iDreamPost

ఇండియన్ ఐడల్ విజేత

ఇండియన్ ఐడల్ విజేత

భటిండా నగరానికి చెందిన సన్నీ హిందూస్థానీ ఇండియన్ ఐడల్ 11 విజేతగా నిలిచారు. గ్రాండ్ ఫినాలేలో నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాటలు పాడిన సన్నీ న్యాయ నిర్ణేతల స్కోర్ తో పాటు ప్రేక్షకులు ఇచ్చిన ఓటింగ్ ఆధారంగా ఇండియన్ ఐడల్ విన్నర్ గా నిలిచారు.

ఫైనల్ లో గెలిచిన సన్నీ హిందూస్థానీ ట్రోఫీతో పాటు రూ .25 లక్షల ప్రైజ్ మనీ, కారు, టీ-సిరీస్‌ సంస్థలో పాడే కాంట్రాక్టు గెలుపొందారు. ఇండియన్ ఐడల్ ఫినాలేలో మొదటి మరియు రెండవ రన్నరప్ గా నిలిచిన రోహిత్ రౌత్, అంకోనా ముఖర్జీలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు లభించాయి. నాలుగు మరియు ఐదు స్థానాల్లో నిలిచిన రిథమ్ కళ్యాణ్,అడ్రిజ్ ఘోష్ లకు రూ .3 లక్షలను బహుమతిగా పొందారు. ప్రతి ఫైనలిస్ట్‌కు లోటస్ హెర్బల్స్ నుంచి లక్ష రూపాయల చెక్కు, స్పాన్సర్ల నుంచి గిఫ్ట్ హాంపర్లు కూడా ఇచ్చారు.

విజేతగా నిలిచిన సన్నీ హిందుస్థానీ మాట్లాడుతూ తాను మొదటి రౌండ్ లోనే వెనుదిరుగుతానని అనుకున్నానని కానీ చివరకు విజేతగా నిలిచానని గొప్ప న్యాయ నిర్ణేతల ఎదుట గొప్ప వేదికపై అవార్డును గెలుపొందడం చూస్తుంటే కలలు నిజమయ్యాయనిపిస్తుందని తెలిపారు. న్యాయనిర్ణేతలు సోనీ ఛానెల్ కు ధన్యవాదాలు తెలిపిన సన్నీ హిందుస్తానీ దేశం మొత్తం తన గొంతుకు ఓటు వేసి గెలిపించిందంటే నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.

కాగా ఫినాలేలో సన్నీ హిందుస్తానీ పాడిన పాటకు మంత్రముగ్ధుడైన ఇండియన్ ఐడల్ జడ్జి అనుమాలిక్ వేదికపై లేచి నిలబడి అభినందించారు. నుస్రత్ ఫతే అలీఖాన్ స్వయంగా ఇండియన్ ఐడల్ వేదికపై ప్రదర్శన ఇస్తున్నట్లు తనకు అనిపించిందని అనుమాలిక్ వ్యాఖ్యానించారు. ఇండియన్ ఐడల్ విజేత గురించి ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సన్నీ ఆడిషన్ వీడియో వైరల్ అయింది. మెలోడీ పాటలతో అలరించిన సన్నీ హిందుస్తానీ అవార్డును గెలుపొందారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి