iDreamPost

చైనా వస్తువుల బ్యాన్‌ సాధ్యమేనా..?

చైనా వస్తువుల బ్యాన్‌ సాధ్యమేనా..?

భారత్‌–చైనా బోర్డర్‌లో జరిగిన ఘటన కారణంగా భారత సైనికులు పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో చైనాకు వ్యతిరేకంగా భారత్‌లో నిరసనలు మిన్నంటాయి. మృతి చెందిన సైనికులకు నివాళులర్పిస్తూ.. చైనా బ్యాన్‌ నినాదాలు చోటు చేసుకున్నాయి. ఉద్వేగభరితమైన పరిస్థితుల్లో ఇటువంటి నినాదాలు దేశం మొత్తాన్ని ఊపేస్తాయనడంలో సందేహం లేదు. భారతదేశ పౌరిడిగా దీనిని ఫాలో కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఇది కాదనలేని నిజం. ఇంత వరకు బానే ఉంది. కానీ చైనాను బ్యాన్‌ చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్నకు సమాధానం ఏ కొంచెం ఆలోచన ఉన్నా ఠక్కున చెప్పడం కష్టమే. దేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాల కారణంగా ఏర్పడే పరిస్థితులను గురించి ఇక్కడ చర్చించ దల్చుకోలేదు. కానీ వ్యక్తి స్థాయిలో చైనా వస్తువులను వాడకుండా వ్యక్తిగత నియంత్రణ పాటించడం గురించే ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను.

ప్రధాన మంత్రి పర్యవేక్షణలో యోగా దినోత్సవాలను మనం జరుపుకుంటుంటే ఆ యోగా చేసేందుకు ఉపయోగించే మ్యాట్‌లను తయారు చేసి మన దేశంలో ఏర్పడ్డ డిమాండ్‌ను వ్యాపారంగా మలుచుకునే పనుల్లో చైనా బిజీ అయ్యింది. అంతెందుకు వడ్రంగులు వాడే స్క్రూలు మొదలుకుని, సామాన్యులు వేసుకునే చెప్పులు, చిన్నారులు ఆడుకునే బొమ్మలతో సహా దాదాపు భారతీయలు వాడే 80శాతం వస్తువులను చైనా ఉత్పత్తి చేస్తుందంటే ఆశ్చర్యం కలగకమానదు. వీటిలో కొన్నిటికి చైనా స్క్రూలు, చైనా మాట్‌లు, చైనా బొమ్మలు, చైనా టపాసులు.. అంటూ నేరుగా చైనా పేరుతోనే మార్కెట్‌లో దొరుకుతున్నాయి. కారణాలు ఏమైనా ఇక్కడి ప్రజలకుండే అవసరాలను వ్యాపారంగా మల్చుకునేందుకు చైనా ఎప్పుడు సిద్ధంగానే ఉంది.

ఒకప్పుడు మన దేశంలో తయారయ్యే వస్తువులను మరమ్మత్తులు చేసుకుంటే వాటిని తిరిగి కొన్నేళ్ళపాటు వినియోగించుకునేవారు. కానీ ఎప్పుడైతే చైనా వస్తువులు మనదేశంలోకి రావడం మొదలయ్యాయో ‘యూజ్‌ అండ్‌ త్రో’ విధానానికి అలవాటు పడ్డాము. ఈ అలవాటు కారణంగా ఏర్పడే వేస్ట్‌ మెటీరియల్‌ను ఏం చెయ్యాలో అర్ధం కాక తలలు పట్టుకునే పరిస్థితిని తెచ్చుకున్నాయి.

ఇక్కడ చెప్పేదేంటంటే జంబో జెట్‌లను తయారు చేయాల్సిన అవసరం లేదు. కానీ చైనాకు ధీటుగా కనీసం నట్టులు, బోల్టులు అయినా తయారు చేయగలిగేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? అన్నదే ప్రధాన ప్రశ్న. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియాలకు కూడా తేడాను వినియోగదారులకు అర్ధం కాని విధంగా ఆయా బ్రాండ్‌లను ఇతర దేశాలు మనపై రుద్దుతున్నాయి. ఇక్కడ చిత్తశుద్ధి కావాల్సింది ప్రభుత్వాలకు. మన దేశంలో వస్తువులు అమ్మడం ద్వారా ఆదాయాలు సమకూర్చుని, ఆ ఆదాయంతో మనపైనే యుద్దం చేస్తున్న దేశాల పట్ల ఏవిధంగా వ్యవహరించాలన్నదానిపై స్పష్టమైన వైఖరిని ప్రత్యక్షంగానే ప్రకటించాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతైనా ఉంది. లేదంటే ప్రజలకు ఇప్పుడొచ్చిన ఆవేశం సోషల్‌మీడియాలో మెస్సేజ్‌లు పెట్టడంతోనే చల్లారిపోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి