iDreamPost

40 మంది కాశ్మీర్ పండిట్ల ఊచకోత -32 ఏళ్ల తర్వాత ఉగ్రవాది బిట్టాపై విచారణ

40 మంది కాశ్మీర్ పండిట్ల ఊచకోత  -32 ఏళ్ల తర్వాత ఉగ్రవాది బిట్టాపై విచారణ

ది కశ్మీర్ ఫైల్స్.. 1990 ప్రాంతంలో కల్లోలిత జమ్మూకాశ్మీర్లో హిందూ పండిట్ల ఊచకోత ఘటనలు, వలసలను కళ్లకు కట్టిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణలోనూ, వసూళ్లపరంగానూ ఎంతో సంచలనం సృష్టిస్తోంది. దాంతో ఆనాటి బాధితుల్లో చాలామంది బయటకొచ్చి.. ఉగ్రవాదుల వల్ల తాము ఎదుర్కొన్న కష్టనష్టాలను వివరిస్తున్నారు. ఆ సినిమాలో చూపించిన ఒక పాత్ర పేరు బిట్టా కరాటే.. జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) ఉగ్రవాది అయిన బిట్టా చేతిలో ఎంతోమంది హతమయ్యారన్న ఆరోపణలు, కేసులు ఉన్నాయి. 32 ఏళ్ల తర్వాత ఆయనపై ఉన్న కేసుల్లో ఒకటి తెరపైకి వచ్చింది. బిట్టా చేతిలో హతమైన సతీష్ టిక్కూ అనే వ్యక్తి కుటుంబం వేసిన పిటిషన్ ను శ్రీనగర్ సెషన్స్ కోర్టు విచారణకు స్వీకరించడంతో మూడు దశాబ్దాలనాటి బిట్టా మారణకాండ మళ్లీ చర్చనీయాంశమైంది.

చిన్ననాటి స్నేహితుడిపైనే మొదటి వేటు

కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ఫరూక్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే 1973లో జన్మించాడు. ఈయన తండ్రి వ్యాపారి. యుక్త వయసులోనే బిట్టా సరిహద్దు రేఖ (ఎల్ఓసీ) దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు వెళ్లి మిలిటెంట్ గా శిక్షణ పొందాడు. అనంతరం తిరిగివచ్చి జేకేఎల్ఎఫ్ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి హింసాత్మక ఘటనలకు నాయకత్వం వహించాడు. తాను కూడా స్వయంగా హత్యాకాండ కొనసాగించాడు. ఊచకోతలను తన చిన్ననాటి స్నేహితుడితోనే మొదలుపెట్టాడు. వ్యాపారవేత్త అయిన సన్నిహిత మిత్రుడు సతీష్ టిక్కూనే మొదట హతం చేశాడు. అప్పటినుంచి 40 మంది వరకు అతని రక్తదాహానికి బలయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. 1990 జూన్ 22న శ్రీనగర్లో బీఎస్ఎఫ్ దళాలు బిట్టాను అరెస్టు చేయడంతో అతని మారణకాండకు అడ్డుకట్ట పడింది.

2019లో మళ్లీ అరెస్టు

కాశ్మీర్లో జరిగిన 19 హింసాత్మక ఘటనల్లో బిట్టా పాల్గొన్నాడన్న ఆరోపణలతో అతనిపై కేసులు ఉన్నాయి. 1990 జూన్లో ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద అరెస్టు చేయడంతో సుమారు 16 ఏళ్లు జైలు జీవితం గడిపిన ఆయన 2006లో బెయిల్ పై విడుదల అయ్యాడు. అనంతరం హింసాత్మక చర్యలకు పాల్పడకపోయినా టెర్రరిస్ట్ సంస్థలకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై 2019లో మళ్లీ ఎన్ఐఏ అరెస్టు చేయడంతో ప్రస్తుతం శ్రీనగర్ జైలులో ఉన్నాడు. ఇటీవల విడుదలైన కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ద్వారా స్ఫూర్తి పొందిన సతీష్ టిక్కూ కుటుంబం న్యాయవాది ఉత్సవ్ బైన్స్ సహాయంతో శ్రీనగర్ సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. బిట్టాపై నమోదైన కేసుల తాజా పరిస్థితి తెలియజేయడంతో పాటు సతీష్ టిక్కూ హత్య విషయంలో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోర్టును కోరింది. మరోవైపు 1990ల నాటి ఊచకోతలు, పండిట్ల కుటుంబాల వలసలపై సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ జరిపించాలని కోరుతూ కాశ్మీర్ పండిట్స్ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టులో ఇటీవలే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి