iDreamPost

టీవీ, సోషల్ మీడియా ఛానెళ్లకు KTR లీగల్ నోటీసులు

  • Published Apr 01, 2024 | 12:04 PMUpdated Apr 01, 2024 | 12:13 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ కి లీగల్ నోటీసులు పంపారు. ఆ వివరాలు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ కి లీగల్ నోటీసులు పంపారు. ఆ వివరాలు..

  • Published Apr 01, 2024 | 12:04 PMUpdated Apr 01, 2024 | 12:13 PM
టీవీ, సోషల్ మీడియా ఛానెళ్లకు KTR లీగల్ నోటీసులు

పలు టీవీ ఛానళ్ళతో పాటు యూట్యూబ్, సోషల్ మీడియా సంస్థలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తన, తన కుటుంబం పరువు తీయడం కోసమే కొన్ని మీడియా ఛానెల్స్, సోషల్ మీడియా సంస్థలు పని కట్టుకుని అసత్య ప్రచారాలను, కట్టు కథలను ప్రచారం చేస్తున్నాయని ఆయన మండి పడ్డారు. తమ గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తోన్న సుమారు 10 టీవీ ఛానళ్లు, యూట్యూబ్, సోషల్ మీడియా సంస్థలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.

తనతో పాటు తన ఫ్యామిలీకి నష్టం కలిగించాలన్న దురుద్దేశంతోనే సదరు ఛానెల్స్, సోషల్ మీడియా సంస్థలు తమ గురించి దుష్ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ తన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అసలు తమకు సంబంధమే లేని అనేక అంశాల్లో తమ పేరును, ఫోటోలను వాడుకుంటూ అత్యంత హీనమైన థంబ్ నెయిల్స్ పెడుతున్నారని మండిపడ్డారు. అలాంటి ఛానళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇవన్నీ కూడా ఒక పక్కా ఎజెండాలో భాగంగానే.. మీడియా ముసుగులో జరుగుతున్న కుట్రలుగా కేటీఆర్ పేర్కొన్నారు.

తమ గురించి పెట్టిన తప్పుడు సమాచారాన్ని, వీడియోలను వెంటనే తొలగించాలని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ ఛానల్స్ తో పాటు కొన్ని మీడియా సంస్థలు సైతం తమపై ప్లాన్ ప్రకారం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అంతేకాక తన గురించి, తమ కుటుంబం గురించి తప్పుడు సమాచారం పోస్ట్ చేసిన కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ ఇప్పటికే తమ తప్పును సరిదిద్దుకొని వాటిని తొలగించాయని చెప్పుకొచ్చారు.

మిగతా సంస్థలు కూడా వారం రోజుల్లోగా ఇలాంటి కంటెంట్ ని తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపైన తమకు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని అంశాలపైన అసత్య ప్రచారం చేసే ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్స్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. అంతేకాక యూట్యూబ్ కి సైతం లీగల్ నోటీసులు పంపించామని కేటీఆర్ పేర్కొన్నారు. తమపై తప్పుడు ప్రచారం చేసే సంస్థలు మరిన్ని లీగల్ చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి