iDreamPost

నేటి నుండి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు-పెరగనున్న మద్యం ధరలు

నేటి నుండి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు-పెరగనున్న మద్యం ధరలు

25% పెరగనున్న మద్యం ధరలు…

కరోనా లాక్ డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలు నేటినుండి తెరుచుకోనున్నాయి. మే 4 నుండి మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకొనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఆదివారం సమీక్ష సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో మద్యం అమ్మకాల విషయంలో పలు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నారు.

మద్య నియంత్రణ మన ప్రభుత్వ విధానం. మద్యపానాన్ని నిషేధించే దిశగా ఇప్పటికే రాష్ట్రంలో పలు కీలక చర్యలు తీసుకున్నాం.. ఇకపై మరిన్ని తీసుకోవాలి. మద్యం విక్రయించే దుకాణాల వద్ద రద్దీ లేకుండా, వ్యక్తిగత దూరం పాటించేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు అదేశాలిచ్చారు. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించాలని, మద్యం విక్రయించే వేళలను కూడా నియంత్రించాలని జగన్ సమీక్షలో పేర్కొన్నారు.

కాగా మద్యం ధరల్ని 25% పెంచాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనివల్ల రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నాయి. ప్రజల్లో మద్యపానం అలవాటు మాన్పించడానికి ధరలు మరోమారు పెంచాలని ముఖ్యమంత్రి సమీక్షలో నిర్ణయించారు. ధరల పెంపువల్ల దాదాపు 4,400 కోట్ల అదనపు ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లభించనుంది. ఉదయం 11 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు మద్యం విక్రయాలు జరుగుతాయి. బార్లు, క్లబ్బులు, ఏపీటీడీసీ లిక్కర్‌ లైసెన్సుతో నడిచే మద్య విక్రయ కేంద్రాలను మాత్రం తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు.

మద్యం విక్రయించే దుకాణాలు తప్పకుండా పాటించాలని కొన్ని విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.

ప్రతి దుకాణం ముందు ఐదు సర్కిళ్లు గీయాలి. ప్రతి సర్కిళ్ల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలి.

మద్యం విక్రయించే దుకాణాల వద్ద వ్యక్తిగత దూరం పాటించేందుకు వీలుగా ఒకేసారి అయిదుగురికి మించి అనుమతించరాదు.

మద్య దుకాణాల్లో సేల్స్‌మెన్‌ తప్పనిసరిగా మాస్కులు ధరించి, శానిటైజరు వినియోగించాలి.

ఒకవేళ మద్యం దుకాణాల వద్ద ఎక్కువ మంది గుమిగూడితే స్థానిక పోలీసులకు సమాచారం అందించి తాత్కాలికంగా దుకాణాన్ని మూసేయాలి.

దుకాణాల వద్ద వ్యక్తిగత దూరం నిబంధన పాటించేలా చూడటంలో స్థానిక పోలీసులు మరియు వాలంటీర్ల సహకారం తీసుకోవాలి.

మద్యం కొనేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి