iDreamPost

కర్ణాటక రాజకీయాల్లో సిద్దరామయ్య పేల్చిన బాంబు

కర్ణాటక రాజకీయాల్లో సిద్దరామయ్య పేల్చిన బాంబు

కర్ణాటకలో రాజ్యసభ,ఆ రాష్ట్ర శాసన మండలి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కమలం పార్టీలో ముసలం పుట్టింది.గత గురువారం ముఖ్యమంత్రి యడియూరప్పపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉత్తర కర్నాటకకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు మాజీ మంత్రి ఉమేశ్ కట్టి నివాసంలో విందు భేటీ నిర్వహించారు.తాజాగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య బిజెపి పార్టీకి చెందిన అసంతృప్తి ఎమ్మెల్యేలు కొంతమంది తనను కలిసి తమ అసంతృప్తిని పంచుకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.పైగా వారందరూ తనతో టచ్‌లో ఉన్నారని సిద్ధరామయ్య ప్రకటించడంతో కమలం పార్టీలో కలవరం మొదలైంది.

నిన్న కొప్పల్‌లో సిద్దరామయ్య నిర్వహించిన విలేకరుల సమావేశంలో బిజెపిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నది వాస్తవం కానీ అది బీజేపీ అంతర్గత వ్యవహారమని,తానేమి జోక్యం చేసుకోవటం లేదని తెలిపారు.పలువురు శాసనసభ్యులు యడియూరప్ప వ్యవహార శైలి,పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని,ఆయన కుమారుడు బి.వై. విజయేంద్ర పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించిన సిద్దరామయ్య ప్రజలు విజయేంద్రను “రాజ్యాంగేతర ముఖ్యమంత్రి” అని పిలుస్తారని పేర్కొన్నారు. తనకు,కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డి కె శివకుమార్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని,ఇద్దరి మధ్య సత్సంబంధాలు నెలకొని ఉన్నాయని సిద్దరామయ్య స్పష్టం చేశారు.

ఇక మాజీ సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలపై కర్నాటక బిజెపి అధికార ప్రతినిధి తేల్చ ప్రకాశ్ మండిపడ్డాడు.గత ఓటమి నుంచి సిద్దరామయ్య ఇంకా కోలుకోలేదని, అందుకే ఇలాంటి ఆధార రహిత వ్యాఖ్యలు తమ శాసనసభ్యులపై చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం యడియూరప్ప సర్కార్ కరోనా మహమ్మారిపై అలుపెరగని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. సీఎం యడియూరప్పపై ఎమ్మెల్యేలు ఎవరూ అసంతృప్తిగా లేరని, ప్రభుత్వం స్థిరంగానే ఉంటుందని ప్రకాశ్ ప్రకటించారు.

అధికార బిజెపి వాదన ఎలా ఉన్న కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి తనకివ్వనందుకు రగిలిపోతున్న ఆ పార్టీ సీనియర్‌ నేత,బలమైన లింగాయత్‌ వర్గానికి ఉమేశ్ కట్టి సీఎం యడియూరప్పపై బహిరంగంగానే అసంతృప్తి ప్రకటిస్తున్నాడు.8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై బెళగావి జిల్లాకు చెందిన ఉమేశ్ కట్టి అసంతృప్తికి గురయ్యారు. తన వర్గానికి చెందిన సుమారు 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం యడియూరప్పపై తిరుగుబాటు చేసేందుకు ఆయన సిద్ధపడినట్లు కర్ణాటక రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది. అదేవిధంగా లింగాయత్ వర్గానికి చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ కూడా యడియూరప్పపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.

కర్నాటక బిజెపి పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను కాంగ్రెస్ అధిష్టానం,జేడీఎస్‌ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి