iDreamPost

రద్దు దిశగా మరో మెగా క్రికెట్ టోర్నీ

రద్దు దిశగా మరో మెగా క్రికెట్ టోర్నీ

ఐపీఎల్‌ 2020 సీజన్‌ రద్దు కాబోతుందా? అంటే అవునని సమాధానం ఇస్తున్నాయి బీసీసీఐ వర్గాలు… పదమూడోవ ఐపీఎల్ సీజన్ రద్దును అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు అధికారులు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 టోర్నీ ఏప్రిల్ 15వ తేదీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి వాయిదా వేసింది.ఆ సమయానికి కూడా దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు.దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో టోర్నీని రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించిందని వార్తలు వెలువడుతున్నాయి.

మంగళవారం ఐపీఎల్ నిర్వహణకు కార్యాచరణ రూపొందించేందుకు టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్లు బిసిసిఐ యాజమాన్యాలకు తెలిపింది.అయితే వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభానికి కొన్ని క్షణాల ముందు రద్దు చేస్తున్నట్లు ఫ్రాంఛైజీలకి బీసీసీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. భారత్‌లో మంగళవారం మధ్యాహ్నానికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 523‌కి చేరుకుంది.దీంతో ఈ ఏడాదికి ఐపీఎల్ నిర్వహణ సాధ్యపడకపోవచ్చునని ఫ్రాంఛైజీ ప్రతినిధులు తేల్చేశారు.

ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక,ఢిల్లీలలోకరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.మరోవైపు కేంద్ర ప్రభుత్వం పర్యాటక వీసాలను ఏప్రిల్ 15 వరకూ రద్దు చేసింది. దీంతో విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ ఆడేందుకు అప్పటిలోపు భారత్‌కి వచ్చే అవకాశం లేదు.ఈ పరిస్థితులలో విదేశీ ఆటగాళ్లు లేకుండా 45 రోజుల ఐపీఎల్ షెడ్యూల్ ను 22 రోజులకు కుదించటం వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా బీసీసీఐ చర్చించింది. కానీ దానికంటే ఐపీఎల్‌ని రద్దు చేయడం మేలని బీసీసీఐ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి