iDreamPost

2022 రివ్యూ 7 – గాయం చేసిన డిజాస్టర్లు

2022 రివ్యూ 7 – గాయం చేసిన డిజాస్టర్లు

హిట్ సినిమాల కంటే డిజాస్టర్లు నేర్పించే పాఠాలు బలంగా ఉంటాయి. తప్పులు ఎలా చేయకుండా ఉండాలో కనీసం ఒక అవగాహన తీసుకొస్తాయి. గుడ్డిగా కాంబోలను నమ్ముకుంటే బిజినెస్ చేయొచ్చేమో కానీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేమనే నీతిని చెబుతాయి. ఈ ఏడాది అలాంటివేంటో చూద్దాం. చిరంజీవి రామ్ చరణ్ కాంబో, ఫ్లాప్ ఎరుగని దర్శకుడు కొరటాల శివ. ఇంతకన్నా కాంబో ఇంకేం కావాలి. కానీ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత దారుణమైన పరాజయంగా ‘ఆచార్య’ చేసిన గాయం అభిమానులను ఇంకా వెంటాడుతూనే ఉంది.. ఓటిటిలో వచ్చాక కూడా ఇది కనీస స్థాయిలో మెప్పించలేకపోయింది. శాటిలైట్ లోనూ ఆదరణ దక్కలేదు

విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్’ లైగర్’ వారం తిరక్కుండానే బయ్యర్లకు చుక్కలు చూపించింది. డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతకు మధ్య వివాదాలను సైతం తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పెట్టుబడుల వ్యవహారం ఈడి విచారణ దాకా వెళ్లడం ఇంకా మర్చిపోలేని హాట్ న్యూస్. ఉత్తమాభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వేణు ఊడుగుల మంచి కాంబోతో రానా సాయిపల్లవితో చేసిన ‘విరాట పర్వం’ వల్ల ప్రశంసలు వచ్చాయే తప్ప నిర్మాతకు కనీసం బ్రేక్ ఈవెన్ జరగలేదు. గోపిచంద్ ‘పక్కా కమర్షియల్’ ఏకంగా గీతా ఆర్ట్స్ సబ్జెక్ట్ సెలక్షన్ మీద అనుమానం వచ్చేలా చేసింది. నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ గురించి తక్కువ గుర్తు చేసుకోవడం మంచిది

కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామిని నమ్మడంలో రామ్ కి ‘ది వారియర్’ రూపంలో తగిన మూల్యం చెల్లించేలా చేసింది. నాగ చైతన్యకు థాంక్ యు, లాల్ సింగ్ చద్దా రెండూ చేదు జ్ఞాపకాలే. వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా’ మరీ పాత చింతకాయ పచ్చడితో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. నాగార్జున ‘ది ఘోస్ట్’ ఎంత స్టయిలిష్ గా తీసినా జనం మెప్పు పొందలేదు. సంతోష్ శోభన్ ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ రెండో రోజే చాప చుట్టేసింది. అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’లో సందేశం పబ్లిక్ కి చేరలేదు. సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’, సుధీర్ బాబు ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వరుణ్ తేజ్ గని, రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, ఖిలాడీ అన్నీ అస్సామే. రాధే శ్యామ్ సైతం ఇదే కోవలోకి వచ్చినా క్రేజ్ వల్ల కొంతలో నయం అనిపించుకుంది అంతే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి