iDreamPost

ఆశావహ భవిష్యత్తువైపు..

ఆశావహ భవిష్యత్తువైపు..

2020 యేడాది ప్రజలను ట్వంట్వీ మ్యాచ్‌ అడేసింది. ఈ యేడాది మీకు బాగుంటుందని చెప్పిన రాశి ఫలితాలను కూడా అనుమానంతో చూసే విధంగా మార్చేసింది. కొత్త యేడాది ప్రారంభమయ్యాక రెండు నెలలు మినహా అన్ని రంగాల అభివృద్ది నేలచూపులనే చూస్తోంది. ఇది ఎన్నాళ్ళు అన్న ప్రశ్నలకు నిపుణులు కూడా ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేని పరిస్థితులున్నాయి. దీంతో కార్పొరేట్‌ కంపెనీల నుంచి సగటు జీవి వరకు తమకు తోచిన విధంగా ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు విశ్వప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనికి ప్రభుత్వం కూడా తోడ్పాటు నందిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో రంగం కోవిడ్‌ కల్పించిన విపత్కర పరిస్థితుల నుంచి బైటపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

దేశ ఆర్ధిక రంగంలో వ్యవసాయం, ఆటో మొబైల్, మౌలిక వసతులు, నిర్మాణ రంగం, ఫార్మ, ఇన్ఫర్మేషన్‌ రంగాలు అత్యంత కీలకమైనవిగా చెబుతారు. కరోనా విపత్కర స్థితి నుంచి వేగంగా బైటపడిన రంగాల్లో మొదటగా ఇన్ఫేర్మేషన్‌ టెక్నాలజీ రంగమేనని నిపుణులు తేల్చారు. త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన పలు ఐటీ సంస్థలు ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్టు ప్రకటించడం ఆ సంస్థలకు కరోనా కలిసొచ్చిందన్నదానికి సంకేతంగా చూపుతున్నారు. నిపుణుల అంచనాలకు తగ్గటే ఆయా సంస్థలు ఇప్పుడున్న క్లిష్టపరిస్థితుల్లోనూ అత్యుత్తమమైన ఫలితాలనే వెల్లడించాయి. దీంతో నెమ్మదిగా దేశ ఆర్ధికరంగం పట్టాలెక్కుతోందన్న ధీమాను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

మారటోరియం సమయంలో వడ్డీపై వడ్డీ భారాన్ని రుణగ్రహీతలకు ఉపసమనాన్ని కల్గించేందుకు కేంద్రం ప్రభుత్వం రూ. 5,600 కోట్ల మేర రాయితీని కల్పించింది. దీంతో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రములు, వాహన, హోం, వ్యక్తిగత రుణాలు తీసుకుని ఈయంఐలు చెల్లించేవారికి ఉపశమనం కలిగించినటై్టంది. రెండు కోట్లలోపు రుణాలు తీసుకున్నవారంతా సంబంధిత నిబంధనలకు లోబడి రాయితీని పొందేందుకు అర్హులంటూ ప్రకటించింది.

కాగా ఒక్క ఐటీ రంగాన్నే పరిగణనలోకి తీసుకుని ఆర్ధిక వ్యవస్థ మెరుగును అంచనావేయలేమన్న సంకేతాలు కూడా ఉన్నాయి. దేశంలో ప్రధానమైన వ్యవసాయ రంగం ఇంకా కోలుకునే పరిస్థితులు కన్పించడం లేదంటున్నారు. అలాగే మౌలిక వసతులు, ఆటో మొబైల్‌ తదితర రంగాలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి. వీటికి ప్రభుత్వాల తోడ్పాటు మరింత పెంచడం ద్వారా మాత్రమే మెరుగైన ఫలితాలను ఆశించవచ్చని వివరిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఉద్యోగ రంగంంలో ఆటో మేషన్‌ప్రభావం కూడా ఈ ఆర్ధిక సంవత్సరం తరువాత ప్రారంభమయ్యే సూచనలు బలంగానే కన్పిస్తున్నాయి. ఈ ఆటోమేషన్‌ ద్వారా కోల్పోయే ఉద్యోగాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రానున్న రోజుల్లో ఆర్ధిక వ్యవస్థ సామాన్యులకు ఇబ్బందులనే మిగల్చొచ్చన్న అంచనాలున్నాయి.

దేశంలో కొనుగోలుశక్తి తగ్గకుండా చర్యలు తీసుకోవడం మాత్రమే ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధిని కొనసాగించగలిగేందుకు అవకాశాలు మెరుగవుతాయని సంబంధిత నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇందుకు తగ్గ చర్యలను ప్రభుత్వాలు తీసుకుంటే వీలైనంత వేగంగానే ప్రస్తుత ఇబ్బందుల నుంచి బైటపడగలుగుతామని వివరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి