iDreamPost

లాక్ డౌన్ సహాయం అపాయం కాబోతోందా..?

లాక్ డౌన్ సహాయం అపాయం కాబోతోందా..?

తాను ఒకటి తలిస్తే దైవమొకటి తలిసినట్లుగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. లాక్ డౌన్ వల్ల ఇళ్ల కే పరిమితమైన పేదలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తోచిన విధంగా సహాయాన్ని అందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో మనిషికి 12 కిలోల బియ్యం, కార్డుదారులకు 1500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తోంది. ఇప్పటికే రేషన్ డిపోల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేయగా.. తాజాగా రెండు రోజుల క్రితం తెల్ల రేషన్ కార్డుదారులకు వారి బ్యాంకు ఖాతాల్లో 1500 రూపాయలు జమ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులు ఉండగా, వారిలో బ్యాంక్ ఖాతా ఉన్న 74 లక్షల కుటుంబాలకు 1500 రూపాయలు జమ చేసింది. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ఆర్థిక సహాయం పెనుముప్పుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వం తమ ఖాతాలో జమ చేసిన 1500 రూపాయలు తీసుకునేందుకు తెల్ల రేషన్ కార్డు దారులు బ్యాంకులకు పోటెత్తారు. రెండు రోజుల నుంచి తెలంగాణలోని ప్రతి బ్యాంకు వద్ద వందల సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా బ్యాంకుల వద్ద భారీ క్యూ లు వెలిశాయి. పలుచోట్ల తోపులాటలు జరుగుతున్నాయి. ప్రజలను అదుపు చేసేందుకు, భౌతిక దూరం పాటించేలా చేసేందుకు పోలీసులు తంటాలు పడుతున్నారు. లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు తాజాగా బ్యాంకుల వద్ద డ్యూటీలు అదనపు భారం అయ్యాయి. బ్యాంకుల వద్ద భారీ క్యూ లో ఉండడంతో అసలు లాక్ డౌన్ లక్ష్యమే నీరుగారి పోతోంది. బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటించకున్నా.. మాస్కులు ధరించకున్నా.. 500 రూపాయల జరిమానా విధిస్తామంటూ తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు జారీ చేసిన హెచ్చరికలను ప్రజలు భేఖాతార్ చేస్తున్నారు.

ఎండలు ఠారెత్తిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల వద్ద క్యూలో నిలుచున్న మహిళలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు, పలుచోట్ల ఎండదెబ్బకు సొమ్మసిల్లి పడి పోతున్నారు పలు బ్యాంకుల వద్ద token system అమలు చేస్తున్న, అది ఏమాత్రం ఫలితం ఇవ్వడం లేదు. ప్రజలు ఉదయం నుంచే బ్యాంకుల వద్ద బారులుతీరి ఉంటున్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే ప్రాణాలు కోల్పోయింది.

ఆపద సమయంలో పేద ప్రజలను ఆదుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం బాగున్నా.. ఆర్థిక సహాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న వాలంటరీ వ్యవస్థ తెలంగాణకు లేకపోవడం ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో భారీ నష్టాన్ని తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో 1.30 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం అందించిన వేయి రూపాయల సహాయాన్ని.. వాలంటీర్ల ఒక్క రోజులో లబ్ధిదారులకు అందించడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి