iDreamPost

2024లో కూడా 175.. 2028లోనే 225..

2024లో కూడా 175.. 2028లోనే 225..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలను, నేతలను ఊరిస్తున్న అసెంబ్లీ సీట్ల పెంపు 2024లో కూడా జరిగేటట్లు కనిపించడంలేదు. రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలోని 175 సీట్లను 225నకు, తెలంగాణలో 119 సీట్లను 153నకు పెంచాలని నిబంధన పెట్టారు. ఈ నిబంధనను అమలు చేయాలని 2014 తర్వాత రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, కేసీఆర్‌ సర్కారులు కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతులు అందించాయి. అయితే నిబంధనల ప్రకారం 2028లోనే సీట్ల పెంపు ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఇదే అంశం పలుమార్లు చర్చకు వచ్చినా కేంద్రం తాను మొదట చెప్పిన మాటనే స్పష్టం చేస్తూ వచ్చింది. సీట్లు పెంపుదలను దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులను విపరీతంగా ప్రొత్సహించిన చంద్రబాబు, కేసీఆర్‌లకు చెంపపెట్టులా మారింది. ఒకానొక సమయంలో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి, ప్రస్తుత ఉప రాష్ట్రపతి కూడా కలుగజేసుకున్నా పని కాలేదు.

ఈ అంశంపై మళ్లీ చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మరోమారు స్పష్టత ఇచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సీట్ల పెంపు ఉండబోదని.. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు చేస్తామని తెలిపారు. విభజన చట్టంలో సీట్ల పెంపు అంశాన్ని రాత్రి రాత్రి చేర్చారని, అప్పుడు నిబంధనలను దృష్టిలో పెట్టుకోలేదని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు 2019లో పోటీ చేసే అవకాశం రాని వారికి ఆశనిపాతంలా మారాయి. నియోజకవర్గాలు పెరిగి 2024లోనైనా పోటీ చేసే అవకాశం వస్తుందని ఆశించిన ఏపీ నేతలకు కిషన్‌ రెడ్డి ప్రకటన నిరుత్సాహాన్ని కలిగించినట్లైంది. ఇక తెలంగాణలో కూడా 2023లో 119 స్థానాలకే ఎన్నికలు జరగనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి