iDreamPost

టీచర్ల బదిలీలకు జగన్ గ్రీన్ సిగ్నల్

టీచర్ల బదిలీలకు జగన్ గ్రీన్ సిగ్నల్

ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలపై స్పష్టత వచ్చింది. గత కొంతకాలంగా చాలామంది ఎదురుచూస్తున్న విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తాజాగా నాడు-నేడు కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జగన్ ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. జూలై 15 తర్వాత ఈ బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈసారి ఆన్ లైన్ లో నిర్వహించబోతున్నారు. ఆగష్ట్ 3 నుంచి తిరిగి బడులు తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జూలై మధ్యలో బదిలీల ప్రక్రియ ప్రారంభించి, వారం రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తుంది. దాంతో చాలాకాలంగా ఎదురుచూస్తున్న వారికి ఇదో శుభవార్తగా ఉపాధ్యాయులు చెబుతున్నారు.

విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని సీఎం ఆదేశించారు. ఏయే పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్న దానిపై మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. ఉపాధ్యాయుల బదిలీలు కూడా విద్యార్థుల అవసరాలే ప్రాతిపదికగా జరగాలన్నారు. 2017లో అనుసరించిన పద్దతులు కారణంగా 7,991 స్కూళ్లకు సింగిల్‌ టీచర్‌ను కేటాయించారని, వీటిలో చాలావరకు మూతబడ్డాయని సమావేశంలో ప్రస్తావనకు రావడంతో సీఎం స్పందించారు.

గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ స్కూళ్లను ఎలా నిర్వీర్యం చేయాలనేది ప్రధాన ఉద్దేశంగా ఉండేదని సీఎం వ్యాఖ్యానించారు. విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు ఎలా పంపాలన్న కోణంలో అప్పుడు నిర్ణయాలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. అక్టోబరు, నవంబరు నెలలు వచ్చినా యూనిఫారమ్స్, పుస్తకాలు ఇవ్వలేకపోయేవారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి పూర్తిగా తొలిగిపోయిందన్నారు. పిల్లలకు మంచిచేయాలనే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అందడానికి నిర్ణయాలు తీసుకోవడంలో విప్లవాత్మకంగా ఆలోచించాలంటూ అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్రంగా యాప్‌ రూపకల్పన చేయాలన్నారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్‌ సదుపాయం కూడా ఉండేలా చూడాలన్న ముఖ్యమంత్రి. ఈ అంశాల మీద అధికారులు దృష్టిపెట్టాలని, భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ఈ పద్ధతులు ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్ట పరిచేందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు ఉండడంతో ఏపీ లో ప్రభుత్వ బడులకు మహర్థశ వచ్చినట్టేననే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు మళ్లీ సర్కారీ స్కూళ్లలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలు వాటికి మరింత ఊపునిస్తాయని భావిస్తున్నారు. ఓవైపు విద్యార్థుల సంక్షేమం, మరోవైపు ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం వెదికే దిశలో జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. త్వరలోనే ఈ నిర్ణయాల ఫలితాలు ఆచరణ రూపం దాలిస్తే అనూహ్య పరిణామాలు చూడవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి