iDreamPost

హైదరాబాద్ జర్నలిస్టులకు కరోనా వైరస్ .. అందరిలోను టెన్షన్

హైదరాబాద్ జర్నలిస్టులకు కరోనా వైరస్ .. అందరిలోను టెన్షన్

హైదరాబాద్ లో పనిచేస్తున్న నలుగురు జర్నలిస్టులకు కరోనా వైరస్ ఎటాక్ అయ్యింది. ఈ నలుగురిలో ముగ్గురేమో నేషనల్ మీడియాలో ఫొటో జర్నలిస్టులు. ఎప్పుడైతే నలుగురు జర్నలిస్టులకు వైరస్ ఎటాక్ అయినట్లు బయటపడిందో వివిధ వర్గాల్లో టెన్షన్ మొదలైపోయింది. నాలుగో వ్యక్తేమో ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్న జర్నలిస్టు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రోజుల తరబడి పై నలుగురు జర్నలిస్టులు సచివాలయంతో పాటు మిగిలిన చోట్ల కూడా చాలామందితో కలిసే తిరుగుతున్నారట. ఎప్పుడైతే నలుగురు జర్నలిస్టులకు వైరస్ ఉందని తేలిందో వెంటనే వాళ్ళు ఎవరెవరితో తిరగారనే విషయమై అధికారులు ఆరాలు తీస్తున్నారట.

మొత్తం మీద కనీసం 40 మంది జర్నలిస్టులతో వీళ్ళ నలుగురు కాంటాక్టులో ఉన్నట్లు సమాచారం. ముందు వీళ్ళు నలుగురిని క్వారంటైన్ కు పంపిన అధికారులు మిగిలిన వాళ్ళను గుర్తించే పనిలో ఉన్నారు. వీళ్ళకు కూడా అవసరమైన పరీక్షలు చేయించేందుకు రెడీ అవుతున్నారు.

హైదరాబాద్ లో నలుగురికి కరోనా సోకటంతో మిగిలిన సర్కళ్ళిల్లో కూడా టెన్షన్ మొదలైంది. ఎందుకంటే జర్నలిస్టులు కేవలం సహచరులతోనే ఉండరు. రాజకీయ నేతల దగ్గరకు, ఉన్నతాధికారుల దగ్గరకు కూడా వెళుతుంటారు. పై రెండు వర్గాలతోనే కాదు అనేక మందిని ప్రతిరోజు కలుస్తుంటారు వృత్తిలో భాగంగా. కాబట్టి పాజిటివ్ ఉన్న నలుగురి ద్వారా ఇంకెంతమందికి సోకిందనే విషయంలో అధికారులు ఆరాలు తీస్తున్నారు.

ఇప్పటికే ముంబాయ్ లో సుమారు 80 మందికి వైరస్ సోకిన విషయం తెలిసిందే. చెన్నైలో కూడా 45 మంది జర్నలిస్టులకు వైరస్ సోకినట్లు గతంలోనే బయటపడింది. విజయవాడలో కూడా విజయవాడ ప్రెస్ క్లబ్+ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జరిపిన పరీక్షల్లో ఆరుగురు జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకినట్లు బయటపడింది. అయితే కారణాలు తెలీదు కానీ జర్నలిస్టులకు కరోనా వైరస్ పరీక్షలను అర్ధాంతరంగా నిలిపేశారు.

వృత్తిలో భాగంగా ఎంత ఒత్తిడున్నా జర్నలిస్టులు ముందు తమ రక్షణకే అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సుంటుందన్న విషయాన్ని మరచిపోకూడదు. ఒక్క జర్నలిస్టుకు వైరస్ సోకితే తన సహచరులతో పాటు తనపై ఆధారపడిన కుటుంబసభ్యులకు కూడా వెంటనే సోకే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని మరీ అత్యుత్సాహానికి పోకుండా ఉండాలి. నిజంగా జర్నలిస్టులందరికీ ప్రభుత్వాలు కచ్చితంగా పరీక్షలు చేయిస్తే ఎంతమందికి కరోనా వైరస్ సోకిందో బయటపడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి