iDreamPost

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన జేసీ సోదరులు…!

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన జేసీ సోదరులు…!

స్థానిక ఎన్నికల్లో పోటీచేయలేము ,కేసులు ఎదుర్కోలేము – జేసీ దివాకర్ రెడ్డి. 

ఆయనిచ్చిన పై స్టేట్మెంట్ మీద “ఇంత దారుణమైన” పరిస్థితులా ? జేసీ సోదరుల వంటి బలమైన నేతలే పోటీకి దూరంగా ఉంటే ఇంక అక్కడ ఎన్నికలు ఎలా జరుగుతాయో ఊహించుకోండి అంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

జేసీ సోదరులు బలమైన వాళ్ళే కానీ వారి బలమంతా అధికారంలో ఉన్నప్పుడే! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారపార్టీని ఎదిరించి పోరాడింది ఏనాడు లేదు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నోటికి, చేతికి అడ్డు అదుపు ఉండదు.. 2014లో తొలిసారి టీడీపీ తరుపున గెలిచిన తరువాత ఆర్ధికవనరుల కేంద్రీకరణ పెరిగింది.. సొంత వర్గంలో కూడా ఎవరు సంపాదించుకోకూడదు, మొత్తం తమకే చెందాలన్న ధోరణితో మూడు దశాబ్దాలుగా తమకు అండగా ఉన్న వర్గాన్ని కోల్పోయారు. గతంలో కొన్ని ఊళ్లలో ప్రత్యర్థి పార్టీ ఏజెంట్ కూడా కూర్చునేవాడు కాదు … మొన్నటి ఎన్నికల్లో పోలింగ్ నాడు నిలబడి ఓట్లు వేయించే అనుచరులు దూరం కావటంతోనే తాడిపత్రిలో కూడా ఓడిపోయారు.

జేసీ వర్గానికి దళ నాయకుడిలాగా వ్యవహరించిన భోగవతి నారాయణరెడ్డి ఎన్నికల ముందే జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయానికి తట్టుకోలేక వైసీపీ లో కి వెళ్ళాడు. పోలింగ్ రోజు నారాయణరెడ్డి కొడుకు నేరుగా దివాకర్ రెడ్డిని అడ్డుకోవటానికి ప్రయత్నం చేశాడు … గతంలో ఆ పోలింగ్ బూతులో 95% దివాక రెడ్డికి పడేవి,100% ఒకరికే పడితే రీ-పోలింగ్ జరుగుద్ది కాబట్టి 2-3 శాతం జేసీ అనుచరులే ప్రత్యర్థి పార్టీకి ఓటు వేసే వారు ..

మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కూడా జేసీ సోదరుల తీరులో మార్పు రాలేదు. మావాడు అంటూనే జగన్ను తిట్టడం, అధికారులతో దురుసుగా ప్రవర్తించటం కొనసాగించారు. ఒక కేసులో దివాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యి స్టేషన్ బెయిల్ తో బయటకి వచ్చాడు.

స్థానిక సంస్థల హడావుడి మొదలైన తరువాత తాడిపత్రి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయము, అధికారపార్టీ పెట్టే కేసులను ఎదుర్కోలేము అని దివాకర్ రెడ్డి ప్రకటించాడు.

దివాకర్ రెడ్డి ప్రకటనలో ఆశ్చర్యపోయే అంశం ఏమి లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయకపోవటం ఇదే మొదటిసారి కాదు. 1995 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున చైర్మన్ అభ్యర్థిగా ఎవరిని పోటీకి దించలేదు. నాడు పరిటాల రవి హవాలో జేసీ వర్గం టీడీపీని ఎదుర్కోవటానికి కూడా సిద్ధపడలేదు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ తరపున పేరం నాగిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అనంతపురం జిల్లాలో మిగిలిన మున్సిపాలిటీలలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు పోటీకి దిగారు. అందుకే అంటారు ప్రతిపక్షంలో ఉంటె జేసీ ప్రత్యర్థులతో ఢీ కొట్టడు అని .

నాడు రవి తాడిపత్రి మీదనే దృష్టి పెట్టటానికి ప్రధాన కారణం 1994 శాసనసభ ఎన్నికల్లో హిందూపూర్ నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్ మీద జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీచేయటమే! ఆ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి మీద ఎన్టీఆర్ సుమారు అరవై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు కానీ పరిటాల రవి ఇగో దెబ్బతినటంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పెట్టొద్దని హుకుం జారీచేశాడని ప్రచారం జరిగింది.

ఈ పేరం నాగిరెడ్డి 1989 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి మీద టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి దివాకర్ రెడ్డికి చెమటలు పట్టించాడు.ఆ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ,అనంతపురం జిల్లాలో కూడా మొత్తం 14 స్థానాలకుగాను కాంగ్రెస్ 12 స్థానాలు+ 2 లోక్ సభ స్థానాలు గెలుపొందింది కానీ దివాక రెడ్డి మాత్రం కేవలం 1200 ఓట్ల మెజారిటీతో బయటపడ్డాడు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరుపున హిందూపురం నుంచి ఎన్టీఆర్,ధర్మవరం నుంచి G.నాగి రెడ్డి మాత్రమే గెలిచారు.

టీడీపీని ఎదుర్కోవడంలో జేసీ సోదరులు గట్టిగా పనిచేయటంలేదన్నకారణంగా వైస్సార్ 1999-2004 మధ్య అనంతపురంలో రవిని నిలువరించే బాధ్యత నాటి ధర్మవరం శాసనసభ్యుడు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డికి(ప్రస్తుత ఎమ్మెల్యే వెంకట్ రామిరెడ్డి తండ్రి,తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్న) అప్పగించాడు. సూర్య ప్రతాప్ రెడ్డి జిల్లా మొత్తం పర్యటిస్తూ కాంగ్రెస్ క్యాడర్ కు అండగా నిలబడ్డాడు. 2004 ఎన్నికల నాటికి జేసీ దివాకర్ రెడ్డిని ఓడించటమే లక్ష్యంగా టీడీపీలో చేరి తాడిపత్రి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు, 2006లో ఫ్యాక్షన్ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు.

మొన్నటి ఎన్నికల్లో సూర్య ప్రతాప్ రెడ్డి తమ్ముడు పెద్దారెడ్డి తాడ్రిపత్రి నుంచి వైసీపీ తరువున పోటీచేసి జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి ని ఓడించి జేసీ సోదరులకు తొలి రాజకీయ ఓటమిని రుచి చూపించాడు. దివాకర్ రెడ్డి 1983లో స్వతంత్ర అభ్యర్థిగా ఓడిపోయాడు ,దాన్ని పెద్ద ఓటమిగా గుర్తించవలసిన అవసరం లేదు.ప్రధాన పత్రికలు ఓటమి ఎరుగని నేత అంటూ దివాకర్ రెడ్డి గురించి రాస్తూనే ఉన్నాయి .

ఈ చరిత్ర తెలిసిన వారికి ఇప్పుడు తాడిపత్రిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయం అని దివాకర్ రెడ్డి చెప్పటం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి