iDreamPost

చెత్తతో దర్శనమిస్తున్న కేదార్ నాథ్

చెత్తతో దర్శనమిస్తున్న కేదార్ నాథ్

చార్ ధామ్ యాత్రకు విపరీతమైన జనం తరలివచ్చారు. వీరి రాకతో చార్ ధామ్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. రెండేళ్ల విరామం అనంతరం చార్ ధామ్ యాత్రకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే వీరి సంఖ్య పెరగడం అధికారులకు సమస్యలను తీసుకొచ్చి పెట్టింది. ఈ పవిత్ర స్థలానికి కాలిబాటన వెళ్లాలనే సంగతి తెలిసిందే. ఆ మార్గాల్లో ప్రస్తుతం భారీ ఎత్తున చెత్త దర్శనమిస్తోంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర రకాల చెత్తతో నిండిపోయాయి.

నాలుగు ధామ్ లలో ఒకటైన కేదార్ నాథ్ లో వ్యర్థాల ఉత్పత్తి రోజుకు 5 వేల కిలోల నుంచి 10 వేల కిలోలకు పెరిగిందని అధికారులు అంటున్నారు. 2022లో ఇది రెట్టింపు అయ్యింది. కేదార్ నాథ్ మొత్తం అటవీ ప్రాంతంలో ఉంటుంది. నిత్యం టన్నలు కొద్ది వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండడం వల్ల స్థానికంగా పర్యావరణం కలుషితం కావడమే కాకుండా.. వన్యప్రాణులు ప్రమాదానికి గురవుతున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. గత 15 రోజుల్లో ఒక్క కేదార్ నాథ్ ను 2.35 లక్షల మంది యాత్రికులు సందర్శించారని తెలిపారు. గౌరీకుండ్ సమీపంలో ఏడు అడుగుల లోతున గుంతలు తవ్వి చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్ల కవర్లు, పొగాకు చుట్టలను పూడి వేయడం జరుగుతోందని కేదార్ నాథ్ లో క్లీన్ చేసే సూపర్ వైజర్ అశోక్ సింఘానియా తెలిపారు. ఇతర వ్యర్థాలను తరలించడానికి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు.

ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ లో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 13 రోజుల్లో 5 లక్షల మంది యాత్రికులు చార్ ధామ్ పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లు అంచనా. మరొక మిలియన్ మంది సందర్శించడానికి నమోదు చేసుకున్నారు. వాతావరణం అనుకూలంగా ఉంటే.. ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని.. అదే జరిగితే రికార్డులను అధిగమిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

కానీ.. కేదార్ నాథ్ తో పాటు పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ చెత్త పేరుకపోవడం వల్ల జీవావరణానికి ప్రమాదకరమని ప్రొఫెసర్ ఎంఎస్ నేగి హెడ్, గర్వాల్ సెంట్రల్ యూనివర్సిటీ భౌగౌళిక నిపుణులు వెల్లడిస్తున్నారు. కొండచరియలు విరిగిపడడానికి కారణమౌతుందన్నారు. 2013 సంవత్సరంలో జరిగిన ఘోర విషాదాన్ని అందరూ గుర్తించుకోవాలని సూచిస్తున్నారు. బద్రినాథ్ లో మాత్రం ప్లాస్టిక్ ను అనుమతించరు. కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇక్కడ ఒక సవాల్ గా మారిపోయాయి. ఉత్తర కాశీ జిల్లాల్లోని గంగోత్రి, యమునోత్రిలో మరో రెండు ధామ్ లలో రోజుకు సుమారు 8 వేల కిలోల ఘన వ్యర్థాలు పేరుకపోతున్నాయని అంచనా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి