iDreamPost

కార్తికేయ 2 మొదటి వారం కలెక్షన్లు – లాభాల వర్షాలు

కార్తికేయ 2 మొదటి వారం కలెక్షన్లు – లాభాల వర్షాలు

విడుదల టైంలో సరైన సంఖ్యలో థియేటర్లు దొరక్క హిందీలో లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ ల వల్ల ఇబ్బంది పడ్డ కార్తికేయ 2 ఎట్టకేలకు గొప్ప విజయం నమోదు చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. నిఖిల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని చాలా రీజనబుల్ రేట్లకు బిజినెస్ చేయడంతో బయ్యర్లకు లాభాల పంట పండుతోంది. అటు నార్త్ లోనూ వసూళ్లు బాగా వస్తున్నాయి. ఏడు వేల స్క్రీన్లలో ప్రస్తుతం కార్తికేయ 2 రచ్చ జరుగుతోంది. లైగర్ రావడానికి ఇంకో వారం సమయం ఉంది కాబట్టి అప్పటిదాకా ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. బాలీవుడ్ లో నిన్న పోటీగా వచ్చి తాప్సీ అనురాగ్ కశ్యప్ ల దొబారా సైతం దుకాణం సర్దేసింది.

ఇక వసూళ్ల విషయానికి వస్తే కార్తికేయ 2 ఇప్పటిదాకా ఏడు రోజులకు గాను అందుకున్న షేర్ అక్షరాలా 28 కోట్లు. అది కూడా ఇంకా పది రోజులు దాటకుండానే. థియేట్రికల్ బిజినెస్ 14 కోట్ల 70 లక్షలకు చేస్తే డబుల్ మార్జిన్ తో లాభాలు ఇచ్చేసింది. ఈజీగా ఇంకో పది కోట్లకు పైగానే జోడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నైజామ్ 7 కోట్లు, సీడెడ్ 2 కోట్ల 90 లక్షలు, ఉత్తరాంధ్ర 2 కోట్ల 59 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 2 కోట్ల 52 లక్షలు, గుంటూరు 1 కోటి 65 లక్షలు, కృష్ణా 1 కోటి 36 లక్షలు, నెల్లూరు 59 లక్షలు, కర్ణాటకతో కలిపి రెస్ట్ అఫ్ ఇండియా 1 కోటి 63 లక్షలు, ఓవర్సీస్ 3 కోట్ల 25 లక్షలు, ఉత్తరాది రాష్ట్రాలు 4 కోట్ల 45 లక్షల దాకా రాబట్టాయి. మొత్తం ఇరవై ఎనిమిది కోట్లన్న మాట.

ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగించేందుకు కార్తికేయ 2 బృందం నాన్ స్టాప్ ప్రమోషనల్ టూర్లు చేస్తూనే ఉంది. మొన్నే ముంబై తదితర ప్రాంతాలు వెళ్లొచ్చి నిన్న తిరుపతి దర్శనం కూడా పూర్తి చేసుకున్నారు. ఇస్కాన్ టెంపుల్ తరఫున ప్రత్యేక అభినందన అందుకోవడం ఈ బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. బింబిసార, సీతారామంలు రన్ కొంత నెమ్మదించడం కూడా కలిసి వచ్చింది. నితిన్ మాచర్ల నియోజకవర్గం పూర్తిగా వాష్ అవుట్ కావడంతో పాటు నిన్న విడుదలైన ఏడు సినిమాలు ఏ మాత్రం చూడలేమన్నంత దారుణమైన టాక్ తెచ్చుకున్నాయి. ఒక తిరు మాత్రమే పర్లేదన్నారు కానీ దానికీ థియేటర్ కొచ్చి చూసేంత సీన్ కనిపించడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి