iDreamPost

జర్నలిస్ట్ నుంచి మంత్రి వరకూ

జర్నలిస్ట్ నుంచి మంత్రి వరకూ

కురసాల కన్నబాబు.. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో బహుశా ఈ పేరు తెలియని వారు ఉండరేమో!. అనతికాలంలోనే జర్నలిజం వృత్తి నుండి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, రాష్ట్రమంత్రివర్గంలో కీలక స్థానం సంపాదించుకొని, అసెంబ్లీ, పాలనా వ్యవహారాలలో జగన్ ప్రభుత్వ వాణి ని సమర్ధంగా వివిపిస్తిస్తూ తక్కువ సమయంలోనే జగన్ కోటరీతో పాటు ప్రభుత్వంలో కీలక నేతగా కురసాల కన్నబాబు ఎదిగారు.

కాకినాడకు చెందిన ఆయన డిగ్రీ పూర్తిచేసిన అనంతరం ఈనాడు దినపత్రికలో న్యూస్ రిపోర్టర్ గా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ మండలమైన మారేడుమిల్లి లో పనిచేశారు. అనంతరం ఈనాడు జర్నలిజం స్కూల్ లోకు వెళ్లి శిక్షణ తరవాత పశ్చిమ గోదావరి జిల్లా లో స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వర్తించారు. జర్నలిజంలో తన ప్రతిభా పాఠవాలతో అనతికాలంలోనే ఈనాడు సెంట్రల్ ఆఫీసులో ఉన్నత స్థానానికి చేరారు. దాదాపు 18 సంవత్సరాల పాటు ఈనాడులో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికలకి ముందు ఈనాడు తరుపున చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాలూ చూసే బీట్ రిపోర్టర్ గా పని చేశారు. ఆ సమయంలో చిరంజీవికి దగ్గరయ్యాడు. అప్పుడే కన్నబాబులోని చురుకుదనం, శక్తీ సామర్ధ్యాలు గుర్తించిన చిరంజీవి తన పార్టీ తరుపున కొత్తగా ఏర్పడిన కాకినాడ రురల్ అభ్యర్థిగా అనూహ్యంగా కన్నబాబు ని ప్రకటించాడు. ఆ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్, తెలుగుదేశాన్ని వెనక్కి నెట్టి కన్నబాబు ఎమ్మెల్యే గా గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారాజ్యం తరపున గెలుపొందిన 18 మందిలో కన్నబాబు ఒకరు.

తరువాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యడంతో 2014 లో కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి కాకినాడ రురల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన కన్నబాబు ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చి 43, 742 ఓట్లు సాధించడం విశేషం. ఆ ఎన్నిక తరువాత వైసీలో చేరిన ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ తూర్పు గోదావరి జిల్లా వైసిపి అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టాడు. ఆ సమయంలో కాపు ఉద్యమంలో పార్టీ వాయిస్ ని సమర్ధంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించడం తో జగన్ దగ్గర మంచి గుర్తింపు లభించింది. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా కాకినాడ రురల్ నుండే వరుసగా మూడోసారి పోటీ చేసిన ఆయన మంచి మెజారిటీ తో రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తక్కువ సమయంలోనే కాపులలో బలమైన నేతగా ఎదిగిన కన్నబాబు హేమాహేమీలను వెనక్కి నెట్టి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

శ్రమను నమ్ముకున్న వాళ్ళు ఎదుగుతారనడానికి కన్నబాబే పెద్ద ఉదాహరణ. మీడియా నుంచి వచ్చిన కన్నబాబు రాజకీయేతర రంగాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయాల పై ఆసక్తి ఉన్నాఇక్కడ రాణించడం పై సందేహాలతో ఉగిసలాడుతున్న పలు రంగాల్లోని నిపుణులకు కన్నబాబు విజయవంతమైన ప్రయాణం దారి చూపుతుందనడంలో సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి