iDreamPost

పవన్ ని పావుగా చేసుకుని బీజేపీని బ్లాక్ మెయిల్ చేసే పనిలో బాబు

పవన్ ని పావుగా చేసుకుని బీజేపీని బ్లాక్ మెయిల్ చేసే పనిలో బాబు

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ బలం కారణంగా టీడీపీ తల్లడిల్లిపోతోంది. వైఎస్సార్సీపీని ఎదుర్కోవడం ఒంటరిగా సాధ్యంకాదని నిర్ణయించుకుంది. అందుకే మిత్రపక్షాల కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే జనసేన తమపట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ బీజేపీ మీద గంపెడాశతో చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అధికారం కోల్పోయి మూడేళ్ల తర్వాత కూడా ఆ లక్ష్యాలు నెరవేరడం లేదు. ఇప్పటికే అనేక యత్నాలు చేసి చంద్రబాబు అలసిపోయినట్టు కనిపిస్తోంది. బీజేపీ అండదండల కోసం గట్టిగా ఆశలు పెట్టుకుంటే అసలు ఆయనకు తలుపులే మూసేశామని హస్తిన బీజేపీ పెద్దలు చెబుతుండడం ఆయనలో అసహనాన్ని పెంచుతోంది.

ఇప్పుడు చంద్రబాబు తనదైన రీతిలో వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా బీజేపీతో కలిసి ఉన్న సమయంలో మోడీ నాయకత్వాన్ని ప్రశంసించి, బంధం వీడిపోగానే మోడీని వ్యక్తిగతంగానూ దూషించిన నైజం ఆయనది. అదే సమయంలో పలు రాష్ట్రాల్లో మోడీ వ్యతిరేకులకు అండగా నిలిచి ఎగదోసిన చరిత్ర కూడా చంద్రబాబుకి ఉంది. గోద్రా అల్లర్ల నుంచి అన్ని సందర్భాల్లోనూ మోడీని వ్యతిరేకించేందుకు చంద్రబాబు ప్రయత్నించడం, ఆ తర్వాత అవసరార్థం మళ్లీ మోడీని కొనియాడడం చంద్రబాబుకే చెల్లిందన్నది బీజేపీ నేతలు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇటీవల చివరకు అండమాన్ లో బీజేపీకి చైర్మన్ సీటు విషయంలో టీడీపీ మద్ధతు ఇచ్చినా కమలనాధులు కనికరించడం లేదు.

తాజాగా పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ వ్యవహారం చూస్తుంటే బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చేయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని శపథం చేసిన పవన్ కళ్యాణ్ బీజేపీ నేతల రోడ్డు మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పడం ద్వారా తనతో పాటుగా చంద్రబాబు చెంతకు బీజేపీ ని తోడ్కొనిపోవాలనే లక్ష్యం ఉన్నట్టు చాటుతున్నారు. ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగమేనని బీజేపీ భావించేందుకు ఆస్కారమిస్తున్నారు. బాబు బ్లాక్ మెయిల్ రాజకీయాల్లో భాగంగా బీజేపీ మిత్రపక్షాన్నే వారి మీద ఎగదోసేయత్నంలో ఉన్నారనే అభిప్రాయం పవన్ తీరు మూలంగా కలుగుతోంది. దానికి తగ్గట్టుగానే బీజేపీ కూడా స్పందించింది. తమకు రెండు నెలల క్రితమే రోడ్ మ్యాప్ వచ్చిందంటూ సోము వీర్రాజు కౌంటర్ అందులో భాగమేనని చెప్పాల్సి ఉంటుంది.

బీజేపీతో బంధం కొనసాగిస్తూ టీడీపీ మీద మనసు పారేసుకున్న పవన్ వైఖరికి చంద్రబాబు కారణమని కమలనాథుల అనుమానం. దానికి తగ్గట్టుగా బాబు వ్యూహాలకు విరుగుడు కనిపెట్టేయత్నంలో రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు బీజేపీ తన అవకాశాలను కాలదన్నుకుని టీడీపీని బలపరిచింది. చివరకు భంగపడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మరోసారి టీడీపీ కొమ్ముకాసి చరిత్ర పునరావృతం చేసేందుకు కమలదళం సిద్ధంగా కనిపించడం లేదు. దాంతో ఈ వ్యవహారంలో బాబు, బీజేపీ మధ్య పవన పాత్ర చివరకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి