iDreamPost

అభినందించకపోయినా పర్వాలేదు..అవమానించొద్దు పవన్..

అభినందించకపోయినా పర్వాలేదు..అవమానించొద్దు పవన్..

చాలా రోజుల తరువాత బయటకొచ్చిన జనసేన అధినేత తన పాత ధోరణిలోనే ప్రభుత్వం మీద అర్థరహిత ఆరోపణలు చేశాడు.. ముఖ్యమంత్రి జగన్ కరోనాను సాధారణ జ్వరంలా భావించటం వలెనే కరోనా నియంత్రణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కరోనా కట్టడిలో పాలనా విభాగం విఫలమైందని , రాష్ట్రంలో ఆరోగ్యశాఖ పటిష్టంగా లేదాని.. ఇలా పలు వాఖ్యలు అనంతపురం పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యనించాడు.

పవన్ కళ్యాణ్ కు తెలుసుకునే ఓపిక,ఆసక్తి లేనట్లుంది కానీ గత నలభై రోజులుగా తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వివిధ విభాగాల అధికారులు, వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది.. అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో డాక్టర్లు, రెవెన్యూ అధికారులు వైరస్ బారిన పడ్డారు.

ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయితే అధికారులు రోడ్లపైకి వచ్చి కరోనా నియంత్రణ చర్యలు ముమ్మరంగా పాల్గొన్నారు. ఉదయం ఇంటి నుంచి బయటికి వస్తే రాత్రి ఇంటికి వెళ్లే లోపు మధ్యలో తిండి, నీళ్లు, అన్ని రోడ్లపైనే. రాత్రికి ఇంటికి వెళ్ళినా కన్నబిడ్డలను ప్రేమతో దగ్గరకు తీసుకోలేని పరిస్థితి. ఇతర పిల్లలు అందరూ తమ తండ్రితో ఆటలు ఆడుకుంటూ ఉంటే..పోలీసు, రెవెన్యూ, వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, అధికారుల పిల్లలు వారి తండ్రులతో ఆడుకోలేని పరిస్థితి. ఈ స్థితిని ఒకటి రెండు వాక్యాల్లో వర్ణించలేము.

వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు. ఈ విషయం కరోనా సాక్షిగా మరోమారు రుజువు అవుతోంది. కనిపించే దేవుళ్ళు వైద్యులు అంటూ కరోనా నుంచి కోలుకున్న బాధితులు.. వైద్యుల కాళ్లకు నమస్కారం చేస్తున్నారు. కరోనా పై పోరాటం చేస్తున్న వైద్యులు తమ ప్రాంతం, తమ అపార్ట్మెంట్ కు చెందినవారు కావడం పై చుట్టుపక్కల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విధులు ముగించుకొని వారు ఇళ్లకు చేరుకున్నప్పుడు చప్పట్లు, పూలతో హర్షధ్వానాలు ప్రకటించి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మండుటెండలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తూర్పుగోదావరి జిల్లా తుని లో 3500 జీతానికి స్వీపర్ గా పని చేసే లోక మణెమ్మ అనే ఓ 50 ఏళ్ల మహిళ తన జీతం లో నుంచి రెండు కూల్ డ్రింక్ బాటిల్ ను తీసుకువచ్చి పోలీసులు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు.

చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వైద్యులు పోలీసులు రెవెన్యూ ఇతర అధికారులు అందరికీ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నిన్న ఆదివారం త్రివిధ దళాలు కరోనా వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటళ్లు, వైద్యుల పై పూల వర్షం కురిపించాయి. వైద్యులకు సంఘీభావంగా దేశం నలుదిక్కుల నుంచి వాయుసేన విమానాలు చక్కర్లు కొట్టాయి. ఇలా దేశం యావత్తూ కరోనా పై పోరాటం చేస్తున్న వారికి సంఘీభావంగా నిలుచుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం వారిని అవమానించేలా మాట్లాడుతున్నారు. కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు వద్దంటూనే.. రాజకీయ విమర్శలు చేస్తుండటాన్ని ఏమనాలి..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి