iDreamPost

సూపర్ విక్టరీ.. ఆసియా హాకీ ఛాంపియన్ గా భారత్!

సూపర్ విక్టరీ.. ఆసియా హాకీ ఛాంపియన్ గా భారత్!

హాకీ చరిత్రలో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ఈ అద్భుత విజయంతో భారత హాకీ జట్టు ఆసియా హాకీ ఛాంపియన్ గా నిలిచింది. ఆసియా హాకీ ఛాంపియన్ షిప్ లో ఇప్పటివరకు ఐదుసార్లు ఫైనల్ చేరిన భారత్.. 4 సార్లు ఛాంపియన్స్ గా నిలవడం విశేషం. ఒకానొక సమయంలో ఓటమి తప్పదు అని అభిమానులు నిరాశ పడే స్థాయి నుంచి ఛాంపియన్లుగా నిలిచే వరకు ఈ ఫైనల్ సాగింది. ప్రతి క్షణం నరాలు తెగే ఉత్మంఠతో ఈ మ్యాచ్ జరిగింది. చివరకు 4-3 తేడాతో భారత హాకీ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

శనివారం మలేసియాపై జరిగిన ఆసియా ఛాంపియన్స్ హాకీ ఫైనల్స్ లో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆట తొలి క్వార్టర్లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని నమోదు చేసింది. 9వ నిమిషంలో జుగ్ రాజ్ సింగ్ తొలి గోల్ సాధించాడు. కానీ, మొదటి క్వార్టర్ చివరి క్షణాల్లో అబు కమల్ స్కోరును సమం చేశాడు. రెండో క్వార్టర్లో మలేసియా దూకుడు పెంచడంతో భారత్ డిఫెన్స్ లో పడిపోయింది. మలేసియా కేవలం 10 నిమిషాల్లో రెండు గోల్స్ చేసింది. దాంతో భారత జట్టు 1-3 తేడాతో వెనుకంజలో పడిపోయింది. మూడో క్వార్టర్ లో రెండు జట్లు గోల్స్ కోసం చాలానే శ్రమించాయి.

ఇక్కడే భారత అభిమానులు అందరూ ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చారు. అందరిలో ఆశలు గల్లంతు అయ్యాయి. కానీ, భారత్ జట్టులో మాత్రం ఆత్మవిశ్వాసం ఏమాత్రం సన్నగిల్లలేదు. అదే పట్టుదలతో ముందుకు వెళ్లారు. 45వ నిమిషం వరకు కూడా 1-3 తేడాతో ఉన్న భారత్ ఆ తర్వాత అద్భుతం చేసింది. 45వ నిమిషంలో భారత్ ఆటగాళ్లు వెంట వెంటనే రెండు గోల్స్ చేశారు. దాంతో స్కోర్ బోర్డు సమం అయింది. 56వ నిమిషంలో మరో గోల్ చేయడంతో భారత్ లీడ్ లోకి వెళ్లింది. ఆ తర్వాత అదే లీడ్ ని కాపాడుకుంటూ భారత హాకీ జట్టు ఆసియా ఛాంపియన్లుగా నిలిచారు.

గోల్స్ ఇలా సాగాయి:

భారత జట్టు తరఫున జుగ్ రాజ్ సింగ్(9వ నిమిషం), హర్మన్ ప్రీత్ సింగ్(45వ నిమిషం), గుర్జంత్ సింగ్(45వ నిమిషం), ఆకాశ్ దీప్ సింగ్ (56వ నిమిషం) తలా ఒక గోల్ చేశారు. మలేసియా జట్టు తరఫున అబు కమల్ (14వ నిమిషం), రహీమ్ రజీ(18వ నిమిషం), అమినుద్దీన్(28వ నిమిషం) తలా ఒక గోల్ చేశారు. ఆ తర్వాత మలేసియా గోల్ చేసేందుకు ఎంత శ్రమించినా.. భారత్ డిఫెన్స్ వల్ల అది సాధ్యంకాలేదు. మొత్తానికి 4-3 తేడాతో భారత్ సూపర్ విక్టరీని నమోదు చేసింది. ఫైనల్ చేరిన 5 సార్లలో నాలుగు సార్లు ఛాంపియన్లుగా నిలిచి చరిత్ర సృష్టించింది. మ్యాచ్ అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేతులమీదుగా భారత జట్టు ట్రోఫీని అందుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి