iDreamPost

వెయ్యి రూపాయలు సహాయం చేయటం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటా!!!

వెయ్యి రూపాయలు సహాయం చేయటం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటా!!!

లాక్ డౌన్ విపత్తు సమయంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయడం నేరమంటున్న కన్నా లక్ష్మీనారాయణ , సీపీఐ రామకృష్ణ ప్రభృతులు.

ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన తరువాత పలు ఇబ్బందులకు గురయ్యే ప్రజల కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పలు విధాలైన సహాయ కార్యక్రమాలు చేపట్టాయి . వాటిలో ఆర్ధిక సాయం కూడా ఒకటి . దీనిలో భాగంగానే ఏపీ ప్రభుత్వం కూడా BPL దిగువ వ్యక్తులకు 1000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకొని అందుకోసం ఈ నెల రెండవ తేదీన 1300 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు . ఆ తరువాత నాలుగవ తారీఖు నుండి విలేజ్ వలంటీర్ల ద్వారా పంపిణీ కూడా ప్రారంభించారు .

ఈ విషయంలో రాష్ట్రంలోని విపక్షాలు పలు విమర్శలు చేశాయి . కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం తమ పేరు జోడించుకొంటుందని , అవి కేంద్ర నిధులని టీడీపీ , జనసేన ప్రచారం చేశాయి . చివరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ ఏమి ఇస్తుందో కూడా తెలియకుండానో తెలిసినా ఉద్దేశ్యపూర్వకంగానో ఇదే దుష్ప్రచారం చేశారు . అయితే కేంద్రం నాల్గవ తారీఖు లబ్ది దారుల ఖాతాకు ఐదొందలు ఆర్ధిక సాయం అందించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వెయ్యి రూపాయల సహాయానికి కేంద్రం ఇచ్చిన ఐదు వందలకి సంభందం లేదని నిర్ధారణ అయ్యాక కన్నా , సీపీఐ రామకృష్ణ ప్రభృతులు సరికొత్త పల్లవి అందుకున్నారు.

స్థానిక ఎన్నికల ప్రచారం కోసమే వైసీపీ వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేస్తుందని , ఎన్నికల ముందు ఇలా చేయడం ఎన్నికల కోడ్ ను ఉల్లఘించడమేనంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి పిర్యాదు చేసారు . ఇవే ఎన్నికల్లో బీజేపీ కూడా పోటీ చేస్తుందని మర్చిపోయారేమో కన్నా గారు . మరి బీజేపీ కూడా 500 రూపాయలు చొప్పున BPL కుటుంబాలకు చేసిన ఆర్ధిక సాయం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమో కాదో కన్నా నే చెప్పాలి . అలాగే స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడ్డ తర్వాత ఎన్నికల కోడ్ తొలగించిన విషయం తెలీదేమో , కోడ్ తొలగించిన తర్వాత ఈసీకి రాష్ట్ర పాలన , పథకాల్లో జోక్యం చేసుకొనే హక్కు లేదని తిరిగి ఈసీ నే చెప్పేవరకూ పలుమార్లు ఎమ్మెల్యేగా , మంత్రిగా చేసిన కన్నా లాంటి సీనియర్ రాజకీయ నాయకులకు తెలియకపోవడం విచారకరం .

రాష్ట్ర ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకోకుండా కన్నా ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడో అంటూ బీజేపీ శ్రేణులు కూడా తలలు పట్టుకుంటున్నాయి. పార్టీ విధానాన్ని కాదని సొంత అజెండాతో పనిచేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ మీద ఆరోపణలు చేస్తున్నారు.

ఇహ మరో పిర్యాదిదారు సీపీఐ రామకృష్ణ తీరు గమనిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ పార్టీ ప్రభుత్వం పై చేస్తున్న విమర్శల్ని తాను అందిపుచ్చుకొంటూ , టీడీపీ ఆందోళనల్లో భాగస్వామి అవుతూ బాబు ముసుగుగా వ్యవహరిస్తున్నాడని సొంత పార్టీ నేతల నుండే ఈయన పై విమర్శలు వచ్చాయి . అవేవీ ఖాతరు చేయని రామకృష్ణ ఇటీవలి రాజధాని వికేంద్రీకరణ అంశంలో సైతం అమరావతినే కొనసాగించాలని టీడీపీ చేస్తున్న ఆందోళనలో భాగస్వామి కావడం విశేషం .

వీటన్నిటినీ బట్టి చూస్తే ఈ ఆరోపణలన్నీ టీడీపీ డైరెక్షన్ లో జరుగుతున్న యాక్షన్ అని అందులో వీరు భాగస్వాములు అని పలువురు సీనియర్ నాయకులు విశ్లేషించటం విశేషం . ఏదేమైనా ఇలాంటి సంక్షోభ సమయంలో సామాన్య ప్రజలకు అందించే సహాయం పై కూడా ఇలా రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు చేయడం బాధాకరం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి