iDreamPost

వీడియో: బాలికకు వాతలు.. లేడీ పైలట్ ని చితకబాదిన స్థానికులు!

వీడియో: బాలికకు వాతలు.. లేడీ పైలట్ ని చితకబాదిన స్థానికులు!

ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం ఎంతో ముఖ్యమైనది. ఆ బాల్యంలో చక్కగా పలక పట్టుకుని బడికి వెళ్లి చక్కగా చదువుకోవాలి. కానీ, ఆ అదృష్టం అందరికీ ఉండదనే చెప్పాలి. ముక్కు పచ్చలారని వయసులోనే బడికి కాకుండా పనికి వెళ్తూ బాల్యాన్ని కోల్పోతున్నారు. పూట గడవక ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఏదొక ఇంట్లో పనికి పెడుతున్నారు. మైనర్లను ఇళ్లలో పనికి పెట్టుకోవడం నేరం అని అందరికీ తెలుసు. కానీ, ఏ మాత్రం ఆలోచించకుండా చిన్నారులను పనిలో పెట్టుకుంటారు. అలా పనిలో పెట్టుకున్న పిల్లను ఓ మహిళ చిత్రహింసలు పెట్టింది.

ఢిల్లీ ద్వారకా నగర్ లో ఓ మహిళా పైలట్ కుటుంబంతో కలిసి నివాసముంటోంది. ఆమె భర్త కూడా ఎయిర్ లైన్స్ లోనే పని చేస్తుంటాడు. వారి ఇంట్లో పని కోసం ఒక పదేళ్ల పిల్లను పనికి కుదుర్చుకున్నారు. నిజానికి అంత చిన్న పిల్లను పనిలో పెట్టుకోవడం తప్పు. చట్టరీత్యా నేరం కూడా. ఒక పైలట్ గా పని చేస్తున్న మహిళకు ఆ విషయం తెలియక పోవడం గమనార్హం. అంతేకాకుండా ఆ పిల్లను చిత్రహింసలకు గురిచేశారు. ఆ చిన్నారిని కొట్టడం, ఆమెకు వాతలు పెట్టడం చేశారు. ఆమె ఒంటిపై దెబ్బలు, కాల్చిన గాయాలు కనిపిస్తున్నాయి. చేతులపై వాతలకు చర్మం ఊడిపోయింది. ఆ బాలిక పరిస్థితి చూసి స్థానికులు చలించి పోయారు. ఆ చిన్నారిని రక్షించాలని భావించారు. ఆ జంటకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.

ఇంట్లో వారిని బయటకు లాక్కొచ్చి నడిరోడ్డుపై స్థానికులు దాడికి దిగారు. ఆ చిన్నారిని తాము ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని భార్యాభర్తలు వారించారు. మహిళా పైలట్ ను మొదట రోడ్డుపైకి లాక్కొచ్చి కొట్టసాగారు. భార్య కోసం భర్త అడ్డుకోవడానికి వెళ్లగా.. అతనిపై కూడా దాడికి దిగారు. అక్కడున్న పురుషులు అందరూ కలిసి భర్తను చితకబాదారు. మహిళలు అందరూ లేడీ పైలట్ కు దేహశుద్ధి చేశారు. కొందరైతే పైలట్ ను చెప్పులతో కొట్టారు. తన భార్యను వదిలేయాలంటూ ఆమె చచ్చిపోతుందని భర్త వేడుకున్నాడు. మరి.. చిన్నారిని కొట్టినప్పుడు ఈ భయం ఏమైందని స్థానికులు ప్రశ్నించారు. ఓ పెద్దాయన అడ్డుపడి దాడి చేసే వారిని నివారించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ పదేళ్ల బాలికను పనిలో పెట్టుకున్న విషయాన్ని నిర్ధారించారు. చిన్నారిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి పంపారు.  చిన్నారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ జంటపై ఐపీసీ సెక్షన్లు 323, 324, 342, చైల్డ్ ల్యాబర్ యాక్ట్ కింద వారిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం మహిళా పైలట్- ఆమె భర్తపై స్థానికులు దాడి చేసిన విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వారికి తగిన బుద్ధి చెప్పారంటూ స్థానికులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి