iDreamPost

ఎంపీటీసీ వర్సెస్‌ సర్పంచ్‌.. వెనకబడిపోయిన ఎంపీటీసీ..

ఎంపీటీసీ వర్సెస్‌ సర్పంచ్‌.. వెనకబడిపోయిన ఎంపీటీసీ..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్‌ పదవుల మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీలో ఎంపీటీసీ పదవి వెనకబడిపోతోంది. సర్పంచ్‌ పదవి దూసుకెళుతోంది. అభ్యర్థులు సర్పంచ్‌ పదవిపైనే మోజు పెంచుకున్నారు. పలు చోట్ల ఎంపీటీసీ పదవికి పోటీ చేసే వారు కరువయ్యారు. ఈ రోజు బుధవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజు కావడంతో.. ఎలాగోలా నామినేషన్లు వేయించేందుకు నేతలు ఉరుకులు పరుగులుపెడుతున్నారు. అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఈ పరిస్థితి ఉందంటే సర్పంచ్‌ పదవిపై క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జనరల్‌ కేటగిరితోపాటు.. రిజర్డ్వ్‌ స్థానాల్లోనూ ఎంపీటీసీ పదవిపై అభ్యర్తులు ఆసక్తి చూపడంలేదు.

సర్పంచ్‌ ఎన్నికలతోపాటు, పరిషత్‌ ఎన్నికలూ ఒకే సారి రావడంతోపాటు, గ్రామ సచివాలయాల ఏర్పాటు వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. గతంలో ఈ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరిగాయి. 2013 ఆగస్ట్‌లో సర్పంచ్‌ ఎన్నికలు జరగ్గా.. 2014 ఏప్రిల్‌లో పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. అప్పుడు స్థానిక నేతలు ఉత్సుకతతో పోటీలో ఉండేవారు. ఎంపీటీసీ అయినా, సర్పంచ్‌ పదవైనా మాకంటే.. మాకంటూ.. ముందుకొచ్చేవారు. అధికార పార్టీలో అయితే డిమాండ్‌ మరింత ఎక్కువ. ఎవరికి టిక్కెట్‌ ఇవ్వాలో నేతలు తలలు పట్టుకునేవారు. టిక్కెట్‌ దక్కని వారు రెబల్స్‌గా పోటీ చేసేవారు. ప్రస్తుతం ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికలు రెండూ రోజుల వ్యవధిలో జరుగుతుండడంతో.. ఆశావాహులు సర్పంచ్‌ పదవి కోసం పోటీ పడుతున్నారు.

సర్పంచ్, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు రోజుల వ్యవధిలో జరుగుతున్నారు. ఈ నెల 21వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుండగా.. 27, 29 తేదీల్లో సర్పంచ్‌ ఎన్నికలు రెండు విడతల్లో జరగబోతున్నాయి.

సర్పంచ్‌ పదవికి ఉన్న అధికారాలు, ఆ పదవికి ఉన్న గుర్తింపు నేపథ్యంలోనే నేతలు ఆ పదవి కోసం ఆరాటపడుతున్నారు. కొత్తగా జగన్‌ సర్కార్‌ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం, అందులో గరీష్టంగా 13 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం, పంచాయతీ పరిధిలో జనాభాను బట్టీ15 నుంచి 100 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసింది.  వీరందరికీ సర్పంచ్‌ నాయకుడుగా ఉండనున్నారు. ఎవరికైనా సెలవు కావాలంటే సర్పంచ్‌ అనుమతి అవసరమని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. గ్రామ సచివాలయానికి అధికారాలు, విధులు బదిలీ చేసింది.

ప్రభుత్వ పథకాలు గ్రామ సచివాలయం నుంచే అందివ్వనున్నారు. రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల పేరుతో ప్రాథమిక వైద్య కేంద్రం, పశువైద్య కేంద్రం గ్రామ సచివాలయం వద్దే ఉండనున్నాయి. ఈ సేవలన్నీ గ్రామ సంచాయతీ సర్పంచ్‌ ఆధ్వర్యంలో జరగనున్నాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏలాగో.. గ్రామ పంచాయతీకి సర్పంచ్‌ అలా.. అనే భావన జగన్‌ సర్కార్‌ చేపట్టిన కార్యక్రమాలతో పెరిగిపోయింది. ఫలితంగానే సర్పంచ్, ఎంపీటీసీ రేసులో.. ఎంపీటీసీ పదవి వెనకబడిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి