iDreamPost

అధ్యయనం – అధికారం – పరిష్కారం @ జగన్

అధ్యయనం – అధికారం – పరిష్కారం @ జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర పుటల్లో మైలురాళ్ళుగా నిలిచిపోయే ఘట్టాల్లో వై.యస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఒకటి. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఆ మహా సుదీర్ఘ పాదయాత్ర ముగిసి నేటికి సరిగ్గా ఏడాది. నాడు జగన్ పాదయాత్ర చేయడానికి దారి తీసిన పరిణామాలు, మహా పాదయాత్ర వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం, తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల జీవన విధానం ఎంత అధమస్థాయికి వెళ్ళి, వారు ఎలాంటి భాదలు పడుతున్నారో, తెలుగుదేశం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తమకి ఉన్న మీడియా బలంతో హామీలన్నీ పూర్తి చేశామని ప్రజలని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో, అలాగే రాబొయే రోజులలో ప్రజలు ఎలాంటి విధానాలతో కూడిన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారొ తెలుసుకుని, తనని తాను మలుచుకుంటూ ప్రజాభిష్టం మేరకు పార్టిలో కావల్సిన మార్పులు చేసి వై.సి.పి పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఆలొచనతో ఇడుపులపాయలో దివంగతనేత వై.యస్.ఆర్ సమాధి వద్ద 2017 నవంబర్ 6న మొదలు పెట్టిన పాదయాత్ర 2019 జనవరి 9న ఇచ్చాపురంలో ముగిసింది.

3,648 కిలోమీటర్లు, 341 రోజులు, 134 నియోజకవర్గాలు, 2,516 గ్రామాలు, 231 మండలాలు, 55 ఆత్మీయ సమ్మేళనాలు, 124 బహిరంగ సభలతో సాగిన ఆ పాదయాత్ర చూసేవారికి ఇది ప్రజా విప్లవమా అనేంతగా జన జాతరతో హోరెత్తింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో వై.యస్ జగన్ పాదయాత్ర విజయవంతమైన తీరు ఆనాడు రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. వై.యస్ జగన్ కి కంచుకోటగా ఉన్న రాయలసీమలొ జరిగిన పాదయాత్రలో ఏ విధంగా జనం జగన్ కి నీరాజనం పలికారో, అదే విధమైన స్పందన జగన్ కి గోదావరి జిల్లాల్లో కూడా లభించింది. 2014 ఎన్నికల్లో గోదావరి జిల్లాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో 19 స్థానాలు ఉంటే 14 స్థానాలలో తెలుగుదేశంకి పట్టం కట్టారు . పశ్చిమ గోదావరిలొ మొత్తం అన్ని స్థానాలు గంపగుత్తుగా తెలుగుదేశం ఖాతాలోకే వెళ్ళాయి. తెలుగుదేశానికి గంపగుత్తుగా ఓట్లు వేసిన అలాంటి ప్రదేశంలో కూడా జగన్ వెంట నడిచి వచ్చిన జన ప్రవాహంతో రాజమండ్రి వంతెన సైతం ఊగిపోయింది. టి.వి చానళ్లలో ఆ దృశ్యం చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఇటీవలకాలంలో ఆ స్థాయిలో ప్రజా ప్రదర్శన జరగలేదు. ఒక ఉప్పెనలా వచ్చారు జనం.

కుల మత వర్గం అనే భేదం లేకుండా సాగిన ఆ పాదయాత్రలో ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని తాను ప్రజలకు ఏమి చేయగలనో గుర్తించి నవరత్న పథకాలుగా మలిచి అవే మ్యానిఫెస్టో రూపంలో తీసుకువచ్చారు. ఎన్నికల నగరా మోగేనాటికే స్తబ్దుగా ఉన్న రాష్ట్ర ప్రజలను వై.సి.పి క్యాడర్ అనే తేనె తుట్టిని తన మహా పాదయాత్రతో కదిపి ఎన్నికల శంఖారావం పూరించారు. మొదటిసారి రెప్పపాటులో అధికారం దూరమైన గత ఎన్నికల్లో తెలుగుదేశం కంచు కోటలు బద్దలు కొట్టారు. రాజకీయ ఉద్దండులు అని చెప్పుకునే వారు సైతం జగన్ ఫ్యాన్ గాలిలో నిలవలేకపొయారు. ప్రత్యమ్నాయం అంటూ వచ్చిన జనసేన డిపాజిట్లు సాధించటానికే నోటా తో పోటీ పడవలసిన పరిస్థితి. తెలుగుదేశం ఎన్నడు చూడని పరాభవం మూట కట్టుకుంది. 175 స్థానాల్లో కేవలం 23 సీట్లకే పరిమితం అయింది. అలాగే జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడు ఎవరు సాధించలేనంత ఘన విజయం సాధించి దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు.

జగన్ చేసిన పాదయాత్ర ప్రజల్లో ఎంత బలమైన ముద్ర వేసింది అనేదానికి సజీవ సాక్ష్యం ఎన్నికల ఫలితాలు. జగన్ మొత్తం 134 నియోజక వర్గాల్లో పాదయాత్ర చేస్తే అందులో జగన్ 113 స్థానల్లో విజయ దుంధుబి మోగించారు.జగన్ పాదయాత్ర చేసిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన కలిపి కేవలం 21 స్థానాలకే పరిమితం అయింది. 2014 గెలిచిన సిట్టింగుల్లో వై.సి.పి ఉరవకొండ అద్దంకి తప్ప అన్ని స్థానాలు గెలుచుకోగలిగింది. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి నియోజక వర్గ అభివృద్ది పేరు చెప్పి వై.సి.పి పార్టీలో గెలిచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన 23మందిలో కేవలం ఒక్క అద్దంకినే మళ్ళీ తెలుగుదేశం గెలుచుకోగలిగింది. 22 మంది ఫిరాయింపుదారులను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారంటే ప్రజల్లో జగన్ పాదయాత్ర ఎంత ప్రభావితం చూపిందో అర్ధం చేసుకోవచ్చు.

తిరుగులేని ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చిన జగన్ సంక్షేమం అభివృద్దే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చెయలేనంత వేగంగా ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారు. గెలిచిన 7 నెలల్లోనే మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన వాటిలో 90% హామీలను నెరవేర్చారు. దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా విప్లవాత్మకమైన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింప చేశారు. మహిళల కోసం దిశా చట్టం,పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగాలు, తరతరాలుగా అణగద్రొక్కబడ్ద వర్గాలకు మహిళలకు 50% రిజర్వేషన్లతో చరిత్ర సృష్టించారు. రివర్స్ టెండరింగ్ తో దేశానికి దిక్సూచి అయ్యారు. చేనేతన్న కష్టం , ఆటో అన్న కన్నీళ్ళను 6 నెలల్లో తుడిచారు. ఆఖరికి పాదయాత్రకు ముగింపు పలికిన సరిగ్గా ఏడాదికి నేడు అమ్మ ఒడి అంటూ చెప్పిన మాట ప్రకారం బడికి పంపిన ప్రతి పిల్లవాడి తల్లి బ్యాంకు ఖాతాలోకి 15వేలు జమ చేశారు. అట్టడుగు వర్గాలకు అన్నగా , ఆపన్నులకి అండగా ప్రజా నాయకుడిగా పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి