iDreamPost

ఆలస్యంగా తెరుచుకున్న కనులు

ఆలస్యంగా తెరుచుకున్న కనులు

గతవారం విడుదలైన భీష్మ సందడి బాగానే కొనసాగుతోంది. మూవీ లవర్స్ కి ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు కావాల్సిందే కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టి 28వ తేదీ మీద పడింది. హైప్ పరంగా చూసుకుంటే క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న విశ్వక్ సేన్ హిట్ ఎక్కువ అడ్వాంటేజ్ లో ఉంది. ఇవి కాకుండా మరో రెండు డబ్బింగ్ మూవీస్ కూడా అదే రోజు పలకరించనున్నాయి. అందులో ధనుష్ లోకల్ బాయ్ ఒకటి. ఇది గత నెల సంక్రాంతికి వచ్చిన తమిళ సినిమా పట్టాస్ తెలుగు వెర్షన్.

ఇక కోలీవుడ్ తో పాటు సమాంతరంగా విడుదలవుతున్న చిత్రం కనులు కనులను దోచాయంటే. మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్, పెళ్లి చూపులు భామ రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా గురించి రెగ్యులర్ ఆడియన్స్ కు పెద్దగా అవగాహన లేదు. కారణం ఏ దశలోనూ దీనికి సంబంధించిన ప్రమోషన్స్ సాగకపోవడమే. దీని వెనుక మరో కథ కూడా ఉంది. ఇది కొత్తగా పూర్తయిన సినిమా కాదు. రెండేళ్ల క్రితమే షూటింగ్ చేసేసుకుంది. కానీ రిలీజ్ లో మాత్రం జాప్యం జరిగింది. దేసింగ్ పెరియస్వామి అనే కొత్త దర్శకుడితో రూపొందిన ఈ మూవీ ద్వారా కల్ట్ క్లాసిక్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్ గా డెబ్యూ చేస్తున్నారు.

మసాలా కాఫి అనే టీమ్ పాటలు కంపోజ్ చేయగా అర్జున్ రెడ్డికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ బీజీఎమ్ ఇచ్చారు. కొన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ఆలస్యం వల్ల దీని మీద అంతగా బజ్ లేదు. ఒకవేళ టాక్ వస్తే అంతో ఇంతో యూత్ అండతో గట్టెక్కవచ్చు. 2017లో షూటింగ్ మొదలుపెట్టుకుని ఇప్పటికి వస్తోందంటే ఇదేదో యాక్షన్ మూవీ అనుకోకండి. లవ్ స్టోరీనే. కాకపోతే లొకేషన్స్ చాలా రిచ్ గా ఎంచుకున్నారు. మణిరత్నం దొంగ దొంగ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ పల్లవిని టైటిల్ గా తీసుకున్న ఈ మూవీ ఇంత ఆలస్యంగా కనులు తెరుచుకుంది. మరి ప్రేక్షకులు ఏ మేరకు కరుణిస్తారో రేపటితో తేలిపోతుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి