iDreamPost

కేసీఆర్ ద్విముఖ వ్యూహం

కేసీఆర్ ద్విముఖ వ్యూహం

బీజేపీకి దూకుడుకు కళ్లెం వేసేందుకు కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టారు. రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించి ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. ఎన్డీయేతర పార్టీలను ఏకం చేసే దిశలో అడుగులు వేస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థాయిలో మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. నూతన వ్యవసాయ చట్టాలను తేనెపూసిన కత్తితో అభివర్ణించిన టీఆర్ఎస్ పై బీజేపీ కూడా ఘాటు విమర్శలు చేస్తోంది. దేశవ్యాప్త బంద్ లో తెలంగాణ రాష్ట్ర సమితి భాగస్వామ్యాన్ని కమలం నేతలు తప్పుబడుతున్నారు. ధర్నా చౌక్ అక్కర్లేదన్న పార్టీ ధర్నాలకు దిగడమేంటని విమర్శిస్తున్నారు. ఈ పరస్పర వాగ్యుద్ధం నడుమే కేసీఆర్ ప్రధానికి ప్రేమ లేఖ రాశారు. అవును…. ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

కేంద్రం చేపట్టిన ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. సరికొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కింద ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు గల ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సంస్థ యాజమాన్యం ఇప్పటికే ఇందుకు సంబంధించిన నమూనాలను సిద్ధం చేసింది. కేంద్రం తలపెట్టిన ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు.

దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పార్లమెంటు భవన నిర్మాణాన్ని తలపెట్టింది కేంద్ర ప్రభుత్వం. త్రిభుజాకారంలో పార్లమెంటు భవనంతో పాటు కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ను నిర్మించనున్నారు. లైబ్రరీ, కమిటీ గదులు, డైనింగ్ హాళ్లు, పార్కింగ్ వంటి ఇతర నిర్మాణాలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. 4,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న నూతన పార్లమెంటు భవనం ఆత్మనిర్భర్ భారత్ దేవాలయంలా ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. కేంద్రం తలపెట్టిన ఈ ప్రాజెక్టును మెచ్చుకుంటూ ప్రధానికి లేఖ రాసిన కేసీఆర్, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. సరైన సమయంలో కేంద్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశ సార్వ భౌమత్వాన్ని ప్రతిబింబించేలా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. యావత్ దేశం గర్వించేలా పార్లమెంట్ భవనం నిర్మితం కావాలని, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా ఉండాలని కాంక్షించారు. దేశ చరిత్రలో నిలిచిపోయే ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోపే పూర్తి చేయాలని కోరారు. కేంద్రంలో అధికారంలో బీజేపీతో ఓ వైపు యుద్ధం చేస్తూనే మరోవైపు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల పట్ల సానుకూలంగా స్పందించడం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. బీజేపీ విమర్శలను ఎదుర్కొనేందుకు, తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని చాటుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించడానికి ముందే రాష్ట్రంలో యాసంగి సీజన్‌ రైతు బంధు పథకంపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 27 నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని ఆదేశించారు. ప్రతిపక్షాల విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఎత్తుగడ ఇందులో కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని చాటి చెప్పడంతో పాటు కేంద్రం చేపట్టే అభివృద్ధి పథకాలను స్వాగతించడం ద్వారా విమర్శకుల నోళ్లు మూయించాలనుకుంటున్నారు. అదే సమయంలో కేంద్రం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తాలనుకుంటున్నారు. కేసీఆర్ అనుసరిస్తున్న ఈ ద్విముఖ వ్యూహం ఎలాంటి ఫలితాలిస్తుందో మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి