iDreamPost

ఒకేసారి ‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ పాసైన కేరళ తల్లీకొడుకులు! స్ఫూర్తిదాయకమన్న నెటిజెన్లు!

ఒకేసారి ‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ పాసైన కేరళ తల్లీకొడుకులు! స్ఫూర్తిదాయకమన్న నెటిజెన్లు!

ఆ ఇంట్లో ఒకేసారి ఇద్దరు ‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ ఎగ్జామ్ క్లియర్ చేశారు. రేపోమాపో గవర్నమెంటు జాబ్స్ రాబోతున్నాయి. కానీ ఆ ఇద్దరూ అన్నాతమ్ముళ్ళో అక్కాచెల్లెళ్ళో కాదు, తల్లీకొడుకులు! ఆశ్యర్యంగా ఉంది కదా! కేరళలోని మలప్పురంలో జరిగిందీ అద్భుతం. తల్లి బిందు లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ (LGS) విభాగంలో 92వ ర్యాంకు సాధిస్తే, కొడుకు వివేక్ ‘లోయర్ డివిజనల్ క్లర్క్’ (LDC) విభాగంలో 38వ ర్యాంకు సాధించాడు. తల్లి వయసు 42. కొడుకు వయసు దానికి సరిగ్గా రివర్స్ అంటే 24!

గవర్నమెంట్ జాబ్ బిందు కల

మలప్పురంలోని అరిక్కోడ్ కి చెందిన బిందు అంగన్ వాడీ టీచర్ గా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తోంది. అయితే ఎప్పటికైనా గవర్నమెంటు జాబ్ కొట్టాలన్నది ఆమె లక్ష్యం. కొడుకు వివేక్ టెన్త్ క్లాస్ కి వచ్చినప్పటి నుంచి బిందు కేరళ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ కి ప్రిపేరవుతూ వచ్చింది. అంతే కాదు కొడుకును కూడా గవర్నమెంటు ఉద్యోగం తెచ్చుకోవాలంటూ ప్రోత్సహించింది. చిన్నప్పటి నుంచే అతనితో పత్రికలు, పుస్తకాలు చదివించింది.

తల్లీకొడుకు ఇలా ప్రిపేరయ్యారు!

వివేక్ డిగ్రీ పూర్తయ్యాక తల్లితో పాటు సివిల్స్ కి ప్రిపేరవడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరినీ చూసి ముచ్చటపడ్డ బిందు భర్త పూర్తి సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరినీ కోచింగ్ లో చేర్పించాడు. తల్లీ కొడుకు ఇద్దరూ కలిసే కోచింగ్ కి వెళ్ళేవాళ్ళు. కానీ ఎవరికి వాళ్ళే ప్రిపేరయ్యేవాళ్ళు. ఏవైనా సందేహాలొస్తే ఒకరికొకరు సాయం చేసుకునేవాళ్ళు.

తల్లికి ఇదే చివరి అవకాశం

కొడుక్కి చాలా అవకాశాలున్నాయి కానీ బిందుకి ఇదే లాస్ట్ చాన్స్. ఇంతకుముందు మూడుసార్లు రాసింది కానీ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయింది. మామూలుగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కి 40 ఏళ్ళ వయోపరిమితి ఉంటుంది. కానీ బిందు సామాజిక వర్గానికి 42 ఏళ్ళ వరకు సడలింపు ఉంది. అందుకే బిందు ఈసారి రాత్రింబవళ్ళూ కష్టపడి చదివింది. మొత్తానికి ఎగ్జామ్ పాసైంది. కొడుక్కి కూడా జాబ్ వస్తుండడం బోనస్. మొత్తానికి తల్లీకొడుకుల శ్రమ ఫలించినందుకు ఆ తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

అటు ట్విటర్ లో ఈ తల్లీకొడుకుల విజయంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వీరి కథ స్ఫూర్తిదాయకమని నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి