iDreamPost

హిందూ వివాహంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హిందూ వివాహంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

భారత దేశంలో విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలు, విభిన్న జాతులు, మతాలు ఉన్నాయి. ఆయా మత ఆచారాలు, సంప్రదాయాలను బట్టి వివాహాలు జరుగుతుంటాయి. అయితే భారత్ సర్వమత సమ్మేళనం అయినప్పటికీ.. హిందూ సాంప్రదాయలను ఎక్కువగా పాటిస్తుంది. హిందూ వివాహాలు కూడా వివిధ ప్రాంతాల్లో విభిన్న పద్దతుల్లో జరుగుతుంటాయి. ఏ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్న మాంగళ్య ధారణ, సప్తపది కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఈ విషయంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. సాంప్రదాయ పద్ధతిలో వివాహ తంతు జరిగి, ఏడడుగులు వేస్తేనే ఆ హిందూ వివాహం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ఓ భార్యా భర్తల కేసు విషయంలో ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంతకు ఆ కేసు ఏంటంటే..?

2017లో సత్యం సింగ్‌తో వివాహమైంది స్మృతి సింగ్‌కు. కొన్నాళ్లకు గొడవలు జరుగుతుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తనను వరకట్నం తీసుకురావాలంటూ వేధిస్తున్నారని .. భర్త, అత్తమామలపై కేసు పెట్టింది. కాగా, దర్యాప్తులో వాస్తవం అని తేలింది. అలాగే భర్త సత్యం కూడా స్మృతిపై ఆరోపణలు చేయగా.. అది అవాస్తవమని తేలింది. అయితే తన భార్య రెండో వివాహం చేసుకుందని ఆరోపిస్తూ సెప్టెంబర్ 20, 2021న ఫిర్యాదు చేశారు. దీనిపై మీర్జాపూర్ మేజిస్ట్రేట్ స్మృతికి సమన్లు పంపారు. విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నట్లు ఆరోపిస్తూ భర్త ఫ్యామిలీ కోర్టులో వేసిన పిటిషన్‌ను సవాలు చేస్తూ భార్య అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

హిందూ వివాహాల్లో సప్తపదితో పాటు ముఖ్యమైన ఆచారాలను పాటించకుండా వివాహ తంతు జరిపితే అది పెళ్లి అని చెప్పలేమని పేర్కొంటూ భర్త ఆరోపణలను కొట్టివేస్తూ.. ఆమెకు తీర్పు అనుకూలంగా ఇచ్చారు. ఈ సందర్భంగా కోర్టు హిందూ వివాహ చట్టంలోని 1955 సెక్షన్ 7ను ప్రస్తావించింది. హిందూ వివాహం అనేది ఆచారాలు, వ్యవహారాలను బట్టి చేయాలని, వధూవరులు పవిత్ర అగ్ని చుట్టూ ఏడడగులు వేస్తూ సప్తపది పూర్తి చేస్తేనే, హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి అవుతుందని, దానికే చట్టబద్ధత ఉందని పేర్కొంది. అయితే ఆమె రెండో వివాహం చేసుకుందని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవంటూ పేర్కొంటూ మీర్జాపూర్ ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన సమన్లను కొట్టివేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి