iDreamPost

నిమ్మగడ్డ పిటిషన్ పై 28న జడ్జిమెంట్

నిమ్మగడ్డ పిటిషన్ పై 28న జడ్జిమెంట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు రాష్ట్ర హైకోర్టు మరో మారు విచారణ జరిపింది. నిమ్మగడ్డ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు గత శనివారం రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. శనివారం దాఖలు చేసిన అఫిడవిట్ ప్రాథమికమైనదని.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అభ్యర్థనను మన్నించిన ధర్మాసనం నాలుగు రోజుల సమయాన్ని ఇచ్చింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ నెల 28వ తేదీన ఈ అంశంపై తుది తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్న సమయంలో కరోనా వైరస్ ను కారణంగా చూపి గత నెల 15వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా తీసుకున్న ఈ నిర్ణయంపై అప్పట్లో ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలు ఆశ్చర్యపోయాయి. రమేష్ కుమార్ వ్యవహరించిన తీరును సీఎం జగన్ తూర్పారబట్టారు.

నామినేషన్లు జరిగిన తీరును, ఏకగ్రీవాలను తప్పు పట్టే విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ లేఖను కేంద్రానికి రాసినట్లుగా మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఆ లేఖ తాను రాసిందో కాదో అని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్నమొన్నటి వరకు చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజును నియమించింది. ఐదేళ్ల పదవీకాలాన్ని మూడేళ్ల కు తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇప్పటికే నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోవడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవినుంచి దిగిపోవాలని వచ్చింది. తన తొలగించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 28వ తేదీన హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి