iDreamPost

జోధ్​పూర్ యువకుడ్ని వర్చువల్​గా పెళ్లాడిన పాక్ యువతి.. మ్యారేజ్ జరిగింది.. కానీ!

  • Author singhj Published - 01:22 PM, Sun - 6 August 23
  • Author singhj Published - 01:22 PM, Sun - 6 August 23
జోధ్​పూర్ యువకుడ్ని వర్చువల్​గా పెళ్లాడిన పాక్ యువతి.. మ్యారేజ్ జరిగింది.. కానీ!

సీమా గులామ్ హైదర్.. ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు. ఆన్​లైన్ లవర్ కోసం ఏకంగా పాకిస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్​కు తన నలుగురు పిల్లల్ని వెంటేసుకొని మరీ వచ్చేసింది. ఆమె భారత్​లో అడుగుపెట్టినప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఇండియా వీసా కోసం ప్రయత్నించిన ఒక పాక్ యువతి.. రాజస్థాన్​కు చెందిన ఓ వ్యక్తిని వర్చువల్​గా వివాహం చేసుకుంది. జోధ్​పూర్​కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అర్బాజ్​ ఖాన్​కు.. కరాచీకి చెందిన అమీనా అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. అయితే వారి వివాహం భారత్​లో చేయాలని పెద్దలు నిర్ణయించారు.

ఇండియాకు రావాలంటే అవసరమైన వీసా కోసం అమీనా తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ ఆమెకు అనుమతి రాలేదు. దీంతో ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం బుధవారం వర్చువల్​గా వీళ్లకు నిఖా జరిపించారు పెద్దలు. ఈ విషయంపై అర్బాజ్ స్పందిస్తూ.. వీసా కోసం అమీనా దరఖాస్తు చేసుకుందని తెలిపాడు. తాను పాకిస్థాన్​కు వెళ్లి పెళ్లి చేసుకోలేనని, ఎందుకంటే దానికి గుర్తింపు ఉండదన్నాడు. ఆమె భారత్​కు వచ్చిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటానని అర్బాజ్ చెప్పుకొచ్చాడు. జోధ్​పూర్​లోని ఓస్వాల్ సమాజ్​ భవన్​కు సన్నిహితులు, బంధుమిత్రులతో కలసి చేరుకున్న అర్బాజ్.. అమీనాను వర్చువల్​గా నిఖా చేసుకున్నాడు.

అర్బాజ్ కుటుంబం అతడికి నిఖా చేయడమే గాక సంప్రదాయబద్ధంగా జరగాల్సిన అన్ని వేడుకలు జరిపింది. ఈ వివాహం జోధ్​పూర్ ఖాజీ ఆధ్వర్యంలో జరిగిందని తెలుస్తోంది. నూతన దంపతులను ఖాజీ ఆశీర్వదించారు. అమీనాతో నిఖా గురించి అర్బాజ్ ఖాన్ మాట్లాడుతూ.. తమది పెద్దలు కుదిర్చిన వివాహమని పేర్కొన్నాడు. పాక్​లోని తమ బంధువుల ద్వారా ఈ సంబంధం కుదిరిందని తెలిపాడు. తమ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఏర్పాట్లు చేశారన్నాడు. ఆన్​లైన్​లో పెళ్లి చేసుకోవడానికి భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండటం కారణమన్నాడు అర్బాజ్. అయితే వీళ్ల వివాహమైతే జరిగింది. కానీ వీసా రాకపోతే వధువు భారత్​కు రావడం కుదరదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి