌ చట్టంలోని 9, 15, 152, 153, 180, 181 సెక్షన్లను సవాల్‌ చేస్తూ కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న జారీ చేసిన జీవో 176ని కూడా ఆయన సవాలు చేశారు. ఈ జీవోను సవాలు చేస్తూ మరో రెండు వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. వీటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

పిటిషనర్ వాదన ఇది…

పిటిషనర్‌ ప్రతాప్‌రెడ్డి తరఫు న్యాయవాది ఎస్‌.ప్రణతి వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని కె.కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడంలో తప్పులేదని, అయితే బీసీలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటాయన్నారు. ప్రభుత్వం శాస్త్రీయ అధ్యయనం, బీసీ జనాభా గణన లాంటి వాటిని తేల్చిన తరువాత రిజర్వేషన్లు కల్పిస్తే అభ్యంతరం లేదని నివేదించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం సరికాదన్నారు. గతంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కూడా రిజర్వేషన్లు 50 శాతానికి లోబడే ఎన్నికలు నిర్వహించాలని చెప్పిందన్నారు.

ప్రభుత్వ వాదన ఇది…

రిజర్వేషన్లు 50 శాతం దాటుతుండటంపై ఇప్పటికే పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ఒక వ్యాజ్యాన్ని ఇదే ధర్మాసనం కొట్టి వేసిందని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ హైకోర్టుకు నివేదించారు. మరో వ్యాజ్యంలో ధర్మాసనం నోటీసులు జారీ చేసి, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిందన్నార గుర్తు చేశారు. చట్టాన్ని అనుసరించే జీవో 176 జారీ అయిందని తెలిపారు. పిటిషనర్లు చివరి దశలో కోర్టుకు వచ్చారని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ధర్మాసనం ఆదేశాలను ప్రభుత్వం అమలు చేస్తుందని నివేదించారు.

ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికలను నిలుపుదల చేసే ప్రసక్తే లేదని చెబుతూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి