iDreamPost

సంక్షేమాంధ్రలో మరో నూతన పథకానికి ముహూర్తం ఖరారు

సంక్షేమాంధ్రలో మరో నూతన పథకానికి ముహూర్తం ఖరారు

సంక్షేమం, అభివృద్ధి జోడు చక్రాలు మాదిరిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పురోగతి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్న యువ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరో కొత్త పథకం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 6వ తేదీన ‘జగనన్న తోడు’పథకం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా అర్హులైన చిరు వ్యాపారులకు పది వేల రూపాయల రుణం పూచికత్తు, వడ్డీ లేకుండా జగన్‌ సర్కార్‌ అందించనుంది. ఇప్పటికే ఈ పథకానికి అర్హులైన వారి నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల్లో ఉండే వెల్ఫేర్‌ అసిస్టెంట్లు దరఖాస్తులు స్వీకరించారు. వారి అర్హతలు పరిశీలించారు.

దరఖాస్తు చేసుకున్న వారిలో రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు 9.08 లక్షల మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఇంకా అర్హులు ఉన్నా దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఉంది. సచివాలయాల్లో లేదా తమ వలంటీర్లను దరఖాస్తుదారులు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం 474 కోట్ల రూపాయలు వెచ్చింది. ఈ రుణాల మీద అయ్యే వడ్డీ మరో 52 కోట్ల రూపాయలను ప్రభుత్వం భరించనుంది. రుణాలు తీసుకున్న లబ్ధిదారులు సులభవాయిదాల్లో అసలు మొత్తాన్ని మాత్రమే తిరిగి బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది.

చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, సైకిళ్లు, రోడ్ల పక్కన వ్యాపారం చేసే వారు పెట్టుబడి సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరు తమ వ్యాపారం కోసం అయ్యే పెట్టుబడికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారి చిరు సంపాదనలో అధిక మొత్తం వడ్డీలకే పోతుంది. ప్రజా సంకల్ప పాదయాత్రలో వీరి ఇబ్బందులు చూసిన వైఎస్‌ జగన్‌.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పూచికత్తు లేకుండా చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని ఈ నెల 6వ తేదీన అమలు చేయబోతున్నారు. ఇప్పటికే వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా నగదును నేరుగా లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి