బాపట్ల కాలేజ్- ముప్పలనేని-రాజకీయం

By Siva Racharla 20-11-2019 10:29 AM
బాపట్ల కాలేజ్- ముప్పలనేని-రాజకీయం

వ్యాపారులు రాజకీయనాయకులుగా ఎదిగారా? లేక రాజకీయ నాయకులే వ్యాపారవేత్తలుగా మారారా? అంటే ఇతిమిద్దంగా సమాధానం చెప్పటం కష్టం. నాలుగు దశాబ్దాలు రాజకీయ,విద్య రంగంలో విశేష కృషి చేసిన ఒక నాయకుడి గురించి చెప్పుకోవాలి.

బాపట్ల ఏముంది ఆఊరిలో? సముద్రానికి దగ్గరగా చిన్న ఊరు. పక్కన ఉన్న చీరాలలోలాగా ILTD లాంటి కంపెనీ కానీ, ఓడరేవు కానీ లేదు. కానీ కొందరు దార్శనికులు ఉంటారు, ఆ ఊరి గతిని, ఆ ప్రాంత గతిని మార్చటానికి. బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ ,బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ తెలియని వాళ్ళు ఉంటారా? స్వాతంత్రానికి పూర్వమే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నపుడు 1945లో బాపట్లలో అగ్రికల్చర్ కాలేజిని స్థాపించారు. NG .రంగా రైతు నాయకులుగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. వారి సొంత ఊరిలో రాజకీయ పాఠశాల ఏర్పాటు చేసి అనేకమంది రాజకీయ నాయకులను తయారు చేశాడు . NG .రంగా పేరుతోనే N.G.Ranga Agricultural University నడుస్తుంది.

ముప్పలనేని శేషగిరిరావు NG రంగా శిష్యులు. ఆయన స్ఫూర్తితో 1972,1978లో ఎమ్మెల్యే గా పోటీచేసి ఓడిపోయారు. రెండు వరుస ఓటముల తరువాత శేషగిరిరావు విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టారు. 1962లో కోన ప్రభాకర్ రావ్,యార్లగడ్డ కృష్ణమూర్తి,యడవల్లి సూర్య నారాయణ తదితరులు కలిసి స్థాపించిన "బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ" బాధ్యతలు 1981లో శేషగిరిరావు తీసుకున్నారు, నిన్న చనిపోయేంత వరకు ఆ బాధ్యతలో కొనసాగారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ తరుపున బాపట్ల పబ్లిక్ స్కూల్, బాపట్ల జూనియర్ కళాశాల,బాపట్ల పాలిటెక్నిక్ కాలేజ్, బాపట్ల ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్, బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్,బాపట్ల మహిళా ఇంజినీరింగ్, మరియు బి.ఫార్మసి కాలేజీలను స్థాపించి,  కే.జీ నుండి పి.జీ వరకు విద్యని అందుబాటులోకి తెచ్చారు.ఈ కాలేజీలు లేని బాపట్లను ఊహించలేము. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ను కూడా బాపట్లలోనే ఏర్పాటు చేశారు.

శేషగిరిరావు 1972లో స్వతంత్ర పార్టీ తరుపున బాపట్ల నుంచి పోటీ చేసి కోన, రఘుపతి గారి తండ్రి, మాజీ స్పీకర్, మంత్రి అయిన కోన ప్రభాకరరావు గారి చేతిలో 2,289 ఓట్ల తేడాతో ఓడిపోయారు. శేషగిరి రావ్ 1978 ఎన్నికలలో కూడా కోనా ప్రభాకరరావు మీద 189 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో శేషగిరిరావు జనతా పార్టీ తరుపున పోటీచేశారు.రెండు ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చిన శేషగిరిరావు కాంగ్రెసులో చేరితే తనకు తిరుగుఉండదని ఆ సమయంలో పీసీసీ ప్రెసిడెంట్ కూడా అయిన కోన ప్రభాకరరావు భావించి, శేషగిరి రావును కాంగ్రెసులో చేర్చుకొని ఎమ్మెల్సీని చేశారు. కానీ శేషగిరి రావు మద్దతు ఇచ్చినా 1983 ఎన్నికల్లో ప్రభాకరరావు ఓడిపోయారు,ఆ తరువాత రాజకీయ విశ్రాంతి తీసుకున్నారు.

1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ శేషగిరిరావుకు టీడీపీ టికెట్ ఇచ్చారు,ఆయన కోస్తా జిల్లాలోని 152 స్థానాలలో అందరికన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచాడు. టెక్కలి నుంచి పోటీచేసిన ఎన్టీఆర్ కు 40,890 ఓట్ల మెజారిటీ రాగా శేషగిరిరావుకు 41,494 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇంత మెజారిటీ రావటానికి ఒక ప్రత్యేక పరిస్థితి కారణం. 1994 ఎన్నికల్లో BSP తరపున కత్తిపద్మారావు పోటీ చేసి రెండవ స్థానంలో నిలువగా, కాంగ్రెస్ అభ్యర్థి పీటర్ పాల్ మూడవ స్థానములో నిలిచాడు. 1994 ఎన్నికల్లో BSP పోటీ చేసిన 235 స్థానాలలో ఒక్క బాపట్లలోనే డిపాజిట్ దక్కించుకొంది. కాంగ్రెస్ కు సహజంగా ఓటు వేసే దళితులు కూడా కత్తి పద్మారావుకు ఓటు వేస్తారని, ఓటు బ్యాంకును కాపాడుకోవటానికి దళితుడైన పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే చుక్క పీటర్ పాల్ ను బాపట్ల బరిలోకి దింపింది. కానీ కాంగ్రెస్ వ్యూహం పనిచేయలేదు, శేషగిరిరావు కోస్తా జిల్లాల్లోనే అత్యధిక మెజారిటీతో గెలవగా, కాంగ్రెస్ అభ్యర్థి మూడవ స్థానానికి పరిమితం అయ్యాడు.

శేషగిరిరావు వైశ్రాయ్ సంఘటనలో ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచారు.1996 లోక్ సభ ఎన్నికల్లో లక్ష్మీపార్వతి వర్గం తరుపున విజ్ఞాన్ రత్తయ్యను పోటీకి పెట్టి దాదాపు లక్ష ఓట్లు సాధించారు. 1998 లోక్ సభ ఎన్నికల్లో బాపట్ల నుంచి కాంగ్రెస్ తరుపున నేదురుమల్లి పోటీచేశారు. శేషగిరిరావు కాంగ్రెసులో చేరి ఆ ఎన్నికల్లో నేదురుమల్లికి మద్దతు ఇచ్చారు. ప్రతిఫలంగా నేదురుమల్లి 1999 బాపట్ల ఎమ్మెల్యే టిక్కెట్ శేషగిరిరావుకు ఇప్పించారు, కానీ ఆయన గెలవలేక పోయారు. 2006 లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో టీడీపీలో చేరారు.

ఆవిధంగా శేషగిరిరావు రాజకీయ జీవితంలో ఎత్తుపల్లాలు చూశారు కానీ విద్యారంగంలో తిరుగులేని విజయాలు సాధించారు. మెడికల్ కాలేజీ అనుమతి కూడా వచ్చింది. కానీ ఏవో కారణాలతో అది పూర్తి కాలేదు. ఇప్పుడు అన్ని రంగాల వ్యాపారులు రాజకీయ అవతారం ఎత్తారు కానీ విద్యారంగ అభివృద్ధికి చేస్తున్న కృషి అల్పం. చిన్న ఊర్లలో విద్యాలయాలు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పటానికి బాపట్ల మంచి నిదర్శనం.
నిన్న మరణించిన ముప్పలనేని శేషగిరిరావు గారి స్మృతిలో ...

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News