iDreamPost

కన్మణి రాంబో కతిజా (KRK) రిపోర్ట్

కన్మణి రాంబో కతిజా (KRK) రిపోర్ట్

అసలు విడుదలయ్యిందనే విషయమే సామాన్య ప్రేక్షకులకు తెలియనంత సైలెంట్ గా ఇవాళ థియేటర్లలో వచ్చిన సినిమా కణ్మణి రాంబో కతిజ. రేపు ఆచార్య ఉండటంతో దీని మీద కనీస బజ్ లేదు. దానికి తోడు తెలుగు వెర్షన్ కొన్న నిర్మాతలు పబ్లిసిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సమంతా సైతం వ్యక్తిగతంగా ప్రమోట్ చేయకపోవడం విచిత్రం. విజయ్ సేతుపతి నయనతార సామ్ ల అరుదైన కాంబినేషన్ తో పాటు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించడం లాంటి ఆకర్షణలు ఉన్నా ఇవేవి ఏ మాత్రం హైప్ ఇవ్వలేకపోయాయి. సూర్యతో గ్యాంగ్ ఇచ్చిన విజ్ఞేశ్ శివన్ (నయనతార కాబోయే భర్త)దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ రిపోర్ట్ ఏంటో చూద్దాం.

ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన రాంబో(విజయ్ సేతుపతి)కి దురదృష్టం వెన్నంటే ఉంటుంది. ఉద్యోగం కోసం సిటీకి వచ్చాక రకరకాల జాబులు చేస్తాడు. క్యాబ్ డ్రైవర్ గా ఉండగా కన్మణి(నయనతార)ని ప్రేమిస్తాడు. మరో సందర్భంలో కతిజ(సమంత)ను లవ్ చేస్తాడు. ఇలా ఇద్దరితో ఒకేసారి రొమాన్స్ నడపాల్సిన అవసరం ఎందుకొచ్చింది, అసలు ర్యాంబో ఉద్దేశం ఏంటనేదే అసలు కథ. ముగ్గురు బెస్ట్ ఆర్టిస్టుల కలయిక తెరమీద కనువిందుగా ఉంది. ఇద్దరు గ్లామర్ భామల మధ్య విజయ్ తన ఉనికిని గట్టిగా చాటుకున్నాడు. కాకపోతే నయన్, సామ్ ల నుంచి ఎక్స్ ట్రాడినరి కామెడీనో ఎంటర్ టైన్మెంటో ఆశిస్తే నిరాశ తప్పదు. వీళ్ళు కలర్ఫుల్ గా ఉన్నారు కాబట్టే ఓపిగ్గా చివరిదాకా చూడగలిగాం.

ట్రయాంగిల్ లవ్ స్టొరీ నుంచి విభిన్నమైన వినోదాన్ని అందించాలనుకున్న దర్శకుడు విజ్ఞేష్ శివన్ ఆలోచన మంచిదే కానీ దాన్ని సరైన రీతిలో ప్రెజెంట్ చేయలేకపోయారు. ఎమోషన్స్ పండలేదు. డ్రామా పాలు ఎక్కువైపోయి ఒకదశ దాటాక బోర్ కొట్టేస్తుంది. ఊరికే ఈ ముగ్గురిని చూస్తూ థియేటర్లో జనం తన్మయత్వంలో మునిగి ఇంకేం అక్కర్లేదనుకుంటారని భావించాడు కాబోలు కథా కథనాలను సీరియస్ గా తీసుకోకపోవడం ప్రధాన మైనస్. అసలే టైటిల్ ని మన ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశం లేకుండా అవే అరవ పేర్లే వాడారు. దీంతో పోస్టర్ నుంచే డిస్ కనెక్టివిటీ పెరిగిపోయింది. సేతుపతి నయన్ సామ్ లాంటి కాంబోని సైతం ఎలా వృథా చేయొచ్చో ఉదాహరణగా చెప్పడానికి ఈ కన్మణి రాంబో కతిజ ఉపయోగపడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి