iDreamPost

కాకినాడలో బలమైన నేతను కోల్పోయిన వైసీపీ

కాకినాడలో బలమైన నేతను కోల్పోయిన వైసీపీ

కాకినాడ నగరంలో వైఎస్సార్‌సీపీకి పెట్టని కోటలా ఉండే కీలక నాయకుడు రాగిరెడ్డి వెంకట జయరామ్‌ కుమార్‌ (ఆర్‌వీజీ కుమార్‌) అలియాస్‌ ఫ్రూటీ కుమార్‌ కన్నుమూసారు. ఆయన వయస్సు 47 సంవత్సరాలు. కోవిడ్‌ భారిన పడ్డ ఆయన గత నెలరోజులుగా వైజాగ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడ్డారు. పార్టీలో కీలకనేతగా ఎదిగిన ఆయనను కోల్పోవడం పట్ల పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి.

2005లో కార్పొరేటర్‌గా ఎన్నికైన ఫ్రూటీ కుమార్, 2010 వరకు సేవలందించారు. అలాగే స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా, జిల్లా ప్రణాళికామండలి సభ్యుడిగా కూడా పనిచేసారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అదే వార్డు నుంచి తన భార్యను కూడా కార్పొరేటర్‌గా గెలిపించుకున్నారు. ప్రస్తుతం ఆమె నగర పాలక సంస్థ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేస్తున్నారు.

పార్టీ ఆవిర్భావం నుంచీ వైఎస్సార్‌సీపీ కాకినాడ నగర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో అప్పటి అధికార టీడీపీని ఎదుర్కొని వైఎస్సార్‌సీపీ విజయం కోసం సహచర నాయకులతో కలిసి శక్తివంచన లేకుండా కృషి చేసారు. పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ పెట్టిన ప్రలోభాలకు ఫ్రూటీ కుమార్‌ తలొగ్గకుండా నిలబడ్డారు.

కాకినాడ పట్టణంలో ప్రతి వార్డులోనూ పార్టీ కార్యకర్తలను పేరుతో పలకరించే చొరవ ఫ్రూటీకుమార్‌ సొంతం. అందరికీ తలలో నాలుకలా మసలుకునే ఫ్రూటీ కుమార్‌ను కోల్పోవడం పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఫ్రూటీ కుమార్‌ అనారోగ్య విషయం తెలుసుకుని సీయం వైఎస్‌ జగన్‌ ఫోనులో ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరాతీసారు. ఫ్రూటీ కుమార్‌ అంత్యక్రియల్లో జిల్లాలోని పలువురు మంత్రులు, వైఎస్సార్‌సీపీ కీలక నాయకులు పాల్గొన్నారు.

కాగా గత నలభై సంవత్సరాలుగా ఫ్రూటీ డీలర్‌గా పనిచేస్తుండడంతో ఆయన పేరు ఫ్రూటీ కుమార్‌గా స్థిరపడిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి