iDreamPost

Johnson & Johnson Talcum Powder బేబీ పౌడర్‌కు ఎందుకు జాన్సన్ & జాన్సన్ గుడ్‌బై చెబుతోంది? టాల్క్ పౌడ‌ర్ తో కేన్స‌ర్లు వ‌చ్చాయ‌న్న కేసుల సంగ‌తేంటి?

Johnson & Johnson Talcum Powder బేబీ పౌడర్‌కు ఎందుకు జాన్సన్ & జాన్సన్  గుడ్‌బై చెబుతోంది? టాల్క్ పౌడ‌ర్ తో కేన్స‌ర్లు వ‌చ్చాయ‌న్న కేసుల సంగ‌తేంటి?

జాన్సన్ & జాన్సన్ తన టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించడాన్ని 2023లో ఆపివేయ‌నుంది. ఇప్ప‌టికే US , కెనడాల్లో కంపెనీ ఉత్పత్తిని నిలిపివేసిన త‌ర్వాత‌, ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌స్తున్న కేసుల‌తో, టాల్క్ బేబీ పౌడ‌ర్ ను బంద్ చేయ‌నుంది. ఇక మీద‌ట తన బేబీ పౌడర్ ఉత్పత్తులన్నింటినీ టాల్కమ్ పౌడర్‌కు బదులుగా మొక్కజొన్న పిండిని ఉపయోంచాల‌ని “వాణిజ్యప‌ర‌మైన‌ నిర్ణయం” తీసుకున్నట్లు గురువారం తెలిపింది. కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో విక్రయిస్తున్నారు. బేబీ టాల్క్ పౌడ‌ర్ తో ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవ‌ని జాన్సన్ & జాన్సన్ చెబుతున్నా, ప‌దేళ్లగా టాల్క్ ఆధారిత బేబీ పౌడర్‌తో వ‌చ్చే క్యాన్సర్ ప్రమాదాలను కంపెనీ దాచిపెట్టింద‌న్న వ్యాజ్యాలను, కోర్టుల్లో ఎదుర్కొంటోంది.

ఆస్బెస్టాస్ (asbestos) వంటి క్యాన్సర్ కారకంతో మిక్స్ కావ‌డంవ‌ల్ల లటాల్క్ ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణమయ్యాయ‌న్న క‌స్ట‌మ‌ర్లు, కేన్స‌ర్ల నుంచి బయటపడిన వారి నుంచి J&J సుమారు 38,000 వ్యాజ్యాలను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎదుర్కొంటోంది.

దశాబ్దాల త‌ర‌బ‌డి శాస్త్రీయ పరీక్షలు, ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌ సంస్థ‌ల ఆమోదం త‌ర్వాత‌నే టాల్క్ సురక్షితమైనవ‌ని, ఆస్బెస్టాస్-రహితమైనవిగా తాము చెబుతున్నామ‌ని J&J అంటోంది. ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్ర‌క‌టిస్తూ, టాల్క్ పౌడ‌ర్ల వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లులేవ‌ని మ‌రోసారి చెప్పింది.

మే 2020లో, J&J పౌడ‌ర్ వ‌ల్ల క్యాన్సర్లు వ‌చ్చాయ‌ని ఆరోపిస్తూ వేలాది మంది వినియోగ‌దారులు కోర్టుల్లో కేసులు వేశారు.ఈ దెబ్బ‌కి కంపెనీ దిగివ‌చ్చింది. US , కెనడియన్ మార్కెట్‌ల నుండి తన టాల్క్ ఆధారిత పౌడర్‌లను ఉపసంహరించుకుంది. కేన్స‌ర్ భ‌యంతో ఎవ‌రూ కొన‌క‌పోవ‌డంవ‌ల్ల సంస్థ టాల్క్ పౌడ‌ర్ త‌యారిని ఇప్ప‌టికే ఆపేసింది.

రెండేళ్ల క్రిత‌మే అమెరికా, కెన‌డాలో అమ్మ‌కాల‌ను ఆపేసినా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ నిర్ణ‌యంతీసుకోవ‌డానికి ఇంత స‌మ‌యం ఎందుకు ప‌ట్టింద‌ని J&Jని సోష‌ల్ మీడియాలో నిల‌దీస్తున్నారు.

చర్మాన్ని పొడిగా ఉంచుతుంది, డైపర్ రాష్‌ను నివారిస్తుంది కాబట్టి, టాల్కమ్ పౌడర్ ను పుట్టిన శిశువుల‌కు వాడ‌తారు. కాని, ఈ పౌడర్‌ను ఉత్పత్తి చేసే గనులే ఆస్బెస్టాస్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే బీబీ పౌడ‌ర్ లో అస్బెస్టాస్ క‌లిసే అవ‌కాశాలు ఎక్కువ‌. అదే మొక్కజొన్న పిండితో బేబీ పౌడ‌ర్ త‌యారుచేస్తే? ఆస్బెస్టాస్ ప్రమాదం లేకుండా చూడొచ్చు. పిల్ల‌ల‌కు ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదురుకావ‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిపుణులు అంటున్నారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎదుర్కొంటున్న వ్యాజ్యాల వ‌ల్ల J&J ఆర్ధికంగా బాగా దెబ్బ‌తింది. ఇప్పుడున్న‌, భవిష్యత్ టాల్క్ క్లెయిమ్‌లను పరిష్కరించడానికి ఎర్పాటుచేసిన‌ యూనిట్ దివాలా తీయడంలో, భ‌విష్య‌త్తు కోర్టు కేసుల కోసం కంపెనీ $2 బిలియన్ డాల‌ర్ల‌ను ట్రస్ట్‌లో ఉంచింది.

టాల్క్ కేసుల్లో గత ఐదేళ్లలో $1 బిలియన్ కంటే ఎక్కువగా J&J లాయ‌ర్ ఫీజుల‌ను చెల్లించాల్సి వ‌చ్చింది. దీనికితోడు దేశాల‌ను బ‌ట్టి తీర్పులు మారుతుండ‌టం వ‌ల్ల వ్యాజ్యాల‌ను త‌ట్టుకోవ‌డం కంపెనీ వ‌ల్ల కావ‌డంలేదు.

J&J కంపెనీ దివాలా పిటీష‌న్ ప్రకారం, టాల్క్ కేసులను పరిష్కరించడానికే ఇప్పటివరకు సుమారు $3.5 బిలియన్ డాల‌ర్ల మేర సెటిల్‌మెంట్లు చెల్లించవలసి వచ్చింది. అంతెందుకు, సెయింట్ లూయిస్‌లోని స్టేట్ కోర్టు 2018లో ఇచ్చిన‌ జ్యూరీ తీర్పుతో 20 మంది త‌ల్లుల‌కు $2.5 బిలియన్ డాల‌ర్ల‌ను J&J చెల్లించవలసి వచ్చింది. అందుకే J&J వినియోగదారుల ఆరోగ్య వ్యాపారాన్ని ప్ర‌త్యేక‌ కంపెనీగా విభజించాలని చూస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి