iDreamPost

నవంబర్ 7 – త్రీ స్టార్స్ బర్త్ డే..

నవంబర్ 7 – త్రీ స్టార్స్ బర్త్ డే..

ఈ రోజు సోషల్ మీడియా ముగ్గురికి జన్మదిన శుభాకాంక్షలుతో హోరెత్తిపోతోంది. కమల్ హాసన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనుష్కల బర్త్ డే సందర్భంగా అభిమానుల సందడి మాములుగా లేదు. ముగ్గురికి ముగ్గురు ప్రత్యేకత సంపాదించుకున్నవారే. లోకనాయకుడు కమల్ హాసన్ స్థిరపడింది తమిళంలోనే అయినా తెలుగులో చేసిన స్ట్రెయిట్ సినిమాలు స్వాతిముత్యం, సొమ్మొకడిది సోకొకడిది, సాగరసంగమం, ఇంద్రుడు చంద్రుడు, శుభసంకల్పం, ద్రోహి ఎంతో పేరుతో పాటు గొప్ప ఫాలోయింగ్ ఇచ్చాయి. డబ్బింగులు గురించి చెప్పుకుంటూ పోతే పేరాలు కాదు పుస్తకాలు కూడా సరిపోవు. విచిత్ర సోదరులు, కల్యాణరాముడు, భారతీయుడు, మైకేల్ మదన కామరాజు, క్షత్రియ పుత్రుడు, భామనే సత్యభామనే, దశావతారం లాంటి ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా ఇక్కడి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకున్నారు. వివాదాలు ఎన్ని వచ్చినా తాను నమ్మిన సూత్రానికి కట్టుబడే కమల్ శైలి అందరికన్నా భిన్నం.ఇటీవలే విక్రమ్ బ్లాక్ బస్టర్ తో మూడు వందల కోట్ల పవర్ ఫుల్ కంబ్యాక్ ఇచ్చి యూత్ కి ఛాలెంజ్ విసిరారు.

Rana shares birthday wishes for Kamal Haasan, Anushka Shetty, Trivikram

ఒక రైటర్ కి స్టార్ ఇమేజ్ రావడం చాలా అరుదు. అందులోనూ దర్శకులుగా మారి గొప్ప స్థాయికి చేరుకోవడం కూడా అంత సులభం కాదు. జంధ్యాల లాంటి ఒకరో ఇద్దరికో మాత్రమే అది సాధ్యమయ్యింది. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ లాంటి నిష్ణాతులు కూడా డైరెక్టర్లుగా మారాక ఫెయిల్యూర్స్ చూసినవాళ్ళే. కానీ దీనికి భిన్నంగా కేవలం మాటలతోనే తనకో బ్రాండ్ ఏర్పరుచుకున్న త్రివిక్రమ్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వాళ్ళు ఎందరో. స్వయంవరం, నువ్వే కావాలి, చిరునవ్వుతో, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి, జై చిరంజీవాలతో రచయితగా మెప్పించి నువ్వే నువ్వే, అతడు, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్స్ తో దర్శకుడిగా రెండు పడవల ప్రయాణాన్ని సమర్ధవంతంగా నడిపించి ఇప్పటికీ తిరుగు లేని స్థానంలో ఉన్న త్రివిక్రమ్ ని గురుజీ అని ప్రేమతో పిలుచుకునే అభిమానులకు లెక్కే లేదు. అందుకే మహేష్ బాబు 28 మీద అంచనాలు ఆకాశాన్ని దాటుతున్నాయి.

Telugu News, Telugu Cinema News, Andhra News, Telangana News, Political News

2005లో సూపర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పరిచయమైనా అనుష్క ఆ తర్వాత విజయశాంతి స్థాయిలో సోలోగా తనకంటూ మార్కెట్ సృష్టించుకుంటుందని ఎవరూ ఊహించలేదు. సమకాలీన కథానాయికలు గ్లామర్ పాత్రలకే పరిమితమవుతున్న తరుణంలో ఒకపక్క వాటిని చేస్తూనే మరోవైపు అరుంధతి లాంటి పవర్ ఫుల్ సబ్జెక్టులో జేజెమ్మగా మెప్పించి నీరాజనాలు అందుకోవడం తనకే చెల్లింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో మొదలుపెట్టి ఇప్పటి జెనరేషన్ ప్రభాస్, మహేష్ బాబు లాంటివాళ్లుతోనూ జట్టు కట్టడం తనకే చెల్లింది. హీరో లేకుండా కేవలం తన పేరు మీదే సినిమాను మార్కెట్ చేయగలిగేంత డిమాండ్ తెచ్చుకున్న అనుష్క ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నా నవీన్ పోలిశెట్టితో చేస్తున్న మూవీతో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. అందుకే సినిమా రంగానికి చెందిన ఈ ప్రతిభాకిరణాల మీద ఇంటా బయటా ఇంత ప్రేమ కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి