iDreamPost

రాజకీయ భీష్ముడు N.G.రంగా

రాజకీయ భీష్ముడు N.G.రంగా

కొందరు నాయకులను వారు చేపట్టిన పదవుల కన్నా వారు కృషి చేసిన రంగంతోనే చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. భారత దేశంలో చౌదరి చరణ్ సింగ్ అంటే మాజీ ప్రధాని కన్నా రైతు నాయకుడిగానే ఇప్పటికి గుర్తుపెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో  గౌతు లచ్చన్నను మాజీ ఎంపీ,ఎమ్మెల్యే కన్నా “సర్ధార్”గా ,N.G.రంగా శిష్యుడిగానే గుర్తుంచుకుంటారు. దేశ స్థాయిలో చౌదరి చరణ్ సింగ్ అయితే దక్షిణ భారత దేశంలో ఆస్థాయి గుర్తింపున్న రైతు నాయకులు N.G.రంగా గారు.

N.G.రంగా అనేకమంది నాయకులను తయారుచేసిన నాయకుడు.. అందుకే గోగినేని రంగానాయకులు N.G.( నాయకుల.గోగినేని) రంగా అయ్యారు. 1900లో పుట్టిన రంగా ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రంలో B.Litt చేసి మద్రాసులోని పచ్చయప్పాస్‌ కాలేజీలో  ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలి రోజుల్లో నెల్లూరు వెంకట్రాముడుగారితో కలిసి  వెంకటగిరి జమిందారీ వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించారు.

చదివింది ఆర్థికశాస్త్రమే అయినా ఆయన జీవితం మొత్తం రైతులు,వ్యవసాయం కోసమే అంకితం చేశారు. అనేక జాతీయ,అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొన్నారు. సొంత గ్రామం నిడుబ్రోలులో నిరంతర రాజకీయపాఠశాల నిర్వహించారు.

రంగా రాజకీయలు –  పదవులు

కృషికార్ లోక్ పార్టీ

రంగా 1930,1935-1945 మధ్య కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1946-1950 మధ్య రాజ్యాంగ శాసనసభకు ఎన్నికయ్యిన రంగా 1947లో ప్రొవిజనల్ పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. నెహ్రు విధానాలతో విబేధాలు రావటంతో కృషికార్ లోక్ పార్టీ (KLP)ని స్థాపించి 1951 మద్రాస్ రాష్ట్ర శాసనసభలో పోటీచేసి 15 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. ఇందులో గౌతు లచ్చన్న బలంతో ఉత్తరాంధ్రలో 10 స్థానాలు KLP గెలిచింది.

Also Read:  టీడీపీ తరువున విజయనిర్మల పోటీచేశారా?కృష్ణ మద్దతు ఇచ్చారా?

రంగా మాత్రం 1951 ఎన్నికల్లో గుంటూరు లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు.  KLP ఓటమి, నెహ్రు పిలుపు మేరకు రంగా కాంగ్రెసులో చేరి 1952లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1957 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున తెనాలి నుంచి గెలవటంతో  రంగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అప్పట్లో నెహ్రు మంత్రి పదవి తీసుకోమని ఆహ్వానించినా రంగా తిరస్కరించారని చెబుతారు.

స్వతంత్ర పార్టీ -రంగా

ఓటమి నెహ్రు విధానాలతో విభేదించిన రాజాజీ(రాజగోపాలాచారి) 1959లో స్వతంత్రపార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి N.G.రంగా అధ్యక్షుడిగా పనిచేశారు.నెహ్రు “సహకార వ్యవసాయం” ఆలోచనను వ్యతిరేకించి రాజాజీ స్వతంత్రపార్టీని ఏర్పాటు చేస్తే రైతునాయకుడు రంగా దానికి తొలి అధ్యక్షుడు అవ్వటం ఇంకా విచిత్రం. 

1962 లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్రపార్టీ తరుపున తెనాలి లోక్ సభకు పోటీచేసిన రంగా ఓడిపోయారు. 1962లోనే జరిగిన ఆంధ్రా శాసనసభలో 19 సీట్లు గెలిచింది,అప్పుడు కూడా  ఉత్తరాంధ్రలో ఏడు స్థానాలు, రాయలసీమలో మరో ఎనిమిది స్థానాలు గెలిచారు. తెలంగాణాలో కేవలం నాలుగు స్థానాలే గెలిచింది. రంగా సొంత జిల్లా గుంటూరు లో ఒక్క సీట్ కూడా గెలవక పోవటం గమనార్హం.

1962 చిత్తూర్ ఉప ఎన్నికలు

1957 ఎన్నికల్లో చిత్తూరు నుంచి గెలిచిన అనంతశయనం అయ్యంగార్ లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన తొలి నాయకుడు అనంతశయనం అయ్యంగార్, ఆ తరువాత నీలం సంజీవ్ రెడ్డి, బాలయోగి స్పీకర్ లుగా పనిచేసారు.

అనంతశయనం అయ్యంగార్ 1962లో చిత్తూర్ స్థానం నుంచి తిరిగి గెలిచారు కానీ కొన్ని నెలలకే లోక్ సభకు రాజీనామ చేసి బీహారు గవర్నరుగా వెళ్లారు. దీనితో ఖాళీ అయిన చిత్తూర్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో జనరల్ ఎన్నికల్లో తెనాలి నుంచి ఓడిపోయి ఉన్న రంగా స్వతంత్ర పార్టీ తరుపున పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ తరుపున మంచి పేరున్న టి.ఎన్ .విశ్వనాథ రెడ్డి పోటీచేశారు టి.ఎన్ .విశ్వనాథ రెడ్డి 1951లో చిత్తూర్ నుంచి 1957లో రాజాం పేట నుంచి కాంగ్రెస్ తరుపున లోక్ సభకు ఎన్నికయ్యారు. టి.ఎన్ .విశ్వనాథ రెడ్డి 1962 జనరల్ ఎన్నికల్లో రాజంపేట లోక్ సభకు కాంగ్రెస్ తరుపున పోటీచేసి ఓడిపోయారు. ఆ విధంగా జనరల్ ఎన్నికల్లో వేరు వేరు నియోజక వర్గాలలో ఓడిపోయిన రంగా , టి.ఎన్ .విశ్వనాథ రెడ్డి  చిత్తూర్ ఉప ఎన్నికల్లో పోటీపడ్డారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున నాటి ఏఐసీసీ అధ్యక్షుడు దామోదరం సంజీవయ్య, ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్, కర్ణాటక రెవిన్యూ మంత్రి  కిష్టప్ప,ఆంధ్రా మంత్రులు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, జగ్గయ్య  విస్తృతంగా ప్రచారం చేశారు. స్వతంత్ర పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో కమ్యూనిస్ట్ నాయకులు తరిమెల నాగిరెడ్డి,మాకినేని బసవపున్నయ్య కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించమని ప్రచారం చేసారు.

Also Read: దక్షణాది జలియన్ వాలా భాగ్ గురించి తెలుసా?

రంగా తరుపున స్వతంత్రపార్టీ నాయకుడు రాజాజీ, గౌతు లచ్చన్న, భారతీ దేవి (రంగా శ్రీమతి), ప్రజా పార్టీ నాయకుడు తెన్నేటి విశ్వనాథం ప్రచారం చేశారు. మద్రాస్ నగరంలో జరిగిన ఒక  ఉప ఎన్నికలో స్వతంత్రపార్టీ డీఎంకే కు మద్దతు ఇచ్చింది. దీనికి ప్రతిగా చిత్తూర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీకి డీఎంకే మద్దతు ఇచ్చింది. తమిళులు గణనీయంగా ఉన్న చిత్తూరు లోక్ సభలో అప్పట్లో డీఎంకే ప్రాభవం బాగా ఉండేది. నాటి హోరా హోరి పోరులో రంగా 1553 ఓట్ల తేడాతో గెలిచారు.

గురువును గెలిపించిన గౌతు లచ్చన్న

1967 ఎన్నికల్లో గౌతు లచ్చన్న శ్రీకాకుళం ఎంపీ గా ,సోంపేట ఎమ్మెల్యే గా గెలిచారు. లచ్చన్న గురువు రంగా సిట్టింగ్ సీట్ చిత్తూర్  లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. గౌతు లచ్చన్న శ్రీకాకుళం ఎంపీ స్థానానికి రాజీనామా చేసి తన గురువు రంగా ను శ్రీకాకుళం నుంచి పోటీకి పెట్టి గెలిపించుకున్నారు.

స్వాతంత్రం వచ్చిన తరువాత జరిగిన వరుస లోక్ సభ ఎన్నికలు 1951,1957 & 1962 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన బొడ్డేపల్లి రాజగోపాల్ రావ్ 1967 ఎన్నికల్లో గౌతు లచ్చన్న మీద ఓడిపోయారు. లచ్చన్న రాజీనామా తో జరిగిన శ్రీకాకుళం లోక్ సభకు కాంగ్రెస్ తరుపున బొడ్డేపల్లి రాజగోపాల్ రావ్ ,స్వతంత్ర పార్టీ తరుపున స్థానికేతరుడైన రంగా పోటీపడ్డారు.. సహజంగానే కొన్ని నెలల ముందే ఓడిపోయిన సానుభూతి, స్థానికుడైన బొడ్డేపల్లి గెలుపు సులభంగా గెలవాలి కానీ లచ్చన్న ఒంటిచేత్తో రంగా ను గెలిపించి లోక్ సభకు పంపారు.  

రెండు వరుస జనరల్ ఎన్నికల్లో ఓడిపోయి ఉప ఎన్నికల్లో వేరు వేరు స్థానాల నుంచి గెలిచిన రికార్డ్ రంగా గారిదే

సంజీవ రెడ్డి ,రంగా రాజకీయ వైరం

1948 లో జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల్లో రంగా నీలం సంజీవ్ రెడ్డిని ఓడించారు. అప్పటి నుంచి రంగా సంజీవరెడ్డి మధ్య వర్గపోరు మొదలయ్యింది.   1953 లో కర్నూల్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ప్రజా సోషలిస్టు పార్టీలో ఉన్న ప్రకాశం పంతులు కాంగ్రెసులో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. నీలం సంజీవ్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ప్రకాశం పంతులు గారికి అప్పటికి 80 సంవత్సరాల వయోభారంతో చూపు మందగించింది. సంజీవ రెడ్డినే డి ఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరించేవారు.

Also Read: బాపట్ల కాలేజ్- ముప్పలనేని-రాజకీయం

అప్పటి ప్రభుత్వం తీసుకున్న మద్యపాన నిషేధ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కృషి కార్ లోక్ పార్టీ నేత గౌతు లచ్చన్న కర్నూల్ జిల్లా కరివేన లో పెద్ద ఎత్తున దీక్షలు చేశారు… ఈ వివాదం చిలికి చిలికి చివరికి ప్రకాశం పంతులు గారు అవిశ్వాస తీర్మానంలో రెండు ఓట్ల తేడాతో ఓడిపోయి  ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో కాంగ్రెసులో ఉన్నా రంగా  తన శిష్యుడు కృషి కార్ లోక్ పార్టీ నేత గౌతు లచ్చన్నను ప్రభుత్వం పడగొట్టకుండా ఒప్పించలేదన్న కోపం కూడా సంజీవ రెడ్డికి ఉండేది. అందుకే రంగా ఓటమికి సంజీవ రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టేవారు. 1948 నుంచి రంగా -సంజీవ్ రెడ్డి మధ్య ఉన్న వైరంలో రంగాను కోస్తా ప్రాంతంలో అనేకసార్లు ఓడించిన సంజీవ్ రెడ్డి సొంత ప్రాంతం అయిన రాయలసీమలో మాత్రం రంగాను ఓడించలేకపోయారు.

కాంగ్రెస్ పునః ప్రవేశం

1971 ఎన్నికల్లో లో శ్రీకాకుళం నుంచి ఓడిపోయినా తరువాత, దాదాపు 2 దశాబ్దాలు కీలక కాంగ్రెస్ వ్యతిరేక నాయకుడిగా ఉన్న రంగా తిరిగి కాంగ్రెసులో చేరి ఎమర్జెన్సీ సమయంలో ఇందిరకు మద్దతు ఇచ్చారు.

రంగా 1977-1980 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. గుంటూరు లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున 1980,1984,1989 ఎన్నికల్లో గెలిచి 1991 ఎన్నికల్లో టీడిపీ లాల్ జాన్ బాషా చేతిలో ఓడిపోయారు.

టీడీపీ ఆవిర్భావం తరువాత గుంటూరు లోక్ సభ స్థానంలో తొలిసారి గెలిచింది ఆ ఎన్నికలతోనే. లాల్ జాన్ భాషా ఆ తరువాత రెండుసార్లు గుంటూరు నుంచి మరోసారి నరసరావు పేట నుంచి పోటీచేశారు కానీ గెలవలేకపోయారు. అంటే లాల్ జాన్ భాషా గెలిచిన ఏకైక ఎన్నిక 1991 లో రంగా మీదనే!

సైద్దాంతిక వైరుధ్యాల జీవితం

సొంత పార్టీ కృషికార్ లోక్ పార్టీ ని వీడి కాంగ్రెసుతో కొన్నినాళ్ళు దాన్ని కూడా వీడి స్వతంత్రపార్టీ చివరికి మళ్లీ  కాంగ్రెసులో చేరి మూడుసార్లు లోక్ సభకు,ఒక సరి రాజ్యసభకు ఎన్నికయిన రంగా రాజకీయ జీవితం వైరుధ్యాల పుట్ట. తొలినాళ్లలో జమిందారీల రద్దుకై పోరాడిన రంగా జమిందారుల పార్టీగా ముద్రపడ్డ స్వతంత్రపార్టీ  అధ్యక్షుడిగా పనిచేయటం పై విశ్లేషణ చేయటం కష్టతరమైన విషయం.

పార్లమెంటేరియన్ గా స్వర్ణోత్సవం

1947లో ప్రొవిజనల్ పార్లమెంటుకు ఎన్నికయినప్పటి నుంచి 1991 మధ్య అంటే దాదాపు నాలుగున్నర దశాబ్దాలలో కేవలం 1971-1977 మధ్య మాత్రమే రంగా పార్లమెంటులో సభ్యులు కాదు.1991 ఎన్నికల్లో గెలిచి పార్లమెంటేరియన్ గా స్వర్ణోత్సవం పూర్తి చేసుకోవాలన్న కోరికతో 91 సంవత్సరాల వయస్సులో 1991 ఎన్నికల బరిలో దిగారు. వాస్తవంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ రంగా శిష్యుడు రాయపాటి సాంబశివరావు కు వస్తుందన్న ప్రచారం జరిగింది. అప్పట్లో గుంటూరులో రాయపాటి సోదరులు హవా బాగా ఉండేది. దొడ్డపనేని ఇందిర మరణంతో జరిగిన ఉప ఎన్నికలో జిల్లాపరిషత్ చైర్మన్ గా రాయపాటి శ్రీనివాస్ గెలిచారు.

ఓటమితో ముగిసిన రాజకీయ జీవితం

1991 ఎన్నికలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉండేది. రాజీవ్ గాంధీ మరణం కన్నా ముందు ఎన్నికలు జరిగిన శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం 19 లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకుంది. రాజీవ్ మరణం తరువాత జరిగిన రెండో దశ ఎన్నికల్లో రాయలసీమ, తెలంగాణలోని 23 స్థానాలకు గాను 17 సీట్లు గెలుచుకుంది.

Also Read: టీడీపీని వీడిన బాబు చిరకాల మిత్రుడు..

ఆ ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీచేసిన రంగా టీడీపీ అభ్యర్ధీ లాల్ జాన్ బాషా మీద 14,700 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. రాయపాటి వర్గం గురువుకు ద్రోహం చేసిందని కాంగ్రెసులో ఒక వర్గం ఆరోపించింది. అదేమీ లేదు రంగా గెలుపు మా గెలుపు .. మనస్ఫూర్తిగా పనిచేశాం అని రాయపాటి సోదరులు చెప్పారు.

1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా కన్నా లక్ష్మీనారాయణకు 1991లో నేదురుమల్లి క్యాబినెట్ లో రంగా ఆశీస్సులతో మంత్రిపదవి దక్కింది. రంగా శ్రీమతి భారతి దేవి గారు కూడా రంగా గారి రైతు పోరాటాలలో పాల్గొన్నారు. రంగా భారతి దేవి దంపతులకు సంతానం లేదు ,వారు బొట్టు సుబ్బారావ్ అనే అతన్ని పెంచుకున్నారు.. ఆయన రాజకీయాల్లోకి రాలేదు.

చివరి రోజుల్లో ఒక ఇంటర్వ్యూ లో రంగా గారు “కాంగ్రెసులో ఉండవలసిన రోజుల్లో బయట ఉన్నాను.. కాంగ్రెస్ తిరోగమనంలో ప్రయాణిస్తున్నప్పుడు కాంగ్రెసులో ఉన్నాను” అని చెప్పారు… రంగా రాజకీయ సిద్ధాంతం ఏంటి?టక్కున చెప్పలేము.. రైతు నాయకుడు అని చెప్పినంత సులభంగా సోషలిస్టు అనో ,జస్టిస్ పార్టీ వాది అనో, గాంధేయ సిద్ధాంత వ్యతిరేకి అనో ,కాంగ్రెస్ వ్యతిరేకో అని చెప్పలేము .. గాంధీ తో ఆయన చర్చలను “Bapu Blesses” పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయానికి N.G.రంగా పేరుతొ “ఆచార్య N.G.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం” అని పేరు పెట్టారు.

N.G.రంగా 09-Jun-1995న చనిపోయారు.. ఆ విధంగా ఒక గొప్పనాయకుడి జీవితం ఓటమితో మొదలై ఓటమితో ముగిసింది.. కానీ 45 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ,పదుల మంది శిష్యులును నాయకులగా తయారుచేసిన చరిత్ర రంగా గారిది..రంగా గారిలా ఒకే రాష్ట్రంలో నాలుగు లోక్ సభ స్థానాల నుంచి గెలిచిన మరే ఇతర నాయకుడు లేరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి