iDreamPost

World Cup: రోహిత్‌ మాస్‌ బ్యాటింగ్‌! పాక్‌పై సంప్రదాయం కొనసాగింపు..

  • Published Oct 14, 2023 | 8:15 PMUpdated Oct 14, 2023 | 8:15 PM
  • Published Oct 14, 2023 | 8:15 PMUpdated Oct 14, 2023 | 8:15 PM
World Cup: రోహిత్‌ మాస్‌ బ్యాటింగ్‌! పాక్‌పై సంప్రదాయం కొనసాగింపు..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా ముచ్చటగా మూడో విజయం నమోదు చేసింది. ప్రతిష్టాత్మక మెగా టోర్నీలో టీమిండియా వరుసగా హ్యాట్రిక్‌ విక్టరీని ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో విజయం ఒక ఎత్తు అయితే.. ఈ గెలుపు ఇంకో ఎత్తు. ఎందుకంటే టీమిండియా గెలిచింది చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై కాబట్టి. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి.. పాకిస్థాన్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ చేసి అదరగొట్టగా.. ఆ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ..పాకిస్థాన్‌ బౌలర్లపై శివతాండవం చేశాడు. ఫోర్లు, సిక్సులతో దడదడలాడించాడు. రోహిత్‌ దెబ్బకు అసలే చిన్న టార్గెట్‌ మరింత చిన్నబోయింది. అయితే.. రోహిత్‌ సెంచరీకి కొద్ది దూరంలో అవుట్‌ కావడంతో భారత క్రికెట్‌ అభిమానులు కాస్త నిరాశచెందారు. అయితే.. పాక్‌పై టీమిండియా సూపర్‌ డామినేటింగ్‌ విక్టరీతో అంతా ఫుట్‌ ఖుష్‌ అయ్యారు.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత ఫీల్డింగ్‌ చేసేందుకు నిర్ణయించాడు. దీంతో పాకిస్థాన్‌ బ్యాటింగ్‌కు దిగి మంచి స్టార్ట్‌ అందుకుంది. పాకిస్థాన్‌ ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌-అబ్దుల్లా షఫీక్‌ 41 పరుగుల పార్ట్నర్‌షిప్‌ అందించారు. అయితే.. రోహిత్‌ శర్మ మాస్టర్‌ ప్లాన్‌తో అబ్దుల్లా షఫీక్‌ను పెవిలియన్‌కు పంపాడు. షార్ట్‌ పిచ్‌ బాల్‌ కోసం ఫీల్డ్‌ సెట్‌ చేయించి, సిరాజ్‌తో క్రాస్‌ సీమ్‌ డెలవరీ వేయించాడు రోహత్‌.. అది అద్భుతంగా వర్క్‌ అవుట్‌ అయింది. షఫీక్‌ 24 బంతుల్లో 20 రన్స్ చేసి అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే మరో ఓపెనర్‌ ఇమామ్‌.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇ‍చ్చి అవుట్‌ అయ్యాడు. 38 బంతుల్లో 36 రన్స్‌ చేసి వికెట్‌ సమర్పించుకున్నాడు.

రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌, మొహమ్మద్‌ రిజ్వాన్‌ పాక్‌కు మంచి స్టాండ్‌ ఇచ్చారు. ఇద్దరూ ఆచీతూచీ ఆడుతూ.. ‍ఫిఫ్టీ ప్లస్‌ రన్స్‌ ​భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. ఈ జోడీని సిరాజ్‌ అద్భుతంగా విడదీశాడు. 50 పరుగులు పూర్తి చేసుకున్న బాబర్‌ను సూపర్‌ డెలవరీతో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 58 బంతుల్లో 7 ఫోర్లతో 50 రన్స్‌ చేసి అవుట్‌ అయ్యాడు. ఇక్కడి నుంచి పాక్‌ బ్యాటింగ్‌ పేటమేడల కుప్పకూలిపోయింది. 155 పరుగులకు కేవలం 2 వికెట్లు కోల్పోయి మంచి పరిస్థితుల్లోనే ఉన్న పాకిస్థాన్‌.. కెప్టెన్‌ బాబర్‌ అవుటైన తర్వాత మిగతా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్లు కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, జడేజా అద్భుతంగా బౌలింగ్‌ వేశారు.

దీంతో కేవలం 36 పరుగుల వ్యవధిలో పాకిస్థాన్‌ చివరి 8 వికెట్లు కోల్పోయి.. 191 పరుగుల స్వల్ప స్కోర్‌కు ఆలౌట్‌ అయింది. ఓ దశలో పాకిస్థాన్‌ 300 రన్స్‌ చేస్తుందేమో అనిపించింది కానీ, అనూహ్యంగా భారత బౌలర్లు చెలరేగి పాక్‌ను కుప్పకూల్చారు. ఇక 191 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ రాకెట్‌ స్టార్ట్‌ ఇచ్చారు. అయితే.. గిల్‌ 11 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేసి షాహీన్‌ షా అఫ్రిద బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ​్‌లోకి వచ్చిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సైతం వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అద్బుతమైన కవర్‌ డ్రైవ్‌లు ఆడాడు. అయితే.. అతను కూడా 18 బంతుల్లో 16 రన్స్‌ చేసి అవుట్‌ అయ్యాడు.

కానీ, మరో ఎండ్‌లో రోహిత్‌ శర్మ దుమ్మురేపాడు. ముఖ్యంగా సిక్సులతో పాక్‌ బౌలర్లను దడదడలాడించాడు. ఎటాకింగ్‌ గేమ్‌తో పాక్‌పై దండయాత్ర చేసిన రోహిత్‌ శర్మ.. 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 86 రన్స్‌ చేసి.. షాహీన్‌ అఫ్రిదీ వేసిన స్టోవర్‌ డెలవరీకి అవుట్‌ అయ్యాడు. రోహిత్‌ అవుటైనా కూడా.. శ్రేయస్‌ అయ్యార్‌-కేఎల్‌ రాహుల్‌ చాలా కూల్‌గా మ్యాచ్‌ను ముగించారు. శ్రేయస్‌ అయ్యర్‌ 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులతో, రాహుల్‌ 29 బంతుల్లో 2 ఫోర్లతో 19 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచారు. టీమిండియా 30.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి.. 192 రన్స్‌ చేసి గెలిచింది. అయ్యర్‌ ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించడం విశేషం. అయితే.. ఈ విజయంతో వన్డే వరల్డ్‌ కప్స్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా తన తిరుగులేని రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. ఇప్పటి వరకు వన్డే వరల్డ్‌ కప్స్‌లో ఇండియా-పాకిస్థాన్‌ జట్లు 8 సార్లు తలపడ్డాయి. ఈ 8 సార్లు కూడా ఇండియానే గెలవడం విశేషం. ఈ మ్యాచ్‌ కంటే ముందు 7-0గా ఉన్న విన్నింగ్‌ రేషియోను.. 8-0గా మార్చుకుంది టీమిండియా. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs PAK: రోహిత్‌ ఖాతాలో అరుదైన మైల్‌స్టోన్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి