iDreamPost

అంచనాలకు అనుగుణంగానే కేరళ ఎర్రబారుతోంది..

అంచనాలకు అనుగుణంగానే కేరళ ఎర్రబారుతోంది..

కేరళలో చరిత్ర మారుతోంది. సుదీర్ఘకాలంగా చెరో ఎన్నికల్లోనూ ప్రజాదరణ పొందడం ఆనవాయితీగా మార్చుకున్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు ఈసారి కొత్త పంథాకు శ్రీకారం చుట్టాయి. 60వ దశకం తర్వాత తొలిసారిగా వరుసగా రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించే దిశలో లెఫ్ట్ అడుగులు వేస్తోంది. మలబారు తీరం మరోసారి ఎర్రబారుతోంది. పినరయి విజయన్ నాయకత్వంలోని ప్రభుత్వానికి ఓటర్లు మరోసారి పట్టంకడుతున్నారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ సహా వివిధ అంచనాలకు అనుగుణంగానే తుది ఫలితాలు వస్తున్నాయి

బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 80 నియోజకవర్గాల్లో ఎల్డీఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మొత్తం 140 నియోజకవర్గాలకు గానూ 71 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ రావాలి. అధికారం నిలబెట్టుకునేయత్నంలో దానిని విజయన్ ప్రభుత్వం సునాయాసంగా అధిగమిస్తుందని ట్రెండ్స్ ని బట్టి తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్ 55 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. బీజేపీ గత అసెంబ్లీలో ఏకైక స్థానం గెలుచుకోగా ఈసారి కూడా ఒక్క స్థానంలో ఆధిక్యంలో కనిపిస్తోంది.

ఇటీవల కేరళ వరదల సందర్భంలోనూ, నిఫా, కరోనా వైరస్ ల తాకిడి సందర్భంలోనూ సీపీఎం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజామోదంగా దీన్ని భావిస్తున్నారు. బీజేపీ నేతలు ఎంత ప్రయత్నం చేసినా కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోయాలనే వారి లక్ష్యం నెరవేరలేదు. అదే సమయంలో కేరళలో బలపడేందుకు శబరిమల ఆలయ వివాదం వంటి వాటిని రాజేసినా బీజేపీ కి ఫలితం దక్కలేదు.

ఇక కాంగ్రెస్ సారధి రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, అక్కడే తన పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోవడం రాహల్ నాయకత్వం మీద కార్యకర్తల్లో ఉన్న అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది. అందులోనూ ఐదేళ్లకో సారి ఖచ్చితంగా అధికార పార్టీని మార్చేసే కేరళ ప్రజల మనసులు గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ దానికి అనుగుణంగా వ్యవహరించలేకపోవడం విశేషం.

కేరళలో యువతకు ఎక్కువ మంది సీట్లు ఇచ్చిన సీపీఎం రూటు మార్చి విజయపథంలో సాగినట్టు కనిపిస్తోంది. గతానికి భిన్నంగా కొత్త తరం సారధ్యంలో సీపీఎం సాగింది. పైగా దేశమంతా ఆపార్టీని ప్రజలు ఆదరించడానికి సిధ్ధంగా లేకపోయినా కేరళలో మాత్రం రెండోసారి అధికారం దక్కించుకోవడం విశషంగానే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి