iDreamPost

నాడు వైఎస్సార్‌.. నేడు వైఎస్‌ జగన్‌..

నాడు వైఎస్సార్‌.. నేడు వైఎస్‌ జగన్‌..

తండ్రి ఆస్తులకే కాదు ఆశయాలకు కూడా వారసులు అయ్యే వారు అతి కొద్ది మందే ఉంటారు. ఆ ఆశయాలను కొనసాగించేందుకు తండ్రి అనుసరించిన సాంప్రదాయాలను తనయుడు ఆచరిస్తుంటారు. ఇలా అరుదుగా ఉండే వారిలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒకరు. నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం తర్వాత.. మంత్రులకు శాఖల కేటాయింపులో సీఎం వైఎస్‌ జగన్‌ తన తండ్రి బాటను మరోసారి అనుసరించారని స్పష్టమైంది. ముఖ్యమైన హోం మంత్రి పదవిని ఈసారి కూడా మహిళకు కేటాయించారు. కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనితకు హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు ఆమె మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు.

తండ్రి ఒక అడుగు.. కుమారుడు రెండడుగులు..

తన తండ్రి ఒక అడుగు వేస్తే.. తాను రెండు అడుగులు వేస్తానంటూ వివిధ అంశాలపై తరచూ సీఎం వైఎస్‌ జగన్‌ చెబుతుంటారు. ప్రజా సంక్షేమం, మహిళా సాధికారత విషయంలో వైఎస్సార్‌ కన్నా ఆయన తనయుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఒక అడుగు ఎక్కువే వేశారని గడిచిన మూడేళ్ల పాలన ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో తొలిసారి ఓ మహిళకు హోం మంత్రి పదవిని వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేటాయించారు. 2009లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాష్ట్ర హోం మంత్రిగా చేవెళ్ల ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని నియమించారు. ఆంధ్రప్రదేశ్‌ చర్రితలో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ సబితానే కావడం గమనార్హం.

సీఎం తర్వాత హోంకే ఓటు..

హోం శాఖకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యమంత్రి తర్వాత స్థానం హోం శాఖదే. మంత్రులు ఎవరైనా సరే తమ తొలి ప్రాధాన్యం హోం శాఖకే ఇస్తారు. ఆ శాఖ తమకు కేటాయించాలని కోరుకుంటారు. బలమైన, ముఖ్యనేతలకు హోం మంత్రి పదవిని కట్టబెడతారు. వైఎస్‌ఆర్‌ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ పదవి సీనియర్‌ నేత నాగార్జున సాగర్‌ నుంచి గెలిచిన జానారెడ్డిని వరించింది. అంతకుముందు చంద్రబాబు హయాంలో.. బలమైన నేత దేవేందర్‌ గౌడ్‌ హోం మంత్రిగా పని చేశారు.

హోం మంత్రి విషయంలో ఉన్న ఇలాంటి చరిత్రను వైఎస్సార్‌ తిరగరాశారు. సబితా ఇంద్రారెడ్డిని హోం మంత్రిని చేసి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. మరో అడుగు ముందుకు వేసి.. తన ప్రభుత్వ హయాంలో దళిత మహిళకు హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణకు ముందు ఈ బాధ్యతలను ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు అప్పగించగా… తాజాగా కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనితకు ఆ బాధ్యతలను సీఎం వైఎస్‌ జగన్‌ అప్పగించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి