iDreamPost

కనపడని శత్రువుతో పోరాటం.. ఇలాగేనా చేసేది ప్రధాని గారు..?!

కనపడని శత్రువుతో పోరాటం.. ఇలాగేనా చేసేది ప్రధాని గారు..?!

కరోనా వైరస్‌ చాపకింద నీరులా పాకుతోంది. నిన్న మొన్నటి వరకూ దాని ప్రభావం భారత్‌పై పెద్దగా లేదనుకున్న వారికి తాజాగా పెరిగిన కేసులు కరోనా వైరస్‌ ఎంత ప్రమాదకరమో తెలియజేస్తోంది. లాక్‌డౌన్‌ చేసి వైరస్‌ను కట్టడి చేశామని భావిస్తున్న పాలకులకు రెండు మూడు రోజుల్లో కరోనా కాటు కళ్లు తెరిపిస్తుందని ప్రజలు భావించారు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెడతారని ఆశించారు. కానీ దేశ పాలకుడు నరేంద్ర మోదీ తన నుంచి మాటలు తప్పా చేతలు ఆశించవద్దని మరో సారి చాటి చెప్పారు.

మీ అదృష్టం బాగుంటే బతకండి.. లేదంటే చావండి. 130 కోట్ల జనాభాలో ఎంత మంది పోతేనేమి..? వచ్చే నష్టం ఏముంది..? దేశంలో మనిషి ప్రాణానికి విలువేముంది..? ఓ వైపు కరోనా కరాళనృత్యం చేస్తుంటే.. చప్పట్లు కొట్టండి, గంటలు మోగించండి, కొవ్వొత్తులు వెలిగించండి.. ఇదా ప్రధాని మోదీ నుంచి ప్రజలు ఆశించేంది..? దేశ ప్రజలు ఏకతాటిపై ఉన్నారని, లాక్‌డౌన్‌ లాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వానికి మద్ధతుగా ఉన్నారని ఒక సారి చెబితే సరిపోదా..? మళ్లీ మళ్లీ ఐక్యతను చాటుకోవాలా..?

ఈ నెల 22వ తేదీన కరోనాను జయించేందుకు ప్రజలందరూ ఏకతాటిపైకి రావాలంటూ జనతా కర్ఫ్యూను విధించారు. ప్రజలు తూ చా తప్పకుండా ప్రధాని మోదీ మాటను పాటించారు. ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు అందరూ ఇళ్ల బయటకు వచ్చి డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుధ్య, పోలీసు సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు కొట్టాలన్నారు. ప్రజలందూ చప్పట్లే కాదు గంటలు మోగించి తమ మద్ధతును తెలియజేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రకటనే మోదీ చేశారు. ఈ నెల 5వ తేదీన ఆదివారం ప్రజలందరూ రాత్రి 9 గంటలకు లైట్లన్నీ ఆర్పేసి దీపాలు, కొవ్వొత్తులు వెలగించి కరోనా చీకట్లను పారద్రోలాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులు, సిబ్బందికి సంఘీభావం తెలపాలన్నారు.

ఓ పక్క అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లాడ్‌ వంటి దేశాలు కరోనా వైరస్‌ కారణంగా వణికిపోతున్నాయి. శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ప్రజల అదృష్టం బాగుండి కరోనా వైరస్‌ దేశంలో పెద్దగా వ్యాపించలేదు. ఆయా దేశాల్లోలాగా భారత్‌లో కూడా వైరస్‌ ప్రభావం చూపితే మన పరిస్థితి ఏమిటి..? దాని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలా సన్నద్ధమైంది..? మన వద్ద ఉన్న వెంటిలేటర్లు లక్ష.. ఆ లక్షతో ఎంత మంది ప్రాణాలను కాపాడగలరు..? డాక్టర్లు, వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు అసలు ఉన్నాయా..? ఉన్న సామాగ్రి నాణ్యత ఎంత..? ఇవేమీ పట్టించుకోకుండా.. దీపాలు వెలిగించండి.. కరోనా చీకట్లను పారద్రోలండీ.. అంటూ ప్రజల ఆలోచనను మన డొల్లతనం నుంచి పక్కకు తప్పించేందుకు ప్రధాని మోదీ చేస్తున్న మాటల గారడీ పని చేయదు. ఆ మాటలతో కనపడని శత్రువుతో పోరాటం చేయలేమనే విషయం పాలకులకు తెలియంది కాదు.

లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ తప్పక చేయాల్సిందే. అందుకు తగిన సన్నద్ధత ఉందా..? లాక్‌డౌన్‌ కారణంగా తలెత్తే సమస్యలు ఏమిటి..? వాటిని ఎదుర్కొనేందుకు రచించిన ప్రణాళిక ఏమిటి..? లాక్‌డౌన్‌ చేయడమే మా పని ఆ తర్వాత ఎవరి చావు వారు చావండి అనేలా బాధ్యతారాహిత్యంగా పాలకులు ఉన్నారని వలస కూలీలు పడుతున్న పాట్లు చెబుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ బలం కొంత మంది కార్పొరేటర్‌ శక్తుల చేతుల్లోనే ఉంది కానీ 90 శాతమున్న పేద, మద్య తరగతి ప్రజలు పని చేయనిదే పూటగడవని స్థితిలో ఉన్నారు. మరి ఇలాంటి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ప్రజలకు అండగా ఉండేందుకు ఏమి చేశారు..?

1.70 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన చర్యలు చేపడుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశ జనాభాతో ఆ మొత్తాన్ని భాగిస్తే… ఒక్కొక్కరికి వచ్చే మొత్తం 115 రూపాయలు. ఈ మొత్తంతో ప్రజలు కడుపు నింపగలరా..? జన్‌ధన్‌ ఖాతాల్లో 500 రూపాయలు వేస్తామన్నారు. ఆ ఖాతాలు ఉన్న వారే పేదలా..? మోదీ ప్రభుత్వం వచ్చాక తెచ్చిన పథకం జన్‌థన్‌ యోజన. మరి అంతకు ముందు బ్యాంకు ఖాతాలు ఉన్న వారు పేదలు కారా..? వారికి సహాయం అవసరం లేదా..? అంబానీలకు, ఆధానీలకు ప్రతి ఏడాది ఇచ్చే రాయితీల విలువెంత..?

ఉజ్వల పథకం కూడా మోదీ కరవాలం నుంచి జాలువారిని పథకమే. ఆ పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకున్న వారికే సిలండర్లు ఉచితమంటే.. మరి అంతకు ముందు పేద, మధ్య తరగతి ప్రజలెవరికీ గ్యాస్‌ కనెక్షన్లు లేవని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందా..? రుణాలు తీసుకున్న వారు మూడు నెలల వరకూ వాయిదాలు కట్టాల్సిన అవసరంలేదని గొప్పగా ప్రకటించారు. కానీ బ్యాంకులు వాయిదా చెల్లించాలని సందేశాలు పంపతున్నాయి. ఇదేమంటే.. మాకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదంటున్నాయి. మాటలు చెబితే చాలు.. కడుపు నిండుతుందనే భావనలో ప్రధాని ఉన్నట్లున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి అహర్నిశలు శ్రమిస్తూనే.. మరో వైపు తమ ప్రజలు ఆకలితో అలమటించకుండా కొద్దో గొప్పో ఉపశమన చర్యలు చేపడుతున్నాయి. వారికి కేంద్రం ప్రభుత్వం ఇచ్చే చేయూత ఏమిటి..? సీఎంలతో సమీక్షలు, సందేశాలు, సూచనలు వరకే ప్రధాని మోదీ పరిమితమైతే సరిపోతుందా..? యుద్దం చేయండని చెబితే చాలా..? యుద్ధం చేసేందుకు ఆయుధాలు, శక్తి ఇవ్వాల్సిన అవసరం లేదా..?

లాక్‌డౌన్‌ తర్వాత కరోనా వైరస్‌ పోతుందని ప్రధాని భావిస్తున్నట్లుగా ఉంది. ఆయన భావన నిజమైతే బాగుటుంది. కానీ వాస్తవం ఏమిటి..? ఏప్రిల్‌ 14 తర్వాత కరోనా వైరస్‌ భారత్‌లో నశిస్తుందా..? అంటే ఎవరూ చెప్పలేని ప్రశ్న అది. దాదాపు ఆరు నెలలైనా చైనా ఇప్పటికీ ఆ మహమ్మరిపై పోరాడుతోంది. ఇవన్నీ చూసైనా.. రాబోయే రోజుల్లో కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి ఒక కరోనా ఆస్పత్రి నిర్మాణం చేపట్టడం ఎంతో అవసరం. 27 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి దేశ వ్యాప్తంగా రాష్ట్రానికి ఒక ఆస్పత్రిని నిర్మించే శక్తి లేదా..? పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్న చందంగా ఆర్థిక వ్యవస్థ గురించి గొప్పులు చెప్పుకోవడానికి ముందు ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి. నేల విడిచి సాము ఎళ్లకాలం చేయలేము. కరోనా లాంటివి మళ్లీ మళ్లీ వచ్చి మనలోని డొల్లతనాన్ని చాటి చెబుతాయని పాలకులు ఇప్పటికైనా గుర్తెరగాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి