iDreamPost

వ్రతం చెడ్డా.. ఫలితం దక్కడం లేదా..

వ్రతం చెడ్డా.. ఫలితం దక్కడం లేదా..

ఎన్నో నియమనిష్టలతో చేసిన వ్రతం చెడిపోయినా గానీ ఫలితం దక్కితే చాలనుకుంటుంటారు. రాజకీయాల్లో అయితే ఏ గడ్డి కరిచినా గానీ అంతిమంగా తాము కోరుకున్న పదవి లభిస్తే అంతే చాలని తృప్తి పడుతుంటారు. ఇందుకు తమకు ఒక వేదికను ఇచ్చిన పార్టీని కూడా కాదనకుని పక్క పార్టీల్లోకి జంపింగ్‌లు చేసేస్తుంటారు. ఒకప్పటి రాజకీయాల మాటెలా ఉన్నా ఇప్పుడు మాత్రం వ్రతం ఏమైనపోయినా గానీ ఫలితం మాత్రం వస్తే చాలనుకునే వారే ఎక్కువగా ఉంటున్నారంటుంటారు పరిశీలకులు. ఏది ఏమైనా గానీ తాము ఏదైతే కోరుకుని పార్టీ అధినేతల కోసం ఆఖరికి తమ రాజకీయ భవిష్యత్తును కూడా పక్కన పెట్టి పోరాడారో అటువంటి నాయకులెవరూ ఇప్పుడు తెరపై కన్పించడం లేదట. ఇందుకు ఏ ఒక్క పార్టీని వేలెత్తి చూపడం కాదుగానీ, దాదాపు అన్ని పార్టీల్లోనూ అటువంటి నాయకులను పార్టీకి డజను మందికి పైగానే ఉన్నారంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చిన తరువాత అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ను ఎదుర్కొవడానికి ఓ డజను మంది టీడీపీ నాయకులు పదేపదే మైకుల ముందుకొస్తుండేవారు. జగన్‌పై ఏదానై విమర్శ చేయాలీ అంటే సందర్భానుసారం సదరు పెద్దలంతా మైకాసురులైపోయేవారు. విధాన పరమైన విమర్శల కంటే మరో అడుగు ముందుకువేసి జగన్, ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు సైతం చేసేస్తుండేవారు. సొంత మీడియా అండతో వీరికి సంబంధించిన వార్తలు, వీడియోలు, మీడియా చర్చాగోష్టులు నానా మంగామా చేసేవి. అయితే ఒక్కసారిగా పరిస్థితి తల్లక్రిందులైపోయింది. తాము సుందరంగా ఊహించుకున్న అధికారం తమది కాకుండా పోయింది. దీంతో వీరంతా ఇప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. అసలిప్పుడు వీరంతా ఏం చేస్తున్నారో? కూడా ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యతాక్రమం నుంచి వీరంతా పక్కకు పెట్టేయబడ్డారన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇలా పక్కన పెట్టడం, ప్రాధాన్యం ఇవ్వడం అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కానీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే మీడియా ముందుకొచ్చేసే వీరంతా ఇప్పుడిలా మిన్నకుండిపోవడం చర్చనీయాంశంగానే మారింది.

అలాగే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నుంచి అప్పటి అధికార తెలుగుదేశం పార్టీలోకి దాదాపు 23 మంది జంప్‌ చేసేసారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ చూపిన ప్రలోభాలకు వీరంతా అటుమళ్ళారని అప్పట్లో వైఎస్సార్‌సీపీ ఆరోపణలు కూడా గట్టిగానే చేసింది. అయితే అలా జంపింగ్‌ చేసిన వాళ్ళు అక్కడైనా ఒక వెలుగు వెలుగుతున్నారా? అంటే అదీ లేదు. టీడీపీలో పాతకాపుల పరిస్థితే అయోమంగా ఉంటే ఇలా వెళ్ళిన వలస నాయకులను పట్టించుకునేదెవరు. ఇప్పుడు వీరు కూడా ఏం చేస్తున్నారో? ఎక్కడ ఉన్నారో? కూడా అర్ధం కాని స్థితిలోకి చేరుకున్నారు. ఒక వేళ వైఎస్సార్‌సీపీనే నమ్ముకుని ఉంటే ఇప్పుడు వీరున్న స్థితికంటే ఉన్నతంగానే ఉండేవారన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వెలిబుచ్చుతున్నారు. తాము ఏదైతే కోరుకుని పార్టీలోకి మారారో? అది దక్కకపోవడంతో వీరికి కూడా వ్రతం చెడినప్పటికీ ఫలితం మాత్రం దక్కనే లేదంటున్నారు.

అలాగే బీజేపీలో ఒక ఊపు ఊపిన నాయకులు కూడా ఇప్పుడు అరణ్యవాసంలోకే వెళ్ళిపోయారు. మరోవైపు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన నాయకులు కూడా వారితో పాటు తెరచాటుకు చేరుకున్నారు. పార్టీ ఏదైనాగానీ పరిస్థితి ఒక్కలాగే ఉంటోందన్న అభిప్రాయం రాజకీయవర్గాల నుంచి విన్పిస్తోంది. కష్టమో, సుఖమో అధినాయకుడి సామర్ధ్యాన్ని నమ్మకంగా నమ్ముకున్న వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు కన్పిస్తోందన్న భావన వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుండా వ్యవహరిస్తే మాత్రం చరిత్రలోనే మిగిలిపోతున్నారన్న భావనను వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి