iDreamPost

భూ రక్ష.. రైతుకు శ్రీరామ రక్ష

భూ రక్ష.. రైతుకు శ్రీరామ రక్ష

ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తూ అన్నదాతల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. రైతన్నలను ఏళ్ల తరబడి పీడిస్తున్న భూ సమస్యలకు కొత్త ఏడాది ప్రారంభం నుంచి పరిష్కారం చూపించబోతున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను దృష్టిలో ఉంచుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఎన్నికల వేళ భూముల రీ సర్వే చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతుకు రూపాయి ఖర్చు లేకుండా ఈ పని చేస్తామని చెప్పిన మేరకు.. ఆ దిశగా అవసరమైన చర్యలను ఇప్పటికే చేపట్టారు.

సమగ్ర భూ సర్వే కార్యక్రమానికి .. అవసరమైన సిబ్బంది, సాంకేతిక పరిజ్ఞానం, సదుపాయాలు కల్పించారు. జనవరిలో ప్రారంభించబోతున్న ఈ పథకానికి జగన్‌ సర్కార్‌ తాజాగా పేరును ఖరారు చేసింది. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం పేరుతో రైతుల భూములు రీ సర్వే చేసి భవిష్యత్‌లో మరే వివాదాలు లేకుండా హక్కులు కల్పించనున్నారు.

ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 987 కోట్ల రూపాయల ఖర్చు పెట్టనుంది. ఇందులో 600 కోట్ల రూపాయలు హద్దు రాళ్ల కోసం కేటాయించారు. మూడు సైజుల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేయనున్నారు. కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ సిస్టమ్‌ (కోర్స్‌) అనే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ సర్వే చేపట్టనున్నారు. రోవర్లు, డ్రోన్లు ద్వారా భూముల సర్వే చేయనున్నారు. ఈ పరికరాల కోసం ప్రభుత్వం 181 కోట్ల రూపాయలు కేటాయించింది. గ్రామ సచివాలయాల్లో నియమించిన సర్వేయర్లు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించింది.

వచ్చే జనవరి–ఫిబ్రవరి నెలలో భూ సర్వే ప్రారంభం కాబోతోంది. మూడు దశల్లో ఈ సర్వే జరగబోతోంది. ఇందు కోసం మండలాన్ని మూడు యూనిట్లుగా విభజించారు. రెవెన్యూ గ్రామాల ప్రాతిపదికన.. సదరు మండలంలో మూడో వంతు గ్రామాలను ఒక్కొక్క దశలో సర్వే చేపట్టనున్నారు. ఏ దశలో ఏ ఏ గ్రామాలు సర్వే చేయాలన్నదీ ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. డిసెంబర్‌ నాటికి భూ రికార్డుల సచ్ఛీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే రీ సర్వే ప్రారంభం కానుంది.
 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి