iDreamPost

కులాలను ఐక్యం చేసే రాజకీయమా..? కులం శాసించే రాజకీయమా..?

కులాలను ఐక్యం చేసే రాజకీయమా..? కులం శాసించే రాజకీయమా..?

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 27 శాతం ఉన్న కాపులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నంత కాలం వారికి శాసించే శక్తి ఉండదని, యాసించే పరిస్థితి ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ అభివర్ణించారు. కాపులు శాసించే స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. బ్రిటీషు కాలం నుంచే కాపులను విడగొట్టారని అన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో పవన్‌ కల్యాణ్‌ చెప్పిన మాటలకు, చేసిన ప్రసంగాలకు, ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలకు అసలు పొంతనే లేదు. కుల,మత ప్రస్తావన లేని రాజకీయం జనసేన లక్ష్యమని పవన్‌ అన్నారు. కులాలను ఐక్యం చేసే రాజకీయం చేస్తానన్నారు. వివిధ సామాజిక వర్గాలతో ఎన్నికల సమయంలో సమావేశాలు నిర్వహించి.. కులాలను ఐక్యం చేసే రాజకీయమే తాను చేస్తానని చెప్పారు. తన కులం గురించి మాట్లాడితే.. ముందు తాను రెల్లి కులస్తుడనని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇలా సాగిన జనసేనుడి ప్రయాణం ఇప్పుడు కొత్త దారిలో నడుస్తోంది. కులాలను ఐక్యం చేసే రాజకీయం నుంచి.. కులం శాసించే స్థాయి రావాలంటూ ఆయన ఉద్భోదిస్తున్నారు.

సామాజిక న్యాయం, కులమత ప్రస్తావనలేని రాజకీయం.. ఇలా ఏడు రకాల సిద్ధాంతాలతో పార్టీ పెట్టిన పవన్‌ కల్యాణ్‌ వాస్తవంలో ఆయా సిద్ధాంతాలకు భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారు. ప్రశ్నించడానికే రాజకీయ పార్టీ పెట్టానంటూ… 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. బీజేపీ, టీడీపీ కూటమికి మద్ధతు తెలిపి.. వారి హామీలకు నాది పూచి అన్నారు. హామీల అమలు, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి వెనుకేసుకొచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నాటి ప్రతిపక్ష వైసీపీని ప్రశ్నించడం మొదలుపెట్టారు. భవిష్యత్‌లోనూ మోదీ, చంద్రబాబుల నాయకత్వాన్ని బలపరుస్తానన్నారు. కట్‌ చేస్తే.. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీలను తీవ్రస్థాయిలో విభేధించారు. టీడీపీపై అవినీతి ఆరోపణలు చేశారు. అవకాశవాద రాజకీయాలు చేస్తోందంటూ బీజేపీని దుయ్యబట్టారు.

2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కమ్యూనిస్టు వాతావరణం ఉండేదని, వాస్తవానికి వామపక్షాలది, జనసేనది ఒకటే సిద్ధాతమంటూ కమ్యూనిస్టులను పొగడ్తలతో ముంచెత్తారు. బీఎస్పీ పొత్తు నేపథ్యంలో.. అంబేడ్కర్, కాన్షీరాం ఆలోచనలతో జనసేన పార్టీని స్థాపించానని చెప్పారు. ఎన్నికల్లో బీఎస్పీ, సీపీఎం, సీపీఐ పార్టీలతో కలసి పోటీ చేశారు. ఎన్నికల తంతు ముగియగానే బీఎస్పీ, సీపీఎం, సీపీఐ పార్టీలు పక్కకపోయాయి. సీన్‌లోకి బీజేపీ వచ్చింది.

కనుచూపు మేరలో ఎన్నికలు లేకపోయినా.. గడచిన ఎన్నికల్లో తనతో కలసి వచ్చిన మిత్రపక్షాలను పక్కనపెట్టిన పవన్‌ కల్యాణ్‌ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జనసేన, బీజేపీ భావజాలాలు ఒక్కటే, 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచి పని చేస్తామన్నారు. హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించి, నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత వెనక్కితగ్గారు. బీజేపీ నేతలతో మంతానాల తర్వాత జనసేన అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుని, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మేలు చేయాల్సిన రాజకీయంలోనూ, ఇతర పార్టీలతో పొత్తుల విషయంలోనూ, పార్టీ నేతలు, కార్యకర్తల రాజకీయ భవిష్యత్‌పైనా.. ఈ విధంగా రాజకీయాలు చేస్తున్న జనసేన అధినేత భవిష్యత్‌ పయనం ముందు ముందు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి