iDreamPost

అనంతపురంలో మళ్ళీ లాక్ డౌన్ అమలు

అనంతపురంలో మళ్ళీ లాక్ డౌన్ అమలు

లాక్ డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనాను కట్టడి చేయడానికి అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఇప్పటికే కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ తిరిగి అమలు చేస్తున్నారు. తమిళనాడులో చెన్నై సహా నాలుగు జిల్లాల్లో లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. దీంతో కరోనా తీవ్రతను అదుపు చేయడానికి అధికారులు మళ్ళీ లాక్ డౌన్ విధిస్తున్నారు. సోమవారం నుండి ఒంగోలులో తిరిగి లాక్ డౌన్ విధిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. దాంతో మరో 14 రోజుల లాక్ డౌన్ సోమవారం నుండి ఒంగోలులో అమల్లోకి రానుంది.

కాగా కరోనా తీవ్రత అధికంగా అనంతపురం జిల్లాలో కూడా రేపటినుండి లాక్ డౌన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారికంగా ప్రకటించారు. అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, యాడికి, హిందూపురం, కదిరితో పాటు కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించ‌నున్నారు. ఎవ‌రైనా నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే డిజాస్టర్ చట్టం కింద క్రిమినల్ కేసులు న‌మోదు చేస్తామ‌ని జిల్లా ఎస్పీ ఏసుబాబు హెచ్చ‌రించారు.

రేపటినుండి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో ఉదయం 6 నుంచి 11వరకు దుకాణాలకు అనుమతి ఇచ్చారు.ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడుస్తాయ‌ని తెలిపారు. హోటల్స్ లో ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే పార్సిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

కాగా అనంతపురంలో 692 కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 211 మంది వ్యాధి నుండి కోలుకుని డిశ్చార్జ్ కాగా 475 ఆక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటివరకూ ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో అనంతపురంలో మళ్ళీ లాక్ డౌన్ విధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి